బీఆర్ఎస్ తో వైసీపీ...అక్కడ మైనస్ ?

తెలంగాణాలో బీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ. వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇక కేసీఆర్ రాజకీయ చాణక్యుడు.;

Update: 2025-11-28 03:32 GMT

తెలంగాణాలో బీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ. వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇక కేసీఆర్ రాజకీయ చాణక్యుడు. ఆయన కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన అనుభవం ఉన్న వారు. అర్ధ శతాబ్దానికి ఆయన రాజకీయం చేరువ అవుతున్న నేపథ్యం ఉంది. ఇక కేసీఆర్ కి జగన్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అది 2014 ముందు నుంచి కొనసాగుతోంది. 2014, 2019, 2024 లలో మూడు సార్లూ ఏపీలో జగనే వస్తారు అని బీఆర్ఎస్ నేతలు జోస్యాలు చెప్పారు. అయిత అది ఒక్కసారే నిజం అయింది. అయితే బీఆర్ఎస్ కి ఏపీలో జగన్ అధికారంలోకి రావాలన్న కోరిక ఉందని మాత్రం అందరికీ అలా బలంగా తెలిసిపోయింది.

ఒకే బాటలోనే :

ఇక 2019లో జగన్ ఏపీకి సీఎం అయ్యాక కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆ తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అయిదేళ్ళూ సామరస్యంగానే గడిపారు. ఇక ఒకేసారి ఇద్దరూ ఓటమి చవిచూశారు. ఇక ఇప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కొనసాగుతోంది. తాజాగా బెంగళూరులో జగన్ కేటీఆర్ ఒక కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇద్దరూ కలసి కూర్చుని ముచ్చట్లు మాట్లాడుకోవడం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైసీపీకి మేలేనా :

ఇదిలా ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సహజంగానే జగన్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉంటారు. దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో చేరిన వారు. ఆయనకు చంద్రబాబుతో మంచి రిలేషన్స్ ఉన్నాయని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తారు. అయితే తనకు ఒకనాడు రాజకీయంగా సహచరుడు బాబు అని రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పినా కూడా ఈ ప్రచారం అయితే ఆగడం లేదు. ఇక వైసీపీ అయితే మాత్రం ఇదే భావనతో ఉంది. అందుకే అక్కడ ప్రతిపక్షంతో ఎటూ స్నేహం ఉంది కాబట్టి బీఆర్ఎస్ తోనే మంచిగా ఉంటూ వస్తోంది. అయితే ఇది వైసీపీకి ఏపీ రాజకీయాల్లో ఎంత వరకూ మేలు చేస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది.

ఏపీలో కుల సమీకరణలు :

ఇక ఏపీ రాజకీయం అంతా కుల సమీకరణల మీద ఆధారపడి సాగుతుంది అన్నది తెలిసిందే. ఏపీలో అయితే బలమైన వెలమ సామాజిక వర్గం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీతోనే ఉంది. అందులోనే మెజారిటీ నాయకులు సైతం కీలక పదవులలో ఉన్నారు. దాంతో బీఆర్ స్ తో చెలిమి వల్ల ఆ సామాజిక వర్గం నుంచి ఎంతో కొంత వైసీపీ వైపు చూస్తోందా అంటే ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటారు. ఇంకో వైపు చూస్తే రెడ్డి సామాజిక వర్గం ఏపీలో వైసీపీకి మద్దతుగా ఉంటూ ఆ పార్టీకి ఆక్సిజన్ గా ఉంటోంది. కానీ తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ వైపు రెడ్లు ఉన్నారు వారంతా రేవంత్ రెడ్డికి 2023 ఎన్నికల్లో గెలిపించారు. తమ వారు సీఎం పదవిలో ఉండాలన్న ఆకాంక్ష వారిలో ఉండడం కూడా మరో కారణం. పైగా బీఆర్ఎస్ లో పెద్దగా ప్రాధాన్యత తమకు దక్కలేదని కూడా వారికి భావన ఉందని అప్పట్లో ప్రచారంలో ఉంది.

వారి వైఖరి ఏమిటి :

ఇక ఏపీలో ఉన్న రెడ్లు తెలంగాణా రాజకీయాల్లో కీలకంగా ఉంటారు అని చెబుతారు. అలాగే వ్యాపార వ్యవహారాలు అన్నీ చాలా మందికి హైదరాబాద్ కేంద్రంగా ఉంటాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ స్టాండ్ తీసుకోవడం అన్నది చాలా మందికి ఆ ప్రధాన సామాజిక వర్గంలో నచ్చుతుందా అన్నది మరో డౌట్ అని అంటున్నారు ఇక రేవంత్ రెడ్డి విషయంలో అనుకూలంగా లేకపోయినా వ్యతిరేకంగా ఉండకుండా ఉంటే మేలు అన్న భావన కూడా చాలా మందిలో ఉంది అని అంటారు. మొత్తం మీద చూస్తే బీఅర్ స్ తో చెలిమి ఏపీలో వైసీపీకి పెద్దగా ఉపయోగపడదు అన్న చర్చ అయితే ఉంది. కానీ శతృవు కి శతృవు మిత్రుడు అన్న రాజనీతినే వైసీపీ అనుసరిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News