సంఘీయుడే బీజేపీ కొత్త సారధి...మోడీకి భారీ ఊరట !
తొందరలోనే బీజేపీకి నూతన జాతీయ అధ్యక్షుడు రాబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఇది బాగా ఆలస్యం అయింది.;
తొందరలోనే బీజేపీకి నూతన జాతీయ అధ్యక్షుడు రాబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఇది బాగా ఆలస్యం అయింది. ఎంతలా అంటే రెండున్నరేళ్ళుగా అని చెప్పాలి. బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2025 నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నారు. ఆయన మాదిరిగా అన్నాళ్ళ పాటు ఏకమొత్తంగా పార్టీ అధినేత బాధ్యతలు నిర్వహించిన వారు బహుశా ఎవరూ లేరేమో. ఇక ఆయన తొందరలో మాజీ కాబోతున్నారు. ఆయన స్థానంలో కొత్త అధినేత వస్తున్నారు. ఇది సెప్టెంబర్ నెలలోనే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సంఘ్ నేతకే చాన్స్ :
ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ నేపధ్యం ఉన్న నేతకే బీజేపీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. ఈ విషయం మీద ఆర్ఎస్ఎస్ తగిన సూచనలు ఇస్తుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 5 నుంచి రాజస్థాన్ లో జరిగే ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాలలో ఈ విషయం మీదనే కీలకంగా చర్చిస్తారు అని అంటున్నారు. అలా ఆర్ఎస్ఎస్ సూచించిన నేత మీద బీజేపీ పెద్దలు ఆలోచించి ఆమోద ముద్ర వేస్తారు అని అంటున్నారు సో ఆ విధంగా ఆర్ఎస్ఎస్ నేతని బీజేపీ సారధిగా చేయాలన్న సంఘ్ పంతం కూడా నెగ్గినట్లు అవుతుంది అని అంటున్నారు.
మోడీయే మరింత కాలం :
మరో వైపు చూస్తే ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోడీ ఇప్పట్లో దిగేది లేదు. ఆ సంగతి అందరికీ తెలుసు అయితే ఆ మధ్యన నాగపూర్ వేదికగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన 75 ఏళ్ళకే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న సూచనలు మోడీ కోసమే అంటూ అంతా ప్రచారం చేశారు. అయితే అదేమీ కాదని తన వ్యాఖ్యలు తప్పుగా అర్ధం చేసుకున్నారని ఢిల్లీలో జరిగిన ఆర్ఎస్ఎస్ వందేళ్ళ వేడుకల సందర్భంగా మోహన్ భగవత్ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా సంఘ్ ఆదేశిస్తే ఎనభయ్యేళ్ళు వచ్చినా కొనసాగుతాను అని చెప్పడం ద్వారా మోడీకి 80 ఏళ్ళు వచ్చినా ప్రధానిగా కొనసాగవచ్చు అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటున్నారు. అంటే 2029 తరువాత కూడా మోడీయే ప్రధానిగా ఉంటారని ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సంకేతంగాన అంతా చూస్తున్నారు. ఇది ఒక విధంగా చూస్తే మోడీకి భారీ ఊరట అని అంటున్నారు ఎందుకంటే సెప్టెంబర్ 17తో మోడీకి 75 ఏళ్ళ వయసు నిండుతుంది. ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు ఇప్పటికే మెల్లగా అంటున్నాయి. ఇపుడు ఆర్ఎస్ఎస్ ఈ విధంగా స్పష్టం చేయడంతో మోడీ ఏజ్ కీ ప్రధాని పీఠానికి ఉన్న లింక్ ని తెగ్గొట్టినట్లు అయింది అని అంటున్నారు
గ్యాప్ లేదనే అర్ధమా :
ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ ల మధ్య విభేదాలు ఏవీ లేవని కూడా మోహన్ భగవత్ స్పష్టంగానే చెప్పారు. బీజేపీని తాము ఎపుడూ నియంత్రించేది ఉండదని అన్నారు. దాంతో బీజేపీ రాజకీయంగా తీసుకునే నిర్ణయాలకూ ఆర్ఎస్ఎస్ కి ఏ విధంగానూ సంబంధం లేదని ఆయన తేల్చినట్లు అయింది. అయితే ఆర్ఎస్ఎస్ తో బీజేపీ పెద్దలు గ్యాప్ ని తగ్గించుకుంటున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఆర్ఎస్ఎస్ కోరిన వారిని బీజేపీ సారధి చేయడం ద్వారా సంఘ్ తో సామరస్యాన్ని కోరుకుంటున్నారు అని అంటున్నారు. మరో వైపు దేశంలో మారుతున్న రజకీయ వాతావరణం, విపఖాల ఐక్యత వంటివి కూడా గమనించిన మీదటనే ఆర్ఎస్ఎస్ సైతం మోడీ నాయకత్వానికే మొగ్గు చూపుతోందని అంటున్నారు. మొత్తానికి మోడీ ప్రధానిగా జనాలు ఆదరించినంతకాలం కొనసాగుతారు అని అంటున్నారు.