సీబీఎస్ఈ 12th ఫెయిల్.. 19 ఏళ్ల యువకుడి బ్లాగ్ తో రచ్చరచ్చ
కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతవారం నీట్ పరీక్ష రద్దుతో మొదలైన వివాదం.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలతో మరింత ముదిరింది.
కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతవారం నీట్ పరీక్ష రద్దుతో మొదలైన వివాదం.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలతో మరింత ముదిరింది. పరీక్షల నిర్వహణలో సీబీఎస్ఈ ఘోరంగా విఫలమైందని విద్యార్థులు, తల్లిదండ్రులు ధ్వజమెత్తుతున్నారు. తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు. బోర్డు కొత్తగా తీసుకువచ్చిన ఆన్ లైన్ మార్కింగ్ విధానం సరిగా లేదని, దీనివల్ల విద్యార్థుల జవాబు పత్రాలు తారుమారు కావడం, సరిగా స్కానింగ్ చేయకపోవడం వల్ల రిజల్ట్ పై ప్రభావం పడిందని చెబుతున్నారు. దీంతో పరీక్షలు రాసిన 17 లక్షల మంది విద్యార్థుల్లో 4.04 లక్షల మంది రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సివచ్చిందని అంటున్నారు.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు, రీవాల్యుయేషన్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, ఆయన తక్షణం రాజీనామా చేయాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంట్రీతో సీబీఎస్ఈ వివాదం రాజకీయంగా రచ్చ రచ్చగా మారుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. సీబీఎస్ఈ బాధ్యతరాహిత్యం వల్ల ఫలితాలు విడుదలై రెండు వారాలు అవుతున్నా, విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు.
అసలేం జరిగిందంటే..
ఈ ఏడాది సీబీఎస్ఈ పరీక్షల్లో కొత్తగా ఆన్ లైన్ స్క్రీనింగ్ విధానం ప్రవేశపెట్టింది. ఇందులో కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ సరిగా జవాబుపత్రాలను స్కానింగ్ చేయలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాలు విడుదలైన తర్వాత కొందరు విద్యార్థులు ఆశించినన్ని మార్కులు రాకపోవడంతో రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకోగా, అసలు విషయం బయటపడింది. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ జవాబు పత్రాలు పరిశీలించుకునే వెసులుబాటు ఉంది. దీంతో సీబీఎస్ఈ నిర్లక్ష్యం బయటపడిందని అంటున్నారు. కొందరు విద్యార్థులకు తమ జవాబు పత్రాలకు బదులుగా ఇతరులవి ఇవ్వడంతో ఫలితాల్లో తప్పులు దొర్లినట్లు వెల్లడైందని అంటున్నారు.
ఈ విషయంపై వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థి సోషల్ మీడియాలో బోర్డు పనితీరుపై విమర్శలు గుప్పించగా, ఆయన పాకిస్థాన్ ఏజెంట్ అంటూ కొందరు ట్రోల్ చేశారు. అయితే శ్రీవాస్తవ చెప్పింది నిజమేనంటూ బోర్డు అంగీకరించడంతో ప్రశ్నపత్రాలు స్కానింగ్ లో లోపాలు బయటపడ్డాయని అంటున్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ నిసర్గ అధికారి అనే 19 ఏళ్ల యువకుడు రాసిన ఒక చిన్న బ్లాగ్ తీవ్ర సంచలన చర్చకు కారణమైందని అంటున్నారు. సీబీఎస్ఈ బోర్డు వినియోగిస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) పోర్టల్‌లో ఉన్న తీవ్రమైన సాంకేతిక లోపాలను, సైబర్ సెక్యూరిటీ పరమైన లీకేజీలను అతడు తన బ్లాగ్ ద్వారా ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఈ బ్లాగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తీవ్ర ఒత్తిడి నడుమ సీబీఎస్ఈ ఈ పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పత్రాల తారుమారు సమాచారం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఒక విద్యార్థి పేపర్లు మరొకరికి ట్యాగ్ చేయడం వల్ల ఒకరి మార్కులు తగ్గి, మరొకరికి అన్యాయంగా మార్కులు పెరిగాయని అంటున్నారు. దీంతో మొత్తం 17 లక్షల మంది విద్యార్థుల ఫలితాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది మాత్రమే కాదని, దరఖాస్తు చేయని లక్షల మంది విద్యార్థులు కూడా నష్టపోయారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా ఈ ప్రభవం విద్యార్థుల ఉన్నత చదువులపైనా పడుతోందని చెబుతున్నారు.