విజయ్ కు ఆప్షన్ లేదు.. ముందున్నవి రెండు దారులే..
తమిళ రాజకీయ యవనికపై ఉప్పెనలా దూసుకువచ్చిన విజయ్ ఇప్పుడు అనూహ్యమైన చిక్కుల్లో పడ్డారు.;
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు 'దళపతి' విజయ్ చుట్టూ అల్లుకున్న రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీని వ్యక్తిగతంగా విజయ్‌ను కట్టడి చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోందనే చర్చ జోరందుకుంది.
తమిళ రాజకీయ యవనికపై ఉప్పెనలా దూసుకువచ్చిన విజయ్ ఇప్పుడు అనూహ్యమైన చిక్కుల్లో పడ్డారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై జరిగిన ఆరు గంటల సుదీర్ఘ విచారణ కేవలం ఒక 'ట్రైలర్' మాత్రమేనని అసలు సినిమా సంక్రాంతి తర్వాత మొదలవుతుందని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి.
బీజేపీ వ్యూహం.. 'చట్టం'తో చెక్!
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్‌పై వస్తున్న ఆరోపణలు, దర్యాప్తు సంస్థల దూకుడు వెనుక బీజేపీ 'గేమ్ ప్లాన్' స్పష్టంగా కనిపిస్తోంది. విచారణల పేరుతో విజయ్‌ను ఇబ్బంది పెట్టి.. ఆయన్ను రక్షణ కోసం తమ వద్దకు వచ్చేలా చేయడం... అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలోకి విజయ్‌ను చేర్చుకోవడం ద్వారా డీఎంకే బలాన్ని దెబ్బతీయడం. ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత ఈ పరిణామాలు వేగం పుంజుకోవడం గమనార్హం.
విజయ్ మౌనం: వ్యూహమా? బలహీనతనా?
తన సినిమాలపై సెన్సార్ ఆంక్షలు వచ్చినా తనను కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతున్నా విజయ్ బీజేపీపై నేరుగా విమర్శలు చేయడం లేదు. గతంలో సిద్ధాంతపరమైన శత్రువు అని ప్రకటించిన పార్టీపై ఇప్పుడు మౌనం పాటించడం వెనుక, లోలోపల ఏదైనా చర్చలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. పార్టీలోని ఒక వర్గం "డీఎంకేను ఎదుర్కోవాలంటే కేంద్రం అండ అవసరం" అని భావిస్తుంటే మరో వర్గం మాత్రం "బీజేపీతో కలిస్తే పార్టీ అస్తిత్వమే పోతుంది" అని ఆందోళన చెందుతోంది.
ముందున్నవి రెండే దారులు!
ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ముందు కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తున్నాయి.. కేసుల నుంచి ఉపశమనం, తక్షణ రాజకీయ రక్షణ కలుగుతుంది. స్వతంత్ర గుర్తింపు కోల్పోవడం.. 'బీజేపీ బి-టీమ్' అనే ముద్ర పడుతుంది. ప్రజల్లో విపరీతమైన సానుభూతి నిజమైన నాయకుడిగా ఎదగనుంది. సుదీర్ఘ చట్టపరమైన పోరాటం.. పార్టీ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉంది.
సంక్రాంతి తర్వాతే అసలు క్లారిటీ!
తమిళనాడులో ప్రస్తుతం వినిపిస్తున్న లీకుల ప్రకారం.. సంక్రాంతి ముగియగానే దర్యాప్తు సంస్థలు విజయ్‌పై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అరెస్ట్ వరకు వెళ్తారా? లేక విజయ్ రాజీకి వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, విజయ్ తీసుకునే నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తునే కాదు.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రాన్ని కూడా మార్చేయబోతోంది.