మధ్యాహ్న భోజనంలోనూ విభజన.. పాఠశాలలో మతం ఆధారంగా తయారీ
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్ జిల్లా పూర్బస్థలి-1 బ్లాకులోని ఒక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో మతపరమైన విభజన వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది;
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్ జిల్లా పూర్బస్థలి-1 బ్లాకులోని ఒక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో మతపరమైన విభజన వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ పాఠశాలలో హిందూ, ముస్లిం విద్యార్థులకు వేర్వేరుగా వంట చేయడం, వేర్వేరు పాత్రలు, వంట సామగ్రిని ఉపయోగించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
పాఠశాలలో మొత్తం 72 మంది విద్యార్థులుండగా వారిలో 43 మంది హిందువులు, 29 మంది ముస్లింలు ఉన్నారు. పిల్లల మధ్య మత భేదాలను ప్రోత్సహించే విధంగా ఈ పద్ధతి కొనసాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంట చేసే రాణూబీబీ మాట్లాడుతూ ఇది సరైన పద్ధతి కాదని తెలిసినా పాఠశాల యాజమాన్యం ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నామని తెలిపారు. మరో వంటమనిషి సోనాలీ మజుందార్ మాట్లాడుతూ రెండు వర్గాలకు వేర్వేరు వంట సామగ్రిని ఉపయోగిస్తున్నామని, అయితే ఒకే సిలిండర్‌ను మాత్రం పంచుకుంటున్నామని చెప్పారు.
ఈ వ్యవహారంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తపస్ ఘోష్ స్పందిస్తూ, ఇది చాలా కాలంగా జరుగుతున్న పద్ధతేనని, తాను చేరినప్పటి నుంచీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని వివరించారు. ఈ పద్ధతిని మార్చడానికి ప్రయత్నించినా ఫలితం లేదని, ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం, విద్యాశాఖకు నివేదించామని ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం తక్షణ విచారణకు ఆదేశించింది. విద్యార్థులకు విద్యతో పాటు మానవీయ విలువలు నేర్పించాల్సిన పాఠశాలలో ఇలాంటి మతపరమైన విభజన ఆందోళన కలిగిస్తోంది. మతాల మధ్య ఐక్యతను దెబ్బతీసే ఈ తరహా చర్యలు సమాజంలో అసహనాన్ని పెంచుతాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.