బిగ్ బ్రేకింగ్ : విపక్ష నేత బొత్సకు అస్వస్థత.. హైదరాబాద్ తరలింపు
బొత్స అస్వస్థతకు గురైన సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఆయన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో కూడా ఎవరికీ ఈ విషయం తెలియదు.;
వైసీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యానారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు సమాచారం. వెంటనే సహాయ సిబ్బంది విజయవాడలోని ఆస్పత్రికి తరలించారని, బొత్సను పరీక్షించిన న్యూరో స్పెషలిస్టులు ప్రాథమిక చికిత్స చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారని అంటున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం బొత్సను హైదరాబాద్ తరలించినట్లు తెలుస్తోంది.
శాసనమండలి బడ్జెట్ సమావేశాల కోసం బొత్స ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు. రోజూ మండలి సమావేశాలకు వెళుతూ చర్చల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గురువారం సైతం ఆయన మండలికి వచ్చారు. అయితే రాత్రి సమయంలో మాట్లాడే విషయంలో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు గమనించి ఆస్పత్రికి వెళ్లినట్లు బొత్స అనుచరులు చెబుతున్నారు. బొత్స అస్వస్థత సమాచారం ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలను షాక్ కు గురిచేసింది. ఆయన అస్పత్రిలో చేరారన్న సమాచారంతో యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.
గురువారం శాసనమండలి సమావేశాలకు బొత్స హాజరుకాలేదు. మిగిలిన సభ్యులు యథావిధిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా, బొత్స గైర్హాజరుపై మీడియా ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. గురువారం తెల్లవారుఝామునే బొత్సను హైదరాబాద్ తరలించినా, ఈ విషయం మధ్యామ్నం రెండు గంటల వరకు ఎవరికీ తెలియలేదు. అయితే భోజన విరామ సమయంలో బొత్స కనిపించకపోవడంతో వైసీపీ ఎమ్మెల్సీలను మీడియా ప్రశ్నించగా, ఆయన హైదరాబాద్ లో ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలియజేశారు.
బొత్స అస్వస్థతకు గురైన సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఆయన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో కూడా ఎవరికీ ఈ విషయం తెలియదు. మీడియాలో బ్రేకింగ్ న్యూస్ చూసిన వెంటనే అందరికీ తెలిసిందని అంటున్నారు. బొత్స అస్వస్థతపై వార్తలు ప్రసారం అవడంతో ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా బొత్స ఇటువంటి అనారోగ్యానికి గురయ్యారు. ఒక సారి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బొత్స మరోసారి అస్వస్థతకు గురయ్యారనే సమాచారం అభిమానులు, కార్యకర్తలను టెన్షన్ పెడుతోంది. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యలు చెబుతున్నారు.