బోండా ఎపిసోడ్...ఇప్పటికి ఇంతేనా ?
టీడీపీ అయినా మరే ప్రాంతీయ పార్టీ అయినా నాయకుల వైఖరి ఒకసారి బయటపడితే అన్నీ మరచిపోయి తిరిగి చేరదీసి అందలం ఎక్కించే విధానం అయితే పెద్దగా ఉండదని అంటారు.
టీడీపీ సీనియర్ నేత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయిన బోండా ఉమా మహేశ్వరరావు మొత్తానికి టీడీపీ అధినాయకత్వం ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ ముందుకు వెళ్ళి వివరణ ఇచ్చారు. ఆ తరువాత బయటకు వచ్చి పార్టీ లైన్ దాటేది లేదని స్పష్టం చేశారు. తాను అన్నది ఏదైనా వక్రీకరించింది వేరు అన్నారు. ఏది ఏమైనా అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తాను అని చెప్పేశారు. అంతే కాదు ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అన్నారు. ఇక్కడితో ఇది క్లోజ్. ఏ ఇబ్బంది లేదు కధ సుఖాంతం అయినట్లే అని హింట్ ఇచ్చారు. అయితే బోండా వంటి ఫైర్ బ్రాండ్ త్రీ మెన్ కమిటీ ఎదుట హాజరయ్యే ముందు చేసిన వ్యాఖ్యలు వేరు, వచ్చిన తరువాత వేరు అని అంటున్నారు.
ఫైర్ బ్రాండ్ గానే :
బోండా ఉమా ఫైర్ బ్రాండ్ లీడర్. ఆ ఫైర్ నచ్చే టీడీపీ ఆయనను అందలం ఎక్కించింది. 2014 నుంచి 2019 మధ్యలో ఆయన టీడీపీ తరఫున అసెంబ్లీలో ఎంత ధాటీగా మాట్లాడేవారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లోనే ఆయన మంత్రి పదవి ఆశించారు. అయితే తొలిసారి గెలవడం వల్ల సీనియర్లు ఎక్కువ మంది ఉండడం వల్ల నాడు వీలు పడలేదు. 2019లో అయితే కేవలం 30 ఓట్ల తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. 2024లో మంచి మెజారిటీతో విజయం సాధించారు. కానీ మంత్రి పదవి అయితే దక్కలేదు. ఆ అసంతృప్తి అలాగే ఉంది. దానికి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కూడా తోడు అయింది. అందుకే ఇటీవల ముద్రగడ సంతాప సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు అని అంటున్నారు.
తగ్గితే నెగ్గుతారా :
టీడీపీ అయినా మరే ప్రాంతీయ పార్టీ అయినా నాయకుల వైఖరి ఒకసారి బయటపడితే అన్నీ మరచిపోయి తిరిగి చేరదీసి అందలం ఎక్కించే విధానం అయితే పెద్దగా ఉండదని అంటారు. వైసీపీ అయితే ఇలాంటివి జరిగినపుడు సదరు లీడర్ ని ఏకంగా దూరమే పెట్టేస్తుంది. టీడీపీలో అయితే అంతా ప్రజాస్వామ్య యుతంగా జరిపించినట్లుగా కమిటీలు వివరణలు ఇలా చాలా ఉంటాయి. అయితే అధినాయకత్వానికి అన్నీ తెలుసు అంటారు. అందుకే ఈ వివరణలు వారిని సంతృప్తి పడనిస్తాయా అన్నదే చర్చ అంటున్నారు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలలో నేతలకు కూడా పరిమితులు ఉంటాయి. తగ్గి నెగ్గించుకోవడమే వ్యూహంగా ఉండాలి. బోండా ఉమా కూడా సందర్భోచితంగా తగ్గారు అని అంటున్నారు.
విస్తరణలో చాన్స్ :
సరే ఇవన్నీ ముగిసిన ఎపిసోడ్ అనుకున్నా రేపో మాపో టీడీపీ జరపబోయే మంత్రి వర్గ విస్తరణలో బోండాకు ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి ప్లేస్ ఉంటుందా అంటే అది ఎవరూ చెప్పలేరని అంటున్నారు. దానికి సామాజిక ప్రాంతీయ సమీకరణలు ఎటూ ఆటంకంగానే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. మరో వైపు చూస్తే బోండా సామాజిక వర్గానికే మంత్రి పదవి ఇవ్వాలీ అంటే కూడా టీడీపీలో వంగవీటి రాధా క్రిష్ణ ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. దాంతో మంత్రిని చేస్తే రంగా లెగసీని గౌరవించినట్లు అవుతుందన్న లెక్క కూడా సరిపోతుంది అని కూడా అంటున్నారు. మరి బోండా పార్టీ లైన్ దాటకుండా విధేయత చూపించినా కలిగే తక్షణ లాభాలేమిటి ఉంటే పెద్దగా ఉంటాయా అన్న ప్రశ్న ఉంది. ఇక 2029 లో ఆయనకు మళ్ళీ టికెట్ విషయంలో కూడా ఎన్నో సమీకరణలతో ఈ ఎపిసోడ్ కూడా ఉంటుందా అంటే ఏమో ప్రాంతీయ పార్టీలలో ఏమైనా ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి బోండా ఈ మధ్య కాలంలో ఆవేశపడి చేసిన వ్యాఖ్యలకు ఫలితం ప్రస్తుతానికి మౌనంగా తన పని తాను చేసుకోవడమే అని అంటున్నారు.