సీబీఐ అధికారిపై 21 ఏళ్ల పగ.. పట్టపగలు బాణంతో దాడి, లక్నోలో సంచలనం!

ప్రతీకారం ఎంత వరకు తీసుకెళ్తుందో నిరూపించే ఒక విస్మయకరమైన ఘటన లక్నోలో వెలుగుచూసింది.;

Update: 2025-05-26 02:30 GMT

ప్రతీకారం ఎంత వరకు తీసుకెళ్తుందో నిరూపించే ఒక విస్మయకరమైన ఘటన లక్నోలో వెలుగుచూసింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం అంటే 1993లో జరిగిన ఒక రైల్వే కుంభకోణం కేసును ఛేదించిన సీబీఐ అధికారిపై శుక్రవారం పట్టపగలే బాణంతో దాడి జరిగింది. ఈ దాడిని పక్కా ప్రణాళికతో పగతో చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని వెంటనే పట్టుకున్నప్పటికీ ఈ ఘటన లక్నోలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరగడం తీవ్ర కలకలం రేపింది.

లక్నోలోని అత్యంత రద్దీగా ఉండే హజ్రత్‌గంజ్‌లో సీబీఐ కార్యాలయం ఉన్న నవల్ కిషోర్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, సీబీఐ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) వీరేంద్ర సింగ్ సీబీఐ గేటు వద్ద ఒక్క క్షణం ఒంటరిగా నిలబడి ఉండగా, ఒక చెట్టు వెనుక నుంచి అకస్మాత్తుగా ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. చెక్క విల్లుతో ఇనుప కొనగల బాణాన్ని గురిపెట్టి, నేరుగా సింగ్ ఛాతీలోకి వదిలాడు. బాణం సింగ్ ఛాతీని దూసుకుపోయి అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

దాడి చేసిన వ్యక్తిని వెంటనే గమనించిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని బీహార్‌లోని ముంగేర్ జిల్లా ఖడగ్‌పూర్‌కు చెందిన 45 ఏళ్ల దినేష్ ముర్ముగా గుర్తించారు. అతను భారతీయ రైల్వేలో మాజీ జూనియర్ ఉద్యోగి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం 65 ఏళ్ల వయసున్న ముర్ము, 1993లో సీబీఐ దర్యాప్తు చేసిన రైల్వే ట్రాప్ కేసులో సింగ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఆ కేసు కారణంగానే ముర్ము సుమారు 30 సంవత్సరాల క్రితం తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటి నుండి సింగ్‌పై పగ పెంచుకున్న ముర్ము, ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముర్ము గిరిజన సమాజానికి చెందిన వ్యక్తి. ఉద్యోగం కోల్పోయిన తర్వాత తన గ్రామానికి తిరిగి వెళ్లి కష్టాల్లో జీవితాన్ని గడిపాడు. ఈ దాడి కోసం అతను నెలల తరబడి సన్నద్ధమయ్యాడు. మారుమూల అటవీ ప్రాంతాలలో చేతితో తయారు చేసిన చెక్క విల్లు, పదునైన బాణాన్ని ఉపయోగించి ప్రాక్టీస్ కూడా చేసి ఉండవచ్చని తెలుస్తోంది. సీబీఐ గేటు దగ్గర ఒక చెట్టు వెనుక వేచి ఉండి, సింగ్ ఒక్క క్షణం ఒంటరిగా ఉన్న సమయం చూసి గరిష్ట ప్రభావం చూపించేలా దాడి చేశాడు.

దాడికి గురైన వీరేంద్ర సింగ్‌ను వెంటనే లక్నో సివిల్ ఆసుపత్రికి తరలించారు. అతని ఛాతీ ఎడమ వైపున ఐదు సెంటీమీటర్ల లోతైన గాయం అయ్యింది. ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సింగ్ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సీబీఐ అధికారులు కూడా ఇటీవల నెలల్లో సింగ్‌కు ఏమైనా బెదిరింపులు వచ్చాయా లేదా దాడికి ముందు అనుమానాస్పద సంకేతాలు ఉన్నాయా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ముర్ముపై హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు కేసు నమోదు అయింది.

Tags:    

Similar News