మారిన బీజేపీ ఎజెండా.. పీవోకే మీద హాట్ కామెంట్స్!

సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు ఫేజ్ లలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-19 05:31 GMT

వ్యూహచతురత అన్న మాటకు నిలువెత్తు రూపంగా కనిపిస్తుంది బీజేపీ. ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికలను వ్యూహాత్మకంగా నడిపించే విషయంలో దేశంలోని ఇతర జాతీయ పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎంతో ముందున్న విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంపై ఇప్పుడిప్పుడే అందరికి అర్థమయ్యే పరిస్థితి. సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు ఫేజ్ లలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఒక్కో ఫేజ్ కు ఒక్కో అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న ముగిసిన ఫేజ్ విషయానికి వస్తే.. హిందూ - ముస్లిం మధ్య సెంటిమెంట్ ను రగిలించి.. హిందూ ఓట్లను ఒక చోటకు చేర్చటం మీదనే ద్రష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడు మరో తరహా సెంటిమెంట్ ను రగిలించే పనిలో నిమిగ్నమైంది. మొన్నటి (మే 13న నాలుగో దశ) ఫేజ్ ముగిసిన తర్వాత నుంచి.. పీవోకే అంశం బీజేపీ నేతల నోటి నుంచి రావటం కనిపిస్తుంది.

Read more!

దీనికి కారణం.. సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన మూడు ఫేజ్ లలోనూ ఓట్లను దండుకోవటానికి కొత్త భావోద్వేగ అంశం ఒకటి అవసరమవుతుంది. ఎందుకంటే.. మిగిలిన మూడు దశల్లో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల ప్రజలు మొదటి నాలుగు దశలు జరిగిన నియోజకవర్గాల ప్రజలకు భిన్నమైన మైండ్ సెట్ లో ఉండటమే. సాధారణంగా ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఒక అంశాన్ని ప్రధానంగా చేసుకొని ప్రచారాన్ని చేపడతారు.

అందుకు భిన్నంగా బీజేపీ వ్యూహరచన చేసినట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాదికి ఒకలా.. దక్షిణాదికి మరోలా.. పశ్చిమ ప్రాంతానికి ఇంకోలా.. ఇలా ఏ దశకు ఆ దశకు తగ్గట్లు.. అక్కడి మెజార్టీ ఓటర్లను కనెక్టు అయ్యేలా కమలనాథుల వ్యూహరచన ఉందని చెప్పాలి. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రులు.. కీలక బీజేపీ నేతలు పీవోకే గురించి మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పీవోకే మీద కీలక వ్యాఖ్యలు చేస్తే.. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ సైతం ఇదే అంశంపై మాట్లాడటం గమనార్హం.

ఈసారి ఎన్నికల్లో బీజేపీ విజయం సాదిస్తే.. పాక్ అక్రమిత కశ్మీర్ మరికొన్ని నెలల్లో భారత్ వశమవుతుందని ఆయన పేర్కొన్నారు.అయితే.. ఇది జరగాలంటే ప్రధానిగా మోడీ మాత్రమే ఉండాలని చెప్పటం గమనార్హం. తాజాగా ఆయన సందేశాన్ని చూస్తే.. బీజపీ వ్యూహంపై కొంత అవగాహన వచ్చే వీలుంది. గడిచిన పదేళ్లలో నరభారత నిర్మాణాన్ని చూశామన్న సీఎం యోగి.. ‘‘ఉగ్రవాదాన్ని అరికట్టాం. మూడేళ్లుగా పాక్ లో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని వెనుక భారత ఏజెన్సీల హస్తం ఉందన్నట్లుగా ఇంగ్లిష్ మీడియాలో కథనాలు వచ్చాయి. మన ప్రజల్ని చంపినోళ్లను మనం పూజించలేం కదా?’’ అంటూ ప్రశ్నించారు.

4

మనోళ్లను చంపినోళ్లకు కచ్చితంగా బుద్ది చెప్పాలన్న మాటను చెప్పిన యోగి.. పీవోకేను ఆర్నెల్ల లోపు భారత్ వశమవుతుందని.. అయితే దానికి ముందుగా మూడోసారీ మోడీయే ప్రధానమంత్రి కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడోసారి మోడీ ప్రధానమంత్రి అయితేనే.. పాక్ అక్రమిత కశ్మీర్ భారత్ వశమవుతుందన్న సెంటిమెంట్ మాటను భారీగా దట్టిస్తున్న యోగి అండ్ కోను చూస్తే.. మిగిలిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎజెండా ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు. మిగిలిన మూడు దశల్లోని ఓటర్లను తమవైపు తిప్పుకోవటానికి వీలుగా బీజేపీ వేసిన స్కెచ్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుందంటున్నారు. మోడీనా మజాకానా?

Tags:    

Similar News