బీజేపీకి.. ఆలస్యం విషమేమో!

అయితే అభ్యర్థుల ఎంపికకు బీజేపీ సమయం తీసుకోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.;

Update: 2023-08-30 08:42 GMT

ఆలస్యం అమృతం విషమంటారు. కానీ తెలంగాణ ఎన్నికల విషయంలో బీజేపీకి మాత్రం ఆలస్యం విషమయ్యేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల రేసులో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పోల్చుకుంటే ఇప్పటికే బీజేపీ వెనుకబడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ బీజేపీ బండి నెమ్మదిగా సాగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తొందరపడేది ఏమీ లేదని, నిదానంగా అభ్యర్థులను ప్రకటించాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అభ్యర్థుల ఎంపికకు బీజేపీ సమయం తీసుకోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకటేమో.. ఆ పార్టీకి చాలా చోట్ల సరైన అభ్యర్థులు లేరు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరైనా నాయకులు వస్తారేమోనని చూస్తోందని టాక్. ఇంకోటేమో.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగా జనాల్లో పార్టీకి ఆదరణ పెంచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అందుకే అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మొదట ఆగస్టు నెల చివరి వరకు మూడో వంతు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించాలని బీజేపీ అనుకుంది. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గిందని తెలిసింది. మరోవైపు తెలంగాణలో పార్టీ కీలక నేతలను ముందుగానే ప్రజా క్షేత్రంలోకి పంపాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. సెప్టెంబర్ ముగిసేంత వరకూ వివిధ కార్యక్రమాల పేరుతో నాయకులు ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించారని సమాచారం. కానీ అభ్యర్థుల ఎంపిక ఆలస్యమయ్యే కొద్దీ అది బీజేపీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీలోని నాయకులు కాంగ్రెస్ వైపే చూస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీలోకి చెప్పుకోదగ్గ నాయకుల చేరికల లేవు. మరోవైపు ముందుగానే అభ్యర్థులను ప్రకటించేస్తే తమ ప్రచారమేదో తాము చేసుకుంటారు. కానీ చివర్లో ప్రకటిస్తే అప్పుడు సమయం సరిపోక, ప్రజల్లో తమ ముద్ర వేయలేక వెనుకబడే ప్రమాదం ఉందని టాక్.

Tags:    

Similar News