బోడేకు గ్రీన్ సిగ్న‌ల్..వాళ్ల‌కు ఫుల్ రిలీఫ్ ...?

భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ(బీసీవై) అధినేత బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.;

Update: 2025-09-05 16:40 GMT

భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ(బీసీవై) అధినేత బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. రైతుల ప‌క్షాన ఆది నుంచి పోరాటాలు చేయ‌డంలోనూ..వారి హ‌క్కుల కోసం ఉద్య‌మించ‌డంలోనూ.. బోడేకు ప్ర‌త్యేక స్థానం ఉంది. విద్యార్థులు, రైతులు, కార్మికుల ప‌క్షాన బ‌ల‌మైన గ‌ళం వినిపించే నాయ‌కుడిగా కూడా బోడేపేరు తెచ్చుకున్నారు. మామిడి రైతుల నుంచి ట‌మాటా రైతుల వ‌ర‌కు అనేక సంద‌ర్భాల్లో గ‌ళం వినిపించారు... బోడే.

ఈ క్ర‌మంలోనే నెల్లూరు జిల్లా గుడ్లూరులో ఏర్పాటు చేస్తున్న ఇండోసోల్ సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు ను నిరసిస్తూ..రైతులు చేప‌ట్టిన ధ‌ర్నాకు కూడా బోడే ఆదిలో నేతృత్వం వ‌హించారు. అయితే.. మ‌ధ్య‌లో కొన్ని రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిడుల కార‌ణంగా ఆయ‌న త‌ప్పుకొన్నారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఇక్క‌డి రైతులు.. ఆయ‌న ఇంటికివెళ్లి మ‌రీ బ‌తిమాలి.. త‌మ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో బోడే మ‌ద్ద‌తు తెలిపారు. అయితే.. బోడే రాక‌పై ప్ర‌భుత్వం ఆంక్షలు విధించింది.

పోలీసులు కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోకి రాకుండా ఆంక్ష‌లు విధించారు. దీనిపై బోడే హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు. దీనిపై సుదీర్ఘ విచార‌ణ‌ల అనంత‌రం.. కోర్టు తాజాగా బోడేకు అనుమ‌తులు మంజూరు చేసింది. ఆరు కార్ల కాన్వాయ్‌తోపాటు.. 100 మందితో స‌భ నిర్వ‌హించుకునే వెసులుబాటు క‌ల్పించింది. పోలీసులు అడ్డు చెప్ప‌డానికి వీల్లేద‌ని తెలిపింది. ఫ‌లితంగా నెల్లూరు రైతుల‌కు ఊర‌ట ల‌భించింది.

ఏంటీ వివాదం..?

ఇక‌, వివాదం విష‌యానికి వ‌స్తే.. వైసీపీ హ‌యాంలోనే ఇండోసోల్ ప్రాజెక్టుకు భూములు కేటాయించారు. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయా భూముల‌ను ర‌ద్దు చేసి.. గుడ్లూరులో కేటాయించింది. కానీ, ఇక్క‌డ త‌మ‌కు నాలుగు పంట‌లు పండే భూములు ఉన్నాయ‌ని.. వీటిని ఇచ్చేది లేద‌ని రైతులు తెగేసిచెబుతున్నారు. కానీ, ప్ర‌భుత్వం మాత్రం రైతులు భూములు ఇవ్వాల్సిందేన‌ని చెబుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు 123 మంది రైతుల‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. ఇప్పుడు వీరికి మ‌ద్ద‌తుగా బోడే గ‌ళం వినిపించ‌నున్నారు.

Tags:    

Similar News