బిహార్ ఓట్ల లెక్కలతో సిద్ధంగా ఉండండి.. ఈసీకి సుప్రీం అల్టిమేటం
బిహార్ ప్రధాన ప్రతిపక్‌షం ఆర్జేజీ నాయకుడు మనోజ్ ఝా వేసిన పిటిషన్ పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.;
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న బిహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) రాజకీయ మంటలు రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 1నే ముసాయిదా ప్రకటించగా.. ఆ లెక్కలు చూసిన ప్రతిపక్షాలు తమ ఆరోపణలకు పదును పెట్టాయి. బిహార్ అంటేనే కాస్త వ్యవస్థల పట్ల అపనమ్మకం. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వెలువడింది. నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్ల నుంచి ముసాయిదాలో 7.24 కోట్లకు తగ్గింది. అక్టోబరు-నవంబరులో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్న బిహార్ లో సెప్టెంబరు 30న తుది జాబితాను ప్రకటించనున్నారు.
ఈసీ నిర్ణయంపై సవాల్...
మహారాష్ట్ర ఎన్నికల్లో తమకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ దారుణ ఓటమిపాలైన ఇండియా కూటమికి బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఓ ఆయుధంగా మారింది. ఓట్ల అవకతవకలతోనే తాము మహారాష్ట్ర సహా లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయామంటున్న ఇండియా కూటమి పార్టీలు ఇప్పుడు బిహార్ లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. సరైన వివరాలు, అన్ని గణాంకాలతో సిద్ధంగా ఉండాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్చ బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
బతికున్న 12 మంది చనిపోయినట్లు..
బిహార్ ప్రధాన ప్రతిపక్‌షం ఆర్జేజీ నాయకుడు మనోజ్ ఝా వేసిన పిటిషన్ పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఓ నియోజకవర్గంలో 12 మంది బతికి ఉన్నవారిని చనిపోయినట్లుగా చూపారని తెలిపారు. కొన్నిచోట్ల చనిపోయినవారిని బతికున్నట్లు చూపారని పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ తప్పిదాలని, సహజంగా జరిగేవే అని ఈసీ తరఫున న్యాయవాది రాకేశ్ ద్వివేది తెలిపారు. బిహార్ లో ప్రకటించినది ముసాయిదా మాత్రమేనని పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదలన అనంతరం సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచించింది. ఈ క్రమంలో ఎస్‌ఐఆర్ కు ముందు ఎందరు ఓటర్లున్నారు? గతంలో నమోదైన మరణాల సంఖ్య, ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్యలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, ఎస్‌ఐఆర్ అంశంపై గత నెలలో సుప్రీం స్పందించింది. మూకుమ్మడిగా ఓట్లను తొలగిస్తే తాము వెంటనే జోక్యం చేసుకుంటామని తెలిపింది. గత నెల 10న విచారణ సందర్భంగా ఎస్‌ఐఆర్ ఆపేందుకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో ఓటరు ఐడీలను ప్రాథమిక పత్రాలుగా తీసుకోవాలని సూచించింది.