ఏపీని ఏలుతోంది బీజేపీనే...రుజువులు కావాలా ?

అయితే ఏపీని నిజంగా ఏలుతోంది బీజేపీ అంటారు ఇక్కడి వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు.;

Update: 2025-08-26 22:30 GMT

ఏపీని ఎవరు పాలిస్తున్నారు అంటే టీడీపీ కూటమి అని ఠక్కున జవాబు చెబుతారు. అయితే ఏపీని నిజంగా ఏలుతోంది బీజేపీ అంటారు ఇక్కడి వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు. ఏపీని ఏలుతున్న కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా అందువల్ల బీజేపీ పాలనలో భాగస్వామి కదా అని తర్కానికి అనుకోవచ్చు. కానీ బీజేపీ నుంచి ఒక మంత్రి మాత్రమే కూటమిలో ఉన్నారు పైగా అత్యధిక అసెంబ్లీ సీట్లు టీడీపీకి ఉన్నాయి. ముఖ్యమంత్రిగా కూటమి సారధిగా చంద్రబాబు ఉన్నారు. అందువల్ల బీజేపీకి పూర్తి అధికారం ఎలా అని చెబుతారు అంటే అక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది మరి.

బీజేపీదే హవా అంతా :

ఏపీలో పాతిక దాకా లోక్ సభ ఎంపీ సీట్లు ఉన్నాయి. పదకొండు దాకా రాజ్యసభ ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తం 36 ఎంపీలు ఉంటే ఈ 36 మంది ఎంపీలు కూడా బీజేపీ వారే అని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీల నేతలు అంటారు వారు అన్నారు అని కాదు కానీ అందులో తప్పేముంది అని కూడా చెప్పాల్సి ఉంది. 2014 నుంచి 2025 దాకా చూసుకుంటే ఏపీలో ఏ ఒక్క పార్టీ అయినా బీజేపీని పెద్దగా వ్యతిరేకించిన దాఖలాలు అయితే లేవు. మధ్యలో 2019కి ముందు టీడీపీ కొంతకాలం వ్యతిరేక ఎర్ర జెండా చూపించినా ఆ తరువాత సర్దుకుని జై బీజేపీ అంటూ వచ్చింది.

టీడీపీ ఫుల్ సపోర్టు :

ఇక 2014లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఫుల్ సపోర్ట్ గా 2018 దాకా నిలిచింది. అదే సమయంలో విపక్షంలో ఉంటూ తమ పార్టీ తరఫున గెలిచిన 8 మంది ఎంపీల మద్దతుని వైసీపీ కీలక సమయాల్లో అందిస్తూ వస్తోంది. ఇక 2018లో టీడీపీ గట్టిగానే వ్యతిరేకించింది కానీ 2019లో ఓటమి పాలు కావడంతో సీఎన్ మారింది. టీడీపీ నుంచి నలుగురు ఎంపీలను బీజేపీలోకి టీడీపీ వ్యూహం ప్రకారమే పంపించారు అని ప్రచారంలో ఉంది. ఆ తరువాత అనేక బిల్లులకు టీడీపీ మద్దతు ఇచ్చింది ఇక రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వంటి ఎన్నికలు జరిగితే టీడీపీ విపక్షంలో ఉన్నా ఓటేసి జై కొట్టింది.

వైసీపీ తీరే వేరు :

టీడీపీ మధ్యలో కొంతకాలం అయినా బీజేపీ విధానాలను ఎండగట్టింది కానీ వైసీపీ అయితే 2014 నుంచి 2025 దాకా ఈ పదకొండేళ్ళ కాలంలో ఎక్కడా ఒక్క పొడి మాట కూడా బీజేపీ మీద అనలేదంటే ఆశ్చర్యమే అంతే కాదు బీజేపీ మీద ఈగ వాలకుండా జాగ్రత్తగా చూసుకుంది. అంతే కాదు బీజేపీ ఏ బిల్లు పెట్టినా తొలి మద్దతు వైసీపీదే అన్న పరిస్థితి వచ్చింది. ఒక బీజేపీ నుంచి రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వంటి పదవులకు అభ్యర్ధులను పోటీ పెడితే రెండవ మాట అన్నది లేకుండా మద్దతు ఇస్తూ వస్తోంది వైసీపీనే.

దేశమంతా ఒక ఎత్తు ఏపీలో మాత్రం :

ఏ ఎన్నిక జరిగినా లేక ఏ బిల్లు ప్రవేశపెట్టినా దేశమంతా ఒక ఎత్తుగా ఉంటే ఏపీలో మాత్రం వేరేగా ఉంటుందని అంటారు. ఇక లేటెస్ట్ గా తీసుకుంటే ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో ఉన్న మొత్తం 36 ఎంపీల ఓట్లు ఏ ఒక్కటీ కూడా పొల్లుపోకుండా బీజేపీకే పడుతున్నాయి. అంటే ఎన్డీయే కూటమి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కి అన్న మాట. ఇండియా కూటమికి పొరపాటున ఒక్క ఓటు కూడా పడే సీన్ అయితే కనిపించడంలేదు. అలా ఉంది ఏపీ రాజకీయం అని అంటున్నారు. అదే తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ ఎంపీల ఓట్లు మజ్లీస్ ఓటు ఇండియా కూటమికి వెళ్తే బీజేపీ ఎంపీల ఓట్లు ఎన్డీయే అభ్యర్ధికి వెళ్తున్నాయి. బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా అక్కడ భిన్నమైన వైఖరులు ఉన్నాయి. ఏపీలో మాత్రం అంతా ఏక మాటగా ఉంది.

ఎంతటి అదృష్టమో :

రాజకీయాల్లో ఇంతటి ఐక్యత కానీ ఒకే విధానం కానీ బహుశా ఏపీ తప్ప ఎక్కడా ఉండవని అంటారు. ఏపీలో అంతా జై మోడీ జై బీజేపీ నినాదంతో ముందుకు పోతున్నారు. చిత్రమేంటి అంటే వైసీపీ విపక్షంలో ఉంది అధికార కూటమిలో టీడీపీ జనసేనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తుంది. కానీ బీజేపీని పల్లెత్తు మాట అనదు. టీడీపీ వైఖరి కూడా 2019 నుంచి 2024 మధ్యలో ఇలాగే ఉండేది. బీజేపీని ఏమీ అనకుండా తమ బాణాలను వైసీపీ మీద ఎక్కుపెడుతూ వచ్చింది. మొత్తానికి చూస్తే బీజేపీ అందరి బంధువయ్యా అన్నట్లుగా ఉంది. ఏపీలో పేరుకు ఏ పార్టీ ఎంపీలు అయినా ఎవరు అధికారంలో ఉన్నా అంతా బీజేపీదే అని అంటున్నారు అంటే నమ్మాల్సిందే కదా.

Tags:    

Similar News