టీడీపీలో 'స్థానిక' సమరం.. కీలక పీఠాలపై కర్చీఫ్‌లు!
అయితే.. ఇప్పుడు వీరిలో సగానికి సగం మంది స్థానిక ఎన్నికల్లో మేయర్, మునిసిపల్ చైర్మన్ పోస్టుల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో కొందరు కీలక నేతల వారసులు రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి కొంత మంది గత ఎన్నికల్లోనే తమ అదృష్టం పరిశీలించుకున్నారు. అయితే.. గత ఎన్నికల్లో కొందరు మాత్రమే సక్సెస్ కాగా.. చాలా మంది విఫలమయ్యారు. ఇలాంటివారిలో టీడీపీ నుంచి , వైసీపీ నుంచి కూడా యువనేతలు ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరిలో సగానికి సగం మంది స్థానిక ఎన్నికల్లో మేయర్, మునిసిపల్ చైర్మన్ పోస్టుల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వారసుల వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
టీడీపీ విషయానికి వస్తే.. గత స్థానిక ఎన్నికల్లో విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే సతీమణికి మేయర్ పీఠం ఇవ్వాలని నిర్ణయించుకుని.. ఆమెను బరిలో నిలిపారు. అయితే.. ఆమె పరాజయం పాలయ్యారు. కాపు సామాజిక వర్గానికే చెందిన నాయకులే అయినప్పటికీ... ఇలా విఫలం కావడంతో వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అయింది. కాగా.. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మేయర్ పోస్టు కోసం వారసుడిని రంగంలోకి దింపుతున్నారు.
గుంటూరులోనూ టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత తన కుమారుడిని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. పలు పార్టీలు మారిన ఆయన.. ప్రస్తుతం ఓ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. దీంతో కనీసం.. తన కుమారుడికి.. మేయర్ పీఠం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. సదరు నేత.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. ఆయన కుమారుడు గుంటూరు మేయర్‌గా చక్రం తిప్పారు. ఇప్పుడు అదే గ్రాఫ్‌ను ఆయన చూపిస్తున్నారు.
అలాగే.. తిరుపతిలోనూ టీడీపీ సీనియర్ నాయకురాలు.. ప్రస్తుతం నామినేటెడ్ పదవిలో ఉన్న మాజీ మంత్రి కూడా.. తగుదునమ్మా అంటూ.. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో పీఠం కోసం పట్టుబడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈమె.. గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నా.. రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీలోకి వచ్చాక.. పెద్దగా దూకుడు చూపించలేక పోతున్నారు.
కానీ, భార్యాభర్త ఇద్దరూ టీడీపీలోనే ఉండడం.. చంద్రబాబు దగ్గర మంచి మార్కులు ఉన్న నేపథ్యంలో సదరు మహిళా నాయకురాలు.. తనకు పీఠం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇలా.. కీలక కార్పొరేషన్లు, మునిసిపాలిటిల్లో వారసులు.. సీనియర్లు క్యూ కట్టడంతో స్థానిక సమరం.. టీడీపీలో చర్చకు దారితీస్తోంది. ఎవరిని కాదంటే.. ఏం జరుగుతుందోనన్న ఆలోచనలో పార్టీ ఉండడం గమనార్హం.