దక్షిణం కాంగ్రెస్ మయం...బాబు పవన్ లదే భారం !

ప్రధాని నరేంద్ర మోడీ కార్యశీలి. ఆయన ఒక విజయంతో పొంగిపోరు, అలాగే మరో అపజయంతో అసలు కృంగిపోరు. పశ్చిమ బెంగాల్ లాంటి అతి పెద్ద రాష్ట్రాన్ని గెలుచుకున్నా కూడా బీజేపీలో ఆనందం అంతగా లేదు.;

Update: 2026-05-11 04:13 GMT

ప్రధాని నరేంద్ర మోడీ కార్యశీలి. ఆయన ఒక విజయంతో పొంగిపోరు, అలాగే మరో అపజయంతో అసలు కృంగిపోరు. పశ్చిమ బెంగాల్ లాంటి అతి పెద్ద రాష్ట్రాన్ని గెలుచుకున్నా కూడా బీజేపీలో ఆనందం అంతగా లేదు. దానికి కారణం దక్షిణాది ప్రతిపక్షాల చేతుల్లోకి పోవడం. కేవలం ఏపీ తప్ప అంతటా కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలదే అధికారంగా ఉంది. కర్ణాటక, తెలంగాణాలలో 2023 లోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాజాగా కేరళలో కూడా గెలిచింది. ఇక గత ఆరు దశాబ్దాల తరువాత తమిళనాడులో ప్రభుత్వంలో చేరబోతోంది. కొత్త మిత్రుడు తాజా రాజకీయ పార్టీతో యువ నేత దళపతి విజయ్ కాంగ్రెస్ తో చేతులు కలపడం ఎక్కడ లేని బలాన్ని కాంగ్రెస్ కి ఇస్తోంది. దీంతో ఈ పరిణామాలు సహజంగానే కాషాయం పార్టీలో కలవరం రేకెత్తిస్తున్నాయని అంటున్నారు.

దక్కని దక్షిణంతోనే :

బీజేపీ ఎన్ని చేసినా దక్షిణ భారతం అయితే ఏ మాత్రం చోటు ఇవ్వడం లేదు. కర్ణాటకలో మాత్రం బీజేపీ కొంత కాలం అధికారం అందుకుంది. ఇక కేరళ తమిళనాడులో బీజేపీ ఆశలు ఇప్పట్లో తీరేవి కావు అని రుజువు అవుతోంది. తెలంగాణాలో ఆశలు ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేంత సీన్ అయితే లేదు అని అంటున్నారు. ఏపీలో మాత్రం టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ అధికారం పంచుకుంది. అక్కడ కూటమిలో బీజేపీ మూడో పార్టీగా ఉంది. ప్రభుత్వంలో ఒకే ఒక మంత్రి పదవితో నామమాత్రంగా ఉంది. ఇక దక్షిణాదిన రాజకీయ తులాభారంలో కాంగ్రెస్ కే భారీ మొగ్గు కనిపిస్తోంది. ఈ పరిణామాలే కమలనాధులలో ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.

తెలుగు స్టేట్స్ టార్గెట్ :

ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ అండ్ కోకి అయిదు రాష్ట్రాల ఫలితాల తరువాత ఒక విషయం అర్ధం అయింది అని అంటున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్ భారీగా పుంజుకుంటోంది అని. కేరళంలో సొంతంగా అధికారం, తమిళనాడుతో విజయ్ తో భాగస్వామ్యం, కర్ణాటకలో డీకే శివకుమార్ వంటి ట్రబుల్ షూటర్ ఉండడం, తెలంగాణలో డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి సారధ్యం ఇవన్నీ కాంగ్రెస్ కి 2029 నాటికి ఆయుధాలుగా మారబోతాయని అభిప్రాయం అయితే బీజేపీలో ఉంది. ఇక ఉత్తరాదిన బీజేపీకి మరోసారి సీట్లు తగ్గితే వచ్చే ఎన్నికల్లో అధికారం దూరం అవుతుందన్న కలవరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో గణనీయంగా రాజకీయ లాభం పొందాలని బీజేపీ భావిస్తోంది.

మోడీయే స్వయంగా రంగంలోకి :

కర్ణాటకలో జేడీఎస్ తో కలసి తాము పటిష్టం అయ్యే ప్లాన్స్ బీజేపీకి ఉన్నాయి. దాంతో జనాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్, అలాగే అపర చాణక్యుడు చంద్రబాబుల మీద ఈ రెండు తెలుగు రాష్ట్రాల బాధ్యత పట్టాలన్నదే బీజేపీ పెద్దల వ్యూహంగా ఉంది అని అంటున్నారు. రెండు తెలుగు స్టేట్స్ లో మొత్తంగా ఉన్న 42 ఎంపీ సీట్లలో మెజారిటీ సొంతం చేసుకుంటే కర్ణాటకలో అత్యధికం తెచ్చుకుంటే దక్షిణ భారతంలో కాంగ్రెస్ హవాకు సగానికి సగం అయినా బ్రేకు వేసినట్లు అవుతుందన్నది బీజేపీ పెద్దల పధక రచన అని అంటున్నారు. అందుకే మోడీయే స్వయంగా రంగంలోకి దిగారని అంటున్నారు ఆయన ఒకేసారి పవన్ చంద్రబాబు ఇళ్ళకు వెళ్ళి వారితో భేటీ అయ్యారు. ఇక రానున్న కాలంలో తెలుగు రాజకీయాల్లో బీజేపీ గేర్ మార్చి స్పీడ్ పెంచే సూచనలు అయితే దండీగా కనిపించబోతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News