బ్రహ్మానందం @పాన్ ఇండియా స్టార్ !
ఇప్పుడు వెంకీ సినిమాలో బ్రహ్మానందం వీడియోలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలంటూ తయారుచేసిన మీమ్ జాతీయస్థాయిలో అనూహ్యంగా సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలిచింది.
బ్రహ్మానందం ఆలియాస్ హస్యబ్రహ్మ కన్నెగంటి బ్రహ్మానందం. తెలుగు సినిమాలలో వెయ్యికి పైగా చిత్రాలలో నటించిన ఆయన తమిళంలో గిల్లి, లింగా చిత్రాలలో, కన్నడలో నిన్నిందలే, ఐ లవ్ యూ చిత్రాలలో, ఒక నేపాలీ చిత్రంలో నటించినట్లు సమాచారం. ఇక బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ సూర్యవంశం, అనిల్ కపూర్ వెల్కమ్ బ్యాక్, కుచ్ కట్టా హోజాయ్ చిత్రాలలోనూ ఆయన నటించారు.
బ్రహ్మానందం కెరీర్లో వెంకీ సినిమాలో గజాలా పాత్ర, రేసుగుర్రంలో ఇన్స్ పెక్టర్ కిల్ బిల్ పాండే పాత్ర, రెడీ సినిమాలో మెక్ డొనాల్డ్ మూర్తి పాత్ర, ఢీ సినిమాలో శ్రీరంగం శేషాచారి పాత్ర, కింగ్ సినిమాలో స్వరబ్రహ్మ జయసూర్య పాత్ర, అదుర్ప్ సినిమాలో బట్టాచార్య పాత్ర, బాద్ షా సినిమాలో పిల్లి పద్మనాభసింహ పాత్ర, యమదొంగలో చిత్రగుప్తుడు, సింహాాద్రిలో తలుపులు పాత్ర ఎవ్వరూ మరిచిపోలేనివి. అయితే వెంకీ సినిమాలో గజాలా పాత్ర ఎంతో ప్రత్యేకం.
ఇప్పుడు వెంకీ సినిమాలో బ్రహ్మానందం వీడియోలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలంటూ తయారుచేసిన మీమ్ జాతీయస్థాయిలో అనూహ్యంగా సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలిచింది. ఇప్పటి వరకు ప్రధానంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రమే పరిచయం ఉన్న బ్రహ్మానందం ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడనే చెప్పాలి.
సర్ ప్రక్రియ, ఓటరు జాబితాలో సవరణలలో ఆక్రమాలు జరిగాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ వెంకీ సినిమాలోని బ్రహ్మానందం వీడియో ఉపయోగించుకుంటూ ‘ప్రధాని మోదీ గారు జ్ఞానేష్ కుమార్ ను రాజీనామా చేయమనండి. లేదంటే మీరే రాజీనామా చేయాల్సి వస్తుంది’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇదే అంశం మీద జాతీయస్థాయిలోని విపక్షాలు అన్నీ కలిసి ఆందోళనలు చేస్తున్నాయి.
అయితే ఆప్ ఎక్స్ పోస్ట్ కు కౌంటర్ గా తెలంగాణ బీజేపీ అదే వెంకీ సినిమాలో ట్రెయిన్ సన్నివేశాల్లో రవితేజ బ్రహ్మానందాన్ని కొట్టే వీడియోను జత చేస్తూ ‘ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే ప్రజల స్పందన ఇలా ఉంటుంది’ అన్న వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య జరుగుతున్న ఈ మీమ్ వార్ జాతీయస్థాయి రాజకీయ చర్చల్లోకి బ్రహ్మానందాన్ని తీసుకువచ్చింది. తెలుగులో రాజకీయ పోస్టుల వ్యంగ్యాస్త్రాల్లో తరచూ బ్రహ్మానందం వీడియోలు, డైలాగులు మీమ్ లకు విస్తృతంగా వినియోగించడం జరుగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అది జాతీయస్థాయికి చేరిందని చెప్పాలి.