ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత.. బీఆర్ఎస్‌కే నష్టం!
గత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.;
గత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. వీటిలో 1) ఇందిరమ్మ ఇండ్లు. 2) మహాలక్ష్మి. 3) రైతు భరోసా. 4) చేయూత. 5) యువ వికాసం. 6) గృహజ్యోతి. ఉన్నాయి. అయితే.. వీటిలో మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి పథకాలు ప్రస్తుతం అమలవుతున్నాయి. కానీ.. మహాలక్ష్మి పథకంలో మూడు విభాగాలు ఉండగా.. కేవలం ఫ్రీబస్ మాత్రమే అమలు చేస్తున్నారు.
మహిళలకు నెలకు 2500 రూపాయలు, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయితీ వంటివి అమలు చేయడం లేదు. ఇలానే.. ఇతర పథకాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యాంరెటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనంటూ.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీలో `ప్రైవేటు బిల్లు`ను ప్రవేశ పెట్టింది. ఈ ఆరు గ్యారెంటీలకు చట్ట బద్ధత కల్పించాలని కోరుతున్నారు.
ఈ బిల్లును సోమవారం స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ నాయకులు అందించారు. అయితే.. దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్లును అనుమతిస్తే.. దీనిపై చర్చ చేపడతారు. అప్పుటు ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ సమయం దీనిపై మాట్లాడి.. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు.. ఆయా పథకాల్లోని లోటుపాట్లు.. ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ తిరస్కరిస్తే.. ఎలాంటి సమస్యా రాదు.
అయితే.. ఒక వేళ బిల్లును అనుమతించి.. చర్చించిన తర్వాత ఓటింగ్ ఆధారంగా చట్టం చేస్తే.. సదరు ఆరు గ్యారెంటీలను చట్టం చేయాల్సి ఉంటుంది. తద్వారా ఇది బీఆర్ ఎస్‌కే నష్టం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఒకసారి చట్టం చేసిన తర్వాత.. తదుపరి వచ్చే ప్రభుత్వాలు ఏవైనా కూడా ఆయా పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది. చిన్నపాటి మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉన్నా.. ఆయా పథకాలను రద్దు చేసేందుకు అవకాశం ఉండదు.
ఉదాహరణకు 2004-05 మధ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ చట్టం. దీనిని రద్దు చేయాలని బీజేపీ సర్కారుకు ఉన్నప్పటికీ.. ఇది చట్టం కావడంతో ఇటీవల మార్పులు మాత్రమే చేయగలిగింది. రేపు బీఆర్ ఎస్ కనుక అధికారంలోకి వస్తే.. అదే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు పరిశీలకులు.