బీహార్ దిమ్మ దిరిగింది...జూబ్లీ హిల్స్ ఊపిరి నిలిపింది
ఇదే విధంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి రెండు సీట్లు దక్కేలా కనిపిస్తోంది. ఇప్పటికే బిజెపి ఒక స్థానంలో గెలిచి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.;
కాంగ్రెస్ పార్టీకి దేశంలో రాజకీయం ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఆ పార్టీకి వరుస ఓటములు పలకరిస్తున్నాయి. బీహార్ లో ఈసారి ఘన విజయం తధ్యమని కాంగ్రెస్ భావించింది. అంతే కాదు గతంలో వచ్చిన సీట్ల కంటే అధికంగా గెలుస్తామని కూడా ధీమా ప్రదర్శించింది. కానీ బీహార్ లో చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగా కేవలం మూడు అసెంబ్లీ సీట్లలో మాత్రమే అధిక్యలో ఉంది. ఇక దేశంలో చూస్తే ఏడు రాష్ట్రాలలోని ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకుంది. అందులో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కి ఎంతో ఊరటను ఇచ్చి ఊపిరి పోసింది.
అద్భుత విజయమే :
ఇపుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దక్కిన విజయాన్ని అద్భుతంగానే భావించాలని అంటున్నారు. మొత్తం పోల్ అయిన ఓట్లలో 51 శాతం సాధించి కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో జెండా పాతింది. అంతే కాదు దాదాపుగా లక్ష్ల ఓట్లను సొంతం చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వి హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం. సునీతా గోపీనాథ్‌ను 24 వేల 729 ఓట్ల తేడాతో ఓడించారు.
టోటల్ గా అయిదు :
ఒక విధంగా కాంగ్రెస్ కోటలు కూలిపోయిన నేపధ్యంలో జూబ్లీ హిల్స్ విజయం ఆ పార్టీకి ఎంతో ఉపశమనం కలిగించింది అనుకోవాలి. ఇక ఈ సీటుతో పాటు రాజస్థాన్‌లో, కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ భయా అంటా అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆయన బిజెపి అభ్యర్థి మోర్పాల్ సుమన్‌ను 15 వేల 612 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో కాంగ్రెస్ బీహార్ లో మూడు ఉప ఎన్నికల్లో రెండు కలిపి మొత్తం అయిదు సీట్లను గెలుచుకున్నట్లు లెక్క తేలింది.
ఉప ఎన్నికల్లో బీజేపీకి రెండు :
ఇదే విధంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి రెండు సీట్లు దక్కేలా కనిపిస్తోంది. ఇప్పటికే బిజెపి ఒక స్థానంలో గెలిచి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, పిడిపి, మిజో నేషనల్ ఫ్రంట్ ఒక్కో స్థానంలో గెలుపొందగా, జెఎంఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు తర్న్ తరన్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆయన శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్‌విందర్ కౌర్‌ను 12 వేల 91 ఓట్ల తేడాతో ఓడించారు.
కాశ్మీర్ లో కమలం :
చిత్రమేంటి అంటే జమ్మూ కాశ్మీర్‌లో, బిజెపి అభ్యర్థి దేవయాని రాణా నగ్రోటా అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆమె జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (ఇండియా) అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్‌ను 24 వేల 647 ఓట్ల తేడాతో ఓడించారు. పిడిపి అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజిర్ మెహదీ బుద్గాం స్థానం నుండి ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆయన తన సమీప నేషనల్ కాన్ఫరెన్స్ ప్రత్యర్థి అగా సయ్యద్ మహమూద్ అల్-మోసావిని 4 వేల 478 ఓట్ల తేడాతో ఓడించారు. ఒడిశాలో బిజెపి అభ్యర్థి జే ధోలాకియా నువాపాడలో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ఘాసి రామ్ మాఝిపై 78 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు.
ఇతరుల గెలుపు :
అదే విధంగా మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్. లాల్తాంగ్లియానా దంప స్థానాన్ని గెలుచుకున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అభ్యర్థి వన్‌లాల్‌సైలోవాను 562 ఓట్ల తేడాతో ఓడించారు. జార్ఖండ్‌లో జెఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సోరెన్ ఘట్సిలాలో తన సమీప బిజెపి ప్రత్యర్థి బాబు రామ్ సోరెన్‌పై 27 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు దక్కాయి. రెండు జాతీయ పార్టీలలో కాంగ్రెస్ కి బీహార్ లో ఘోర పరాజయం పట్టి పీడిస్తూంటే తెలంగాణా డిపాజిట్లు పోవడం బీజేపీకి షాకింగ్ న్యూస్.