'బోడే' దూకుడు.. రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం..!

రైతు సమస్యలను తన సమస్యలుగా భావించి ఉద్యమాలు నిర్వహించడంతోపాటు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నిరంతరం పోరాటానికి సిద్ధమవుతున్నారు.;

Update: 2025-09-17 22:30 GMT

ప్రజా నాయకుడిగా, పేదల పక్షపాతిగా, ముఖ్యంగా రైతుల పట్ల ఆప‌ద్భాంధ‌వుడిగా పేరు తెచ్చుకున్న బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి. 2017లో ప్రారంభమైన బీసీవై పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పుంజుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ప్రస్తుతం రాయలసీమ వరకు మాత్రం ఈ పార్టీ పేరు మెజారిటీ ప్రజలకు తెలిసనా.. రాష్ట్రవ్యాప్తంగా మాత్రం కొంత వెనకబడిందని చెప్పాలి. తాజాగా బీసీవై పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

పేదలు, బడుగులు, బలహీన వర్గాల పక్షాన బలమైన గళం వినిపించాలన్న ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ ఈ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లోను, 2024 ఎన్నికల్లోను ఆయన పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ పార్టీ తరఫున రాయలసీమ జిల్లాల్లోనూ కొంతమంది పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పార్టీని మాత్రం సుస్థిరంగా నిలబెడుతూ ప్రజల మధ్యకు తీసుకువెళ్లడంలో రామచంద్ర యాదవ్ కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైతులకు ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

రైతు సమస్యలను తన సమస్యలుగా భావించి ఉద్యమాలు నిర్వహించడంతోపాటు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నిరంతరం పోరాటానికి సిద్ధమవుతున్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బోడె రామచంద్ర యాదవ్ అనతి కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన పీజీ వరకు పూర్తి చేసి అనంతరం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పైకి ఎదిగారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా విజయవంతం కావడంతో పాటు సమాజం పట్ల ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చారు.

ఇదే ఆయనను పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేసేలా చేసింది. తొలినాళ్లలో బోడె రామచంద్ర యాదవ్ ను పట్టించుకోని వారు కూడా తర్వాత కాలంలో ఆయనలో ఉన్న స్ఫూర్తి, ఆయనలో ఉన్న పట్టుదల, కృషి వంటి వాటిని గుర్తించి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న పార్టీలకు సర్వాధికారాలు లేవని, ప్రజలకు సేవ చేయడమే సర్వాధికారమని భావించే బోడే రామచంద్ర యాదవ్ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ తనదైన శైలిలో ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు. పేదల పక్షాన నిలబడుతూ ప్రశ్నించే గొంతుకగా మారారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న ఏకైక సంకల్పంతో ఉన్న బోడె రామచంద్ర యాదవ్ అటు నియోజకవర్గంలోని రాజకీయాలతో పాటు ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజకీయాలను కూడా సమన్వయ పరుస్తూ మరోవైపు అన్ని వర్గాలకు చేరువవుతూ తన రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తు ప‌ల్లాలను కూడా చూశారు. కొంతమంది నాయకులు ఆయనకు దూరమైనప్పటికీ యువతను చేరువ చేసుకోవడంలోనూ ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థి సంఘాల నాయకులతో ఆయన ఎల్లవేళలా అండ‌గా ఉంటూ వారికి మద్దతు పలుకుతూ ముందుకు సాగుతున్నారు.

మొక్కవోని పట్టుదలతో అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న పోరాటం భవిష్యత్తులో మరింత బలంగా మారే అవకాశం కనిపిస్తోంది. 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమంలో బోడే రామచంద్ర యాదవ్ భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై తీర్మానాలను ప్రవేశపెట్టారు. యువత, రైతులు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు తనకు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News