పవన్ అపాయింట్మెంట్ ఇస్తే భీమవరం గుట్టు రట్టు చేస్తా !

ఇంతటితో గ్రంధి శ్రీనివాస్ ఊరుకోలేదు. మామూళ్ళు ఆగిపోయాయనే కొందరు పనిగట్టుకుని భీమవరం డీఎస్పీ మీద లేని పోనివి పవన్ కి చెప్పారు అని ఆయన అంటున్నారు.;

Update: 2025-10-26 12:59 GMT

భీమవరం డీఎస్పీ ఇష్యూ గోదావరి జిల్లాలలో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఏ ముహూర్తాన ఆయన పైన సీరియస్ అయ్యారో తెలియదు కానీ అది రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డీఎస్పీ మీద నివేదిక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కోరారు. ఆ మీదట హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ పవన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడంలో తప్పులేదని అన్నారు. ఇక భీమవరం డీఎస్పీ మంచి వారే అని ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు కూడా చెప్పారు. ఇపుడు ఈ ఇష్యూలోకి భీమవరం నుంచి 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి పవన్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమవరం డీఎస్పీ విషయంలో రఘురామ చెప్పిందే నూరు శాతం నిజం అని చెప్పడం విశేషం అయితే భీమవరంలో చాలానే జరుగుతున్నాయని వాటి మీద మొత్తం గుట్టుమట్లు అన్నీ పవన్ ని స్వయంగా కలిసి అన్ని విషయాలు తానే స్వయంగా వివరిస్తారు అంటున్నారు.

గుట్టు రట్టు చేస్తా :

భీమవరంలో ఏమి జరుగుతోంది పేకాట జూదాల వెనక ఏమిటి అసలు మ్యాటర్ ఎవరేంటి ఈ దందా వెనక ఎవరున్నారు అన్న దాని మీద మొత్తం గుట్టుని తాను విప్పుతాను అని గ్రంధి శ్రీనివాస్ అంటున్నారు. ఇక డీఎస్పీ జయసూర్య మీద కూటమిలో కొందరు మద్దతుగా మాట్లాడుతూంటే మరికొందరు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం డీఎస్పీకే మద్దతుగా మాట్లాడడం విశేషంగా అంతా చూస్తున్నారు. అంతే కాదు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడచిన పదిహేడు నెలల కాలంలో పద్నాలుగు నెలల పాటు సాగిన పేకాట దందాలను ఉక్కు పాదంతో డీఎస్పీ అణచివేశారు అని చెప్పారు. అందుకే ఇపుడు ఆయన మీద పనిగట్టుకుని కొంతమంది పవన్ కి ఫిర్యాదు చేశారు అని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఇది ఒక్కసారిగా కూటమిలోనూ సీరియస్ చర్చకు తావిస్తోంది.

స్పందించడం అభినందనీయం :

భీమవరంలో పేకాట జూదం వంటి విషయంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ స్పందించడం అభినందనీయం అని అంటున్నారు. అయితే అసలు విషయాలు చాలానే ఉన్నాయని గ్రంధి శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. భీమవరంలో ఏమి జరుగుతోంది అన్నది పవన్ కి పూర్తిగా తెలియచేయాలన్నది తన ఉద్దేశ్యం అన్నారు. అందుకే తానే స్వయంగా పవన్ కి తొందరలో కలసి అసలు భీమవరంలో ఏమి జరుగుతోంది అన్నది పూర్తి స్థాయిలో వివరిస్తాను అని సంచలన ప్రకటన చేశారు. భీమవరంలో జూద శిబిరాల లోగుట్టు ఏంటో పవన్ కే అన్ని విషయాలు చెప్పి లోగుట్టు పూర్తిగా బట్టబయలు చేస్తాను అని గ్రంధి శ్రీనివాస్ అంటున్నారు. అయితే తనకు పవన్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు.

మామూళ్ళు ఆగిపోయాయనే :

ఇంతటితో గ్రంధి శ్రీనివాస్ ఊరుకోలేదు. మామూళ్ళు ఆగిపోయాయనే కొందరు పనిగట్టుకుని భీమవరం డీఎస్పీ మీద లేని పోనివి పవన్ కి చెప్పారు అని ఆయన అంటున్నారు. క్లబ్ ల ద్వారా భారీగా అక్రమార్జన గత పద్నాలుగు నెలలుగా కొందరికి దక్కిందని గడచిన మూడు నెలలుగా అది ఆగిపోవడంతోనే వారు ఈ రకంగా చేస్తున్నారు అని అన్నారు. ఇంతకీ ఎవరు వారు అని మీడియా ప్రశ్నించగా ఎవరేమిటో భీమవరం ప్రజలు అందరికీ తెలుసు అన్నారు. ఒక్కసారి వారిని అడిగితే అంతా తెలుస్తుందని అన్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం తన దగ్గర ఉందని కూడా గ్రంధి చెప్పడం విశేషం.

అసలు మ్యాటర్ ఏంటో :

భీమవరం డీఎస్పీ విషయం, అలాగే జూద శిబిరాల వెనక దందాలు అసలు గుట్టు ఏమిటి అన్నది తనకు తెలుసు అని మాజీ ఎమ్మెల్యే చెప్పడం విశేషం. ఇవన్నీ కూడా పవన్ కే పూర్తి సమాచారం ఇస్తామని ఆయన చెప్పారు. అంతే కాదు ఆయన పవన్ ని కలిస్తే కేవలం భీమవరం పేకాట జూదం గురించే కాకుండా మొత్తం రాజకీయాల గురించి కూడా పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎవరేమిటి అన్నది కూడా ఆయన వివరిస్తారు అని అంటున్నారు.

గ్రంధి రాజకీయమేంటి :

ఇదిలా ఉంటే గ్రంధి శ్రీనివాస్ ఒకనాడు పవన్ ని ఘాటుగా విమర్శించారు. ఆయన వైసీపీలో అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్నపుడు పవన్ మీద తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసేవారు. అయితే 2024లో ఓటమి పాలు అయ్యాక ఆయన నెమ్మదిగా వైసీపీకి దూరం అయ్యారు. ఆయన కుదిరితే టీడీపీ లేకపోతే జనసేనలో చేరాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇంతవరకూ ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఏ వైపు నుంచి రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో భీమవరంలో పేకాట జూదం ఇష్యూ హైలెట్ కావడంతో దానిని ముందు పెట్టుకుని పవన్ ని కలిసే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. భీమవరంలో అంగబలం అర్ధబలం కలిగిన నేతగా బలమైన నాయకుడిగా ఉన్న గ్రంధి శ్రీనివాస్ కి పవన్ కనుక అపాయింట్మెంట్ ఇస్తే భీమవరం రాజకీయం మొత్తంగా మారుతుంది అని అంటున్నారు. అయితే తాను ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను అని ఆయన చెప్పారు. తాను ఏ పార్టీలో చేరేది అన్నది ఇపుడే ఏమీ అనుకోలేదని చెప్పడం విశేషం.

Tags:    

Similar News