పింగళి వెంకయ్యకు భారతరత్న...ఎందుకు ఆలస్యం ?
ఏపీలో కృష్ణా జిల్లాలో పుట్టిన దేశ భక్తుడు స్వాతంత్ర్య సమర యోధుడు పింగళి వెంకయ్య. గాంధీ శిష్యుడిగా అనుచరుడిగా ఉన్న ఆయన స్వాతంత్ర్య పోరాటంతో ఎంతో కృషి చేశారు.
ఏపీలో కృష్ణా జిల్లాలో పుట్టిన దేశ భక్తుడు స్వాతంత్ర్య సమర యోధుడు పింగళి వెంకయ్య. గాంధీ శిష్యుడిగా అనుచరుడిగా ఉన్న ఆయన స్వాతంత్ర్య పోరాటంతో ఎంతో కృషి చేశారు. ఆయన దేశానికి స్వాతంత్ర్యం రాక ముందే ఎన్నో కలలు కంటూ సర్వ సత్తాక భారత దేశానికి ఎలాంటి జాతీయ జెండా అవసరం అన్నది గుర్తించి మరీ తయారు చేశారు. అలా పింగళి వెంకయ్య తయారు చేసిన జెండాను కాంగ్రెస్ ఆనాడు ఆమోదించింది. ఆ తరువాత దానిలో కొంత మార్పు చేర్పులు చేసి స్వాతంత్ర్యం వచ్చక దేశానికి జాతీయ జెండాగా అధికారికంగా నిర్ణయించింది. మరి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు దక్కింది ఏమిటి అంటే ఆవేదన కలుగుతుంది. గత కొంతకాలంగా అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది.
హరి ఘర్ తిరంగా అంటూ :
ఇక గత ఐదారేళ్లుగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా అంటూ ఒక నినాదాన్ని జనం ముందు ఉంచి జాతీయ వాదాన్ని దేశ భక్తిని పెంచుతూ అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై అయిదేళ్ళు నిండిన సందర్భంగా వజ్రోత్సవాలలో ప్రతీ ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్రం పిలుపు ఇస్తే అంతా పాటించారు. ఆ తరువాత ప్రతీ ఏటా అలాగే చేస్తున్నారు. ఇపుడు ఎనభయ్యేళ్ల స్వాతంత్ర్యం వేళ మరోసారి మోడీ పిలుపు ఇచ్చారు. హర్ ఘర్ తిరంగా అంటూ ఆయన సోషల్ మీడియాతో పాటు అనేక మాధ్యమాల ద్వారా జనాలకు పిలుపు ఇస్తున్నారు.
ఆయనను గౌరవించరా :
అయితే హర్ ఘర్ తిరంగా అంటూ మోడీ ఇస్తున్న నినాదం మంచిదే అని తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు చెబుతూనే మరి ఆ జెండాను రూపొందించిన రూపకర్త పింగళి వెంకయ్యను గుర్తించరా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మన దేస జాతీయ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్యని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని వీహెచ్ అన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం ద్వారానే నిజమైన గౌరవం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరి హర్ ఘర్ తిరంగా అంటూ నినదిస్తున్న మోడీ పింగళి వెంకయ్య చేసిన సేవలను ఎందుకు విస్మరిస్తున్నారని వీహెచ్ గట్టిగానే ప్రశ్నించారు.
ఆయనే అసలైన యోధుడు :
ఈ దేశానికి మువ్వన్నెల జెండాను అందించిన పింగళి వెంకయ్య అసలైన యోధుడు అని వీహెచ్ కీర్తించారు. ఆయన రూపొందించిన జెండా కోట్లాది మంది భారతీయుల మనసులో ఉందని అన్నారు. అటువంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి భారత ప్రభుత్వం ఇవ్వగల ఏకైక సముచితమైన నివాళి భారతరత్న మాత్రమేనంటూ ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాజాగా రాసిన ఒక బహిరంగ లేఖలో పేర్కొన్నారు. జాతీయ జెండా రెపరెపల వెనక పింగళి వెంకయ్యను ఎందుకు గుర్తించలేకపోతున్నామని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పింగళి అచ్చమైన తెలుగు బిడ్డ అని అన్నారు. అటువంటి వారి పట్ల ఉదాశీనత నిర్లక్ష్యం పనికిరాదని వీహెచ్ పేర్కొన్నారు. ఇక తాను గతంలోనే తాను హైదరాబాద్‌లో పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆ లేఖలో వీహెచ్ ప్రధానికి గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి మంచి నిర్ణయం తీసుకుంటే అంతా హర్షిస్తారు అని ఆయన అన్నారు. వీహెచ్ డిమాండ్ సముచితమైనది. కేంద్రం ఈ విషయంలో కనుక సానుకూలంగా స్పందిస్తే పింగళి వెంకయ్యకు భారత రత్న దక్కుతుంది. అది ఆయనకు కాదు మువ్వన్నెల జెండాకు భారతీయుల స్వాతంత్ర్య నిబద్ధతకు కూడా గౌరవం అని అంటున్నారు.