సామాన్యుడి కష్టాలు అనుభవం అయిన వేళ.. ఎంపీ పోస్ట్ వైరల్!
అవును... బెంగళూరు ట్రాఫిక్ సమస్యల గురించి అనుభవం ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీడియాలో ఎంత చదివినా, చూసినా.. అనుభవిస్తే పూర్తిగా తెలుస్తుందని చెబుతుంటారు.;
సిటీల్లో ట్రాఫిక్ సమస్యలతో ప్రతీ రోజూ లక్షల మంది నగర పౌరులు నరకయాతన అనుభవిస్తుంటారన్న సంగతి తెలిసిందే! గంటల తరబడి తాము ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతుంటే.. పక్కన గ్రీన్ జోన్ లో నేతలు రయ్ మంటూ వెళ్లిపోతుండటం చూసి చాలా మంది ఫైరవుతుంటారు! ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా సామాన్యుడి తరహాలో ఒక ఎంపీ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. దీంతో.. తన అనుభవాన్ని, ఆగ్రహాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అవును... బెంగళూరు ట్రాఫిక్ సమస్యల గురించి అనుభవం ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీడియాలో ఎంత చదివినా, చూసినా.. అనుభవిస్తే పూర్తిగా తెలుస్తుందని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఎంపీ బెంగళూరు రోడ్లపై ప్రతి రోజూ లక్షలాది మంది సామాన్యులు అనుభవించే కష్టాలను రుచి చూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. అధికారులపై మండిపడుతూ, సమస్యను సీఎం కు నివేదించారు!
వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరు ట్రాఫిక్ సమస్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... బెంగళూరు ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉందని, నగర పోలీసులతో ప్రయోజనం లేకుండా పోయిందంటూ విమర్శించారు! పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి తాను ఆదివారం ఢిల్లీ బయలుదేరగా.. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన, నరకం చూసినట్లు తెలిపారు!
ఆ సమయంలో.. వాహనాల రద్దీని క్లియర్ చేయడానికి రోడ్డుపై ఒక్క ట్రాఫిక్ పోలీసు కూడా కనిపించలేదని చెప్పిన ఎంపీ రాజీవ్ రాయ్.. ఎయిర్ పోర్టుకు సమయానికి చేరుకోవడంలో ఇబ్బంది నెలకొనడంతో బెంగళూరు పోలీసులను సంప్రందించినప్పటికీ.. వారు స్పందించలేదని తెలిపారు. ఈ సందర్భంగా... తన ఫోన్ నుంచి డయల్ చేసిన నెంబర్స్ స్క్రీన్ షాట్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా... ఈ సమస్యను సోషల్ మీడియా వేదికగా సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా... బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణ ఏమాత్రం సరిగా లేదని.. అందమైన నగరంగా ప్రఖ్యాతి చెందిన నగరం కాస్తా అసమర్ధ అధికారుల వల్ల అపఖ్యాతిని మూటగట్టుకుంటుందని ఘాటుగా విమర్శించారు. ఈ నగరం ట్రాఫిక్ సమస్యల వల్ల అందరి నుంచీ విమర్శలు ఎదుర్కొంటుందని తెలిపారు.
దీంతో బెంగళూరు సిటీ ట్రాఫిక్ మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారగా... సామాన్యుడి కష్టాలు నేతలకు అనుభవం అయినప్పుడు ఇలానే ఉంటుందంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు!