రీసౌండ్ లేదుట...బొత్స మార్క్ సెటైర్లు !

ఇక దానికి కౌంటర్ అన్నట్లుగా వైసీపీ నేతలు ఏకంగా కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు సర్కార్ ని పేరు పెట్టేశారు.

Update: 2026-06-13 20:10 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అయిన సందర్భంగా తిరుపతి వేదికగా భారీ సభను నిర్వహించింది. ఈ సభకు పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. వేదిక మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా కీలక మంత్రులు నేతలు అంతా పాల్గొన్నారు. కూటమి పెద్దల స్పీచ్ లో అయితే ఫైర్ కనిపించింది. అంతా ఏపీలో తమ ప్రభుత్వం రెండేళ్ళలో చేసినది ఏమిటి అన్నది సోదాహరణంగా వివరించారు. ఆ మేరకు కూటమి సభ సూపర్ సక్సెస్ అయింది అని అంటున్నారు. అంతే కాదు వైసీపీని ఎండగట్టడంలోనూ ఈ సభ పూర్తిగా విజయవంతం అయిందని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే విపక్ష వైసీపీ మాత్రం కూటమి సభ అట్టర్ ఫ్లాప్ అంటోంది.

వెన్నుపోటు ప్రభుత్వం :

టీడీపీ నేతలు వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ పేరు పెట్టేసి మరీ హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక దానికి కౌంటర్ అన్నట్లుగా వైసీపీ నేతలు ఏకంగా కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు సర్కార్ ని పేరు పెట్టేశారు. శాసనమండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అయితే వెన్నుపోటు ప్రభుత్వం అని తన మీడియా స్పీచ్ అంతా కొనసాగించారు అన్ని వర్గాలను ఏడిపించిన ప్రభుత్వం అన్నారు. ఓటేసిన పాపానికి జనాలను ఇంతలా మోసం చేస్తారా అని కూడా ఆగ్రహించారు.

సూపర్ హామీలు ఏవీ :

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ హామీలు గుప్పించిందని ఇపుడు వాటి ఊసే లేకుండా పోయిందని బొత్స అన్నారు. అన్ని హామీలు అమలు చేసేసినట్లుగా సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు కానీ సామాన్యులు కానీ ఎంతలా వేదన పడుతున్నారో ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు.ధరలు దారుణంగా పెరిగిపోయాయని అన్నారు. అయినా సరే సంబరాలు చేసుకోవడం అంటే ఏమనుకోవాలని ఆయన ప్రశ్నించారు.

సౌండ్ మాత్రం అదుర్స్ :

వేదిక నెక్కిన పెద్దలు అంతా డబ్బా కొట్టుకున్నారు అని తన పాలన సూపర్ అని సౌండ్ గట్టిగానే చేశారని మరి ఆ సౌండ్ కి రీసౌండ్ ఏదీ అని బొత్స ప్రశ్నించారు. జనాలలో ఆ ఉత్సాహం ఉంటే కచ్చితంగా వారు కూడా రీ సౌండ్ చేసేవారు అని బొత్స అన్నారు. అలాంటిది ఏదీ లేకపోవడం వల్లనే కూటమి సభ వెలవెల పోయింది అని అన్నారు. కూటమి అధికారంలో ఉండడం నాయకులకు మాత్రమే ఆనందం కానీ ప్రజలకు కాదని బొత్స విమర్శించారు.

డీఎస్సీ మీద విసుర్లు :

తాము లక్షా పాతిక వేల ఉద్యోగాలను గ్రామ వార్డు సచివాలయాలలో ఒక్క అవినీతి అక్రమాల మచ్చ లేకుండా ఇచ్చామని బొత్స గుర్తు చేశారు. మరి మెగా డీఎస్సీ పేరుతో చాలా మందికి జాబ్స్ లేకుండా చేశారని వాటి అక్రమాల మీద విద్యా మంత్రి ఎందుకు మాట్లాడరు అని లోకేష్ ని నిలదీశారు. ప్రభుత్వం అన్నాక ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దాలి కదా అని అన్నారు. మరి ఈ విషయం మీద ప్రభుత్వం ఏ విధంగానూ జవాబుదారీతనాన్ని ప్రదర్శించకపోవడమేంటని నిలదీశారు.

ప్రైవేటీకరణ ఆపాం :

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆపితే ఇందుకు విరుద్ధంగా కూటమి నేతలు అబద్ధాలు చెప్పుకుంటున్నారని బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. మీ కేంద్రమంత్రి కుమారస్వామి జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుపడ్డారని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. కనీసం ఆ విషయం కూడా మీకు గుర్తు లేదా అన్నారు. గతంలో విశాఖ వచ్చినప్పుడు ప్రధాని మోడీకి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పలేదా అని బొత్స గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత రెండేళ్లుగా చోటు చేసుకున్న ప్రమాదాలపై వైసీపీ తరఫున సీఎండీని కలిసి విచారణ కోరబోతున్నామని బొత్స స్పష్టం చేశారు.

Tags:    

Similar News