బాబు...లోకేష్ లను కూల్ చేసేది ఏంటంటే ?
ఏపీలో సరికొత్త పరిశ్రమ వచ్చింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ కి మంత్రి నారా లోకేష్ తాజాగా శంకుస్థాపన చేశారు.;
ఏపీలో సరికొత్త పరిశ్రమ వచ్చింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ కి మంత్రి నారా లోకేష్ తాజాగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యారియర్ ఏసీ సంస్థ గురించి పలు విషయాలు పంచుకున్నారు. తన తొలి ఏసీ చాయిస్ క్యారియర్ అని అన్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు రూం లో వాడే ఏసీ కూడా క్యారియర్ అని ఆయన గుర్తు చేశారు. బాబు రూం లో 17 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ తో అది బ్రహ్మాండంగా పనిచేస్తోందని లోకేష్ చెప్పడం విశేషం.
పారిశ్రామిక హబ్ గా :
ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అతి పెద్ద పారిశ్రామిక హబ్ గా మారుస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. అందులో భాగంగానే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో వెయ్యి కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఎసి పరిశ్రమకు శ్రీకారం చుట్టామనిఅన్నారు. అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానికంగా మూడు వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తులు తయారీ జరుగుతుందని ఆయన తెలిపారు. రానున్న రోజులలో రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రానున్నాయని లోకేష్ చెబుతూ టీడీపీ టమి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు ఏపీకి వస్తున్నారని అన్నారు.
కేవలం డేటా సెంటర్లే కాదు :
ఏపీ కేవలం డేటా సెంటర్లకు ఆతిథ్యమిచ్చే కేంద్రంగా ఉండటంతో సంతృప్తి చెందడం లేదని లోకేష్ చెప్పుకొచ్చారు. అందుకే వాటిని నడిపించే చోదక శక్తిగా మారడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందని అన్నారు. తమ ఆలోచనలకు క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఒక మూల స్తంభమని ఆయన అభివర్ణించారు. క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ వేగాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఏపీలో క్యారియర్ సంస్థ శ్రీకారం చుట్టడం కార్యక్రమం అంతా కేవలం ఎనిమిది నెలల్లోనే ముందుకు సాగిందని ఇలా పని చేసే వేగం పారిశ్రామికవేత్తల పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తాయని తెలియచేస్తుందని లోకేష్ స్పష్టం చేశారు.
డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ కోసం :
ఏపీలో ఫుల్ స్టాక్ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ని నిర్మించడమే లక్ష్యమని ఐటీ మంత్రి లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే ఏఐ క్లౌడ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం క్యారియర్ అధునాతన కూలింగ్ టెక్నాలజీ అత్యంత కీలకమని లోకేష్ గుర్తు చేశారు. శ్రీ సిటీలోని క్యారియర్ సన్స్థ 39 ఎకరాల ప్లాంట్ ఎయిర్ కండిషనింగ్ తయారీకి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని లోకేష్ చెప్పారు. 2027 నాటికి భారత దేశంలో 60 శాతం ఏసీలను ఈ సంస్థ ద్వారా ఏపీ ఉత్పత్తి చేస్తుందని అంచనా ఉంది.