ఒక్క సారి చార్జ్ చేస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారిలో సగం దూరం ప్రయాణించవచ్చు.. ఈ కారు ప్రత్యేకతలు ఇవే..

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కొనుగోలుదారులు ప్రధానంగా భయపడేది ‘రేంజ్’ విషయంలోనే. కానీ బెస్టున్ షావోమీ కారు ఆ భయాలకు పూర్తి స్థాయిలో తెరదించింది.;

Update: 2026-05-03 11:53 GMT

రవాణా రంగంలో ఇప్పుడు సరికొత్త విప్లవం రాబోతోంది. పెట్రోల్, డీజిల్ దొరకకపోవడం, ధరలు ఆకాశాన్ని తాకుతుండడం ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యానికి కారణం అవుతున్న తరుణంలో సామాన్యుడికి సొంత కారు అనేది కలగానే మిగిలింది. కానీ, కేవలం ఒక బైకు ధరకే ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు లభిస్తే? అది కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దూరంలో సగం వరకు ప్రయాణించేంత రేంజ్ ఇస్తే? వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా, ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్. మధ్య తరగతి ప్రజల కళ్లలో మెరుపులు నింపుతున్న ఈ సరికొత్త ఈవీ విశేషాలు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

రేంజ్ అద్భుతం.. ఒక్క ఛార్జ్‌తో 1200 కిలోమీటర్లు!

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కొనుగోలుదారులు ప్రధానంగా భయపడేది ‘రేంజ్’ విషయంలోనే. కానీ బెస్టున్ షావోమీ కారు ఆ భయాలకు పూర్తి స్థాయిలో తెరదించింది. ఈ చిన్న కారులో అమర్చిన అత్యాధునిక సాంకేతికత దీనికి ప్రధాన బలం. సాధారణంగా ఈ కారు స్టాండర్డ్ మోడ్‌లో 800 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అయితే, ఇందులోని ‘రేంజ్ ఎక్స్‌టెండర్’ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తే, ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో ఏకంగా 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే మీరు నగరంలో తిరుగుతుంటే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు మూడు వారాల పాటు మళ్లీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లు కూడా ఇంతటి రేంజ్ అందించలేకపోవడం ఈ కారు ప్రత్యేకత.

తక్కువ ధర.. సామాన్యుడి బడ్జెట్‌లోనే!

చైనా మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర కేవలం 30,000 యువాన్లు (సుమారు రూ. 3.47 లక్షలు) మాత్రమే. ఇక అన్ని హంగులు, అదనపు ఫీచర్లు ఉన్న ప్రీమియం మోడల్ ధర కూడా రూ. 5.78 లక్షల లోపే ఉండడం విశేషం. ఒక మంచి స్కూటర్ లేదంటే బుల్లెట్ బైక్ కొనే ధరకే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు లభించడం మధ్య తరగతి కుటుంబాలకు గొప్ప వరమనే చెప్పాలి.

ఇరుకైన వీధులకు కేరాఫ్ అడ్రస్!

బెస్టున్ షావోమీ ఎంఐ 1000 మోడల్ పార్కింగ్, ఇరుకు సందుల్లో ప్రయాణించే సమస్యలను అధిగమిస్తోంది. దీని పొడవు 3000 మిమీ, వెడల్పు 1510 మిమీ మాత్రమే ఉండడం వల్ల రద్దీగా ఉండే ప్రాంతాల్లో సులభంగా దూసుకుపోగలదు. ఇరుకైన వీధుల్లో ప్రయాణించడానికి, చిన్నపాటి స్థలంలో పార్కింగ్ చేసుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది.

హై-టెక్ ఫీచర్లు..

తక్కువ ధర కదా ఫీచర్ల ఉంటాయా? అని ఖంగారు పడాల్సిన పని లేదు.. ఫీచర్ల విషయంలో కూడా కంపెనీ రాజీ పడలేదు. కారు లోపల లగ్జరీ కారులో ఉన్న అనుభూతి కలుగుతుంది. డ్యూయల్-టోన్ థీమ్‌తో ఉన్న ఇంటీరియర్స్ కంటికి ఇంపుగా ఉంటాయి. డ్రైవర్ కోసం 7-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో పవర్ విండోస్, డిజిటల్ క్లస్టర్, మెరుగైన మ్యూజిక్ సిస్టమ్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలున్నాయి. ఈ కారులో ఉన్న సాంకేతిక హంగులు యూత్ ను, చిన్న కుటుంబాలను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

రాజీ లేని ప్రయాణం!

సాంకేతిక పరంగా ఈ మైక్రో ఈవీ 20 కిలోవాట్ల శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఈ మోటార్‌ను వెనుక చక్రాలపై (రియర్ షాఫ్ట్) అమర్చారు, ఇది కారుకు మంచి పికప్‌ను అందిస్తుంది. బ్యాటరీ విషయంలో కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో సురక్షితమైన ఎల్ఎఫ్‌పీ (లిథియం-ఐరన్ ఫాస్ఫేట్) టెక్నాలజీని ఉపయోగించారు. భద్రత విషయానికి వస్తే, డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ వంటి ఫీచర్లను చేర్చడం వల్ల ప్రయాణం సురక్షితంగా మారుతుంది.

భారత మార్కెట్లోకి ఎంట్రీ..

చైనాలో విడుదలైన ఈ కారుపై భారతీయ వినియోగదారుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాల దృష్ట్యా, బెస్టున్ సంస్థ త్వరలోనే భారత్‌లోకి అడుగుపెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇదే ధరలో, ఇదే రేంజ్‌తో ఈ కారు భారత్‌లోకి వస్తే, దేశీయ మార్కెట్లో ఉన్న ఇతర మైక్రో ఈవీలకు గట్టి పోటీనిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బెస్టున్ షావోమీ కారు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. కేవలం రూ. 3.47 లక్షలకే 1200 కిలోమీటర్ల రేంజ్ అనేది ఒక కలలా అనిపించినా, సాంకేతికతతో అది సాధ్యమేనని ఈ కారు నిరూపించింది. సామాన్యుడి సొంత కారు కలని నిజం చేసే దిశగా ఇదొక ముందడుగు.

Tags:    

Similar News