జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రెడీ ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వారసత్వం వచ్చే ఎన్నికల్లో ఏపీలో రంగంలో ఉంటుందా అన్న చర్చ ఇపుడు సాగుతోంది.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వారసత్వం వచ్చే ఎన్నికల్లో ఏపీలో రంగంలో ఉంటుందా అన్న చర్చ ఇపుడు సాగుతోంది. ప్రత్యేకించి కడప జిల్లాలో ఈ చర్చ ఎక్కువగా సాగుతోంది. వైఎస్సార్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. అలాంటి జిల్లా 2024 ఎన్నికల్లో వైసీపీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దానికి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా చెప్పాలీ అంటే వైఎస్సార్ ఫ్యామిలీ రిలేషన్ జనంతో క్లోజ్ గా ఉండే పరిస్థితి లేకపోవడం వల్లనే ఇలా జరిగింది అని అంటున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీ చేతిలో కడప లోక్ సభ ఉండడంతో పాటు ఆ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఏకమొత్తంగా గెలుచుకుని సత్తా చాటుతూ వచ్చింది. అలాంటిది గత ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీకే కాదు వైఎస్సార్ ఫ్యామిలీకే బిగ్ షాక్ గా ఈ పరిణామం మారిందని అంటున్నారు.
సొంత వారు ఉంటేనే :
ఇప్పటిదాకా వైఎస్సార్ ఆయన సోదరుడు వివేకా అలాగే జగన్ కడప జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఇక జగన్ అయితే రాష్ట్రంలో పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన తరచూ కడప జిల్లా రాజకీయాలను పర్యవేక్షించేందుకు వీలు ఉండదు, అలాగని వేరే వారితో నడిపిస్తే వైఎస్సార్ ఎమోషన్ అన్నది జనంతో కలిసి రావడం లేదు, అందుకే ఏకంగా వైఎస్సార్ మనవరాలు, జగన్ పెద్ద కుమార్తెని ఈసారి కడప లోక్ సభ బరిలోకి దించడం ద్వారా జనాలకు వైఎస్సార్ ఫ్యామిలీని మరింత చేరువ చేయాలని ఆ విధంగా మొత్తం జిల్లాలో సీట్లను సొంతం చేసుకోవాలని వైసీపీ అధినాయకత్వం పక్కా ప్లాన్ తో ఉందని అంటున్నారు.
పెద్ద ఎత్తున ఊహాగానాలు :
ఇదిలా ఉంటే జగన్ పెద్ద జగన్ కుమార్తె రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం అవుతోంది అంటూ పెద్ద ఎత్తున కడప జిల్లాలో రాజకీయ ఊహాగానాలు అయితే చెలరేగుతున్నాయని అంటున్నారు. ఇక వైసీపీ వర్గాల నుంచి కూడా చూస్తే ఈ ప్రచారంలో నిజం ఉందా అంటే అవును అన్నట్లుగానే వార్తలు వస్తున్నాయని చెబుతున్నారు. వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి విదేశాలలో చదువుకున్నారు అన్నది తెలిసిందే. అయితే ఆమె 2029 ఎన్నికల నాటికి తన సొంత జిల్లా కడప నుంచే రాజకీయ అరంగేట్రం చేస్తారు అని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమెను కడప లోక్ సభ నుంచి పోటీ చేయించడం ద్వారా వైఎస్సార్ రాజకీయ వారసత్వాన్ని మరో తరానికి కూడా కొనసాగించాలని అలాగే వైసీపీ పట్టుని గట్టి పునాదిని మరింతగా బలోపేతం చేసుకోవాలని కూడా చూస్తున్నారు అని అంటున్నారు.
కంచుకోట గానే సీటు :
కడప లోక్ సభ సీటు నుంచి టీడీపీ గెలిచింది ఒకసారి మాత్రమే. అది కూడా 1984లోనే అని గుర్తు చేస్తున్నారు. మిగిలిన అన్ని సార్లూ కాంగ్రెస్ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ వైఎస్సార్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. వైఎస్సార్ నాలుగు సార్లు గెలిస్తే వైఎస్ జగన్ రెండు సార్లు కడప ఎంపీగా గెలిచారు. వైఎస్ వివేకా కూడా లోక్ సభ ఎంపీగా పనిచేశారు. ఇక 2014 నుంచి మూడు సార్లు కడప నుంచి ఎంపీగా గెలిచి వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టారు. దాంతో హర్షా రెడ్డి కనుక పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తుందని కూడా ఆ పార్టీ నమ్ముతోంది. అంతే కాదు ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లను కూడా వైసీపీ సునాయాసంగా గెలుచుకుంటుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారాల్లోనూ కీలకం :
ఇక వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారని ఆమె ఈ మధ్యనే సాక్షి మీడియా గ్రూప్ కార్యకలాపాలలోని కొన్ని అంశాలను పర్యవేక్షిస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జగన్ కూడా కుటుంబ వ్యాపార వ్యవహారాల్లో తన ఇద్దరు కుమార్తెలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. దాంతో పాటుగా పెద్ద కుమార్తెని రాజకీయాల్లోకి తీసుకుని రావాలని కూడా జగన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
అవినాష్ అసెంబ్లీకి :
ఇక కడప ఎంపీ సీటుకు హర్షారెడ్డి పోటీ చేస్తే అవినాష్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించాలని కూడా వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. బహుశా అది జమ్మలమడుగు అవుతుందని అంటున్నారు. అక్కడ వైసీపీ బలంగానే ఉంది. ఒకవేళ అది కాదు అనుకుంటే వేరే లోక్ సభ సీటు ఆయనకు కేటాయించవచ్చు అలా ఆయనకు పొలిటికల్ గా అకామిడేట్ చేస్తారు అని కూడా చర్చ సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో