ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక...ఛాన్స్ కోసం ఇండియా కూటమి ?

దేశంలో రాజకీయం మెల్లగా మారుతోంది. అది తాజాగా వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల ద్వారా తేటతెల్లం అయింది.

Update: 2026-08-12 04:12 GMT

దేశంలో రాజకీయం మెల్లగా మారుతోంది. అది తాజాగా వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల ద్వారా తేటతెల్లం అయింది. బీహార్ లో బీజేపీ కంచుకోట అసెంబ్లీ సీటు బకీంపూర్ లో కాషాయం పార్టీ ఓటమి పాలు అయింది. గుజరాత్ లో గెలిచినా మెజారిటీ తగ్గింది. మధ్య ప్రదేశ్ లో బీజేపీ ఉప ఎన్నికల్లో ఓడింది. ఇక్కడ మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ చేతిలో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ ఓడిపోయారు. ఇలా చూస్తే కనుక బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే పట్ల మెల్లగా మోజు సడలిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే అదే సమయంలో ఇండియా కూటమి పుంజుకోవడానికి తగిన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

కూటమి ఒక్కటిగా ఉంటేనే :

ఇండియా కూటమిలో అనేక పార్టీలు ఉన్నాయి. అయితే అందులో చాలా పార్టీల నేతలకు ప్రధాని పీఠం మీద ఆశలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటమి చెందడం, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పదవి కోల్పోవడంతో భారీ పోటీ అయితే తగ్గిందని అంటున్నారు. అయినా సరే ఇప్పటికీ ప్రధాని అభ్యర్ధి విషయంలో ఏకాభిప్రాయం ఇండియా కూటమిలో రావడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ పెద్ద పార్టీగా పెద్దన్నగా ఉన్నా కూడా రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిత్వం మీద అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ ఏకపక్ష విధానాలు అనుసరిస్తారు అని కూటమి పార్టీలలో కొంత చర్చ ఉంది అని అంటున్నారు.

ఆ పార్టీల గుర్రుతో :

ఇక ఇటీవల జరిగిన తమిళనాడు కేరళ అసెంబ్లీ ఎన్నికలలో మిత్ర పక్షాలు అయిన డీఎంకే సీపీఎంలను రాహుల్ గాంధీ తన రాజకీయంతో దూరం చేసుకున్నారని అంటున్నారు. కేరళలో గెలుపు కోసం మాజీ సీఎం పినరయి విజయన్ మీద రాహుల్ నేరుగా చేసిన విమర్శలతో వామపక్షాలు నొచ్చుకున్నాయి. అలాగే తమిళనాడులో దశాబ్దాల డీఎంకే స్నేహాన్ని పక్కన పెట్టి విజయ్ పార్టీని తలకెత్తుకోవడం పట్ల ద్రవిడ పార్టీ మండుతోంది. రాజకీయ వ్యూహాలు అమలు చేసినపుడు మిత్రులు నొచ్చుకోకుండా చేయాలని రాహుల్ గాంధీ దూకుడుతో చేస్తున్న రాజకీయం వల్లనే ఆయన పట్ల మిత్రులు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. దాంతో పాటుగా యూపీలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఇండియా కూటమిలో ఇపుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన నిర్ణయం కూడా కీలకం కానుంది అని అంటున్నారు.

ప్రియాంకను ముందు పెట్టి :

అదే సమయంలో ప్రియాంకా గాంధీ పట్ల ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ లోనూ సానుకూలత వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. పార్లమెంట్ లో ఆమె చేసే ప్రసంగాలు కూడా అర్ధవంతంగా ఉంటున్నాయని ప్రత్యర్ధులతో ఆమె వ్యవహరించే తీరు ఎంతో వివేచనతో ఉంటుందని అంటున్నారు. దాంతో పాటు సెంటిమెంట్ అస్త్రంగా ఆమెను ముందు పెడితే ఇందిరా గాంధీ మనవరాలుగా మహిళా నేతగా ఆమె దూసుకుని పోతారని అంటున్నారు. మోడీ వర్సెస్ రాహుల్ కంటే మోడీ వర్సెస్ ప్రియాంకా గాంధీ అంటే ఇండియా కూటమి సూపర్ హిట్ అయ్యే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని అంటున్నారు. అంతే కాకుండా ఆమె అభ్యర్ధిత్వం పట్ల ఇండియా కూటమిలో సర్వామోదం లభిస్తుందని డీఎంకే లాంటి పార్టీలు కానీ ఎస్పీ అధినేత అఖిలేష్ లాంటి వారు కానీ ఓకే అంటారని చెబుతున్నారు.

చావో రేవోగానే :

ఈసారి ఎన్నికలు కాంగ్రెస్ కి చావో రేవో అన్నట్లుగానే ఉంటాయని అంటున్నారు. వరసగా మూడు సార్లు ఓడిన కాంగ్రెస్ ఈసారి ఓడితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల అలాంటి పరిస్థితి రానీయకుండా ఏమైనా చేసి గెలుపే పరమావధిగా ముందుకు సాగాలని కాంగ్రెస్ చూస్తోంది. దాంతో ప్రియాంక అభ్యర్ధిత్వం ప్రధాని పదవికి కచ్చితంగా ముందుకు తెస్తారని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఎన్డీయేకు గట్టి పోటీ తప్పదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News