హంతకులే వచ్చి.. నివాళులర్పిస్తున్నారు: కవిత షాకింగ్ కామెంట్స్
బీసీ జేఏసీ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ కోసం బంద్ పాటిస్తున్నారు.;
బీసీ జేఏసీ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ కోసం బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి నాయకురాలు.. మాజీ ఎంపీ కవిత కూడా మద్దతు తెలిపారు. కీలకమైన ఖైరతాబాద్ జంక్షన్‌లో నిర్వహించిన జాగృతి కార్యక్రమంలో ఆమె పాల్గొని బంద్‌కు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. బీసీలకు న్యాయం చేయాల్సిన కాంగ్రెస్, బీజేపీలు వచ్చి.. బంద్ మద్దతు తెలపడం ఏంటని ప్రశ్నించారు. ఇది దారణమని వ్యాఖ్యానించారు.
బీసీలకు అన్యాయం చేసింది గాక.. నాటకాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించిన కవిత.. ఒక వ్యక్తిని దారు ణంగా హత్య చేసి.. తర్వాత.. శవానికి నివాళులర్పించినట్టుగా ఉందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు తలు చుకుంటే.. క్షణంలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కానీ, బీసీలకు న్యాయం చేయాలన్న స్పృహ ఆ పార్టీల ప్రభుత్వాలకు లేదని ఎద్దేవా చేశారు. బీసీలకు న్యాయం చేయాలన్న చిత్త శుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. అదే ఉంటే.. సమర్ధవంతమైన వాదనలు వినిపించి ఉండేవారన్నారు.
ఈ వ్యవహారం కోర్టుకు చేరడానికికాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన రెండు విధానాలే కారణమని కవిత చెప్పారు. 1) హడావుడిగా రాత్రికి రాత్రిజీవో 9ని తీసుకువచ్చారని.. ఇది వీగిపోతుందని తెలిసి కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. 2) కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించడంలోనూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ రెండు సరైన విధంగా వ్యవహరించి ఉంటే బీసీలకు నేడు న్యాయం జరిగి ఉండేందని తెలిపారు. ఇక, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని.. ఒక్క మాట చెప్పి ఉంటే.. రాష్ట్రపతి ఆమోదం వచ్చేదని తెలిపారు.
బీసీ బిడ్డలకు న్యాయం జరిగే వరకు జాగృతి తరఫున పోరాటం కొనసాగించనున్నట్టు కవిత చెప్పారు. బంద్ కేవలం ఒక్కరోజుతో అయిపోతుందని, కానీ, తాము నిరంతరం దీనిపై పోరాటం కొనసాగిస్తామని కవిత వెల్లడించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు .. స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. అదేసమయంలో గ్రామాలకు ఇవ్వాల్సిన నిధులను నిలుపుదల చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ బంద్ కేవలం కన్నీళ్లు తుడిచేందుకేనని... అసలు ఉద్యమాలను నీరు గారుస్తున్నారని కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు.