అఖిలది ఓవర్ యాక్షనేనా ?

మరి అఖిల దీక్షచేయటం ఓవర్ యాక్షన్ ఎలాగ అవుతుంది ? ఎలాగంటే పార్టీ కార్యక్రమాలకు అఖిలను చంద్రబాబు, లోకేష్ దూరంగా పెట్టేశారు.

Update: 2023-09-23 06:25 GMT

మాజీ మంత్రి భూమా అఖిలప్రియది ఓవర్ యాక్షన్ లాగే ఉంది. నంద్యాలలో ఆర్కె ఫంక్షన్ హాలులో తమ్ముడు భూమా జగద్విఖ్యాతరెడ్డితో కలిసి అఖిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గురువారం ఫంక్షన్ హాలులో అఖిల ఆమరణ దీక్ష మొదలుపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. జైలు నుండి క్షేమంగా చంద్రబాబు బయటకు వచ్చేంతవరకు తన దీక్షను విరమించేదిలేదని మాజీమంత్రి ప్రకటించారు. అధినేత చంద్రబాబు కోసం నేతలు దీక్షలు చేయటం, ఆందోళనలు, నిరసనలు చేయటం చాలా సహజమనే అనుకోవాలి.

మరి అఖిల దీక్షచేయటం ఓవర్ యాక్షన్ ఎలాగ అవుతుంది ? ఎలాగంటే పార్టీ కార్యక్రమాలకు అఖిలను చంద్రబాబు, లోకేష్ దూరంగా పెట్టేశారు. పార్టీకి అఖిలకు ఎలాంటి సంబంధాలు లేవన్నట్లుగానే వీళ్ళు చూస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అఖిలను ఇన్వాల్వ్ చేయటంలేదు. పార్టీ సమావేశాలకు కూడా చంద్రబాబు సమాచారం ఇవ్వటంలేదు. ఈ మధ్యనే తన నంద్యాల పర్యటనలో కూడా అఖిలను చంద్రబాబు దూరంగానే ఉంచారు.

జిల్లా పర్యటనలో నంద్యాల నియోజకవర్గం ఇన్చార్జి భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు కొందరు సీనియర్లతో సమావేశమైన చంద్రబాబు మాజీమంత్రిని మాత్రం రానీయలేదు. అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎవరినీ నియమించలేదు.

Read more!

తనకే టికెట్ దక్కాలని అఖిల ఎంతగా అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవటంలేదు. చంద్రబాబు, లోకేష్ వైఖరి చూసిన తర్వాత తనకు టికెట్ దక్కే అవకాశంలేదని అఖిలకు అర్ధమైనట్లుంది. అందుకనే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో అభ్యర్ధులుగా తాను చెప్పిన వాళ్ళకే టికెట్లిస్తే కనీసం నలుగురు ఎంఎల్ఏలను గెలిపించుకుని వస్తానని యాదవ్ కు అఖిల చెప్పారట. కాకపోతే ఆళ్ళగడ్డలో తన ఖర్చుమొత్తాన్ని పార్టీనే భరించాలని షరతు విధించినట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలో చంద్రబాబు జైలు నుండి విడుదల్లయ్యే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయటం అంటే ఓవర్ యాక్షన్ కాక మరేమిటి ? అసలు పార్టీతో అఖిలకు ఎలాంటి సంబంధంలేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే ఆమేమో దీక్షకు దిగటం భలే విచిత్రంగా ఉంది.

Tags:    

Similar News