బాపట్ల జిల్లా పాలిటిక్స్ హాటా.. స్వీటా.. ?
ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి చెందిన వేగేశ్న నరేంద్ర వర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రెండుసార్లు గెలిచిన వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.
రాష్ట్రంలోని కీలకమైన బాపట్ల జిల్లాలో మండలాలు, నియోజకవర్గాల వారీగా రాజకీయాలు కూటమి పార్టీలు, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం నడుస్తోంది.ముఖ్యంగా మండలాల వారీగా పరిస్థితిని గమనిస్తే.. టీడీపీకి ఎక్కువగా ఎడ్జ్ కనిపిస్తోంది. బాపట్ల నియోజకవర్గంమండలాల విషయానికి వస్తే.. బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం ఉన్నారు.
ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి చెందిన వేగేశ్న నరేంద్ర వర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రెండుసార్లు గెలిచిన వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. బాపట్ల రూరల్, పట్టణ ప్రాంతాల్లో మత్స్యకారులు, ఎస్సీ, బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇసుక భూముల వ్యవహారాలు, స్థానిక సాగునీటి సమస్యలపై ఇక్కడ రాజకీయాలు నడుస్తుంటాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కు మంచి ఫాలో యింగ్ ఉండడంతో స్థానికంలో తిరుగులేదని అంటున్నారు.
జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి ఉన్నాయి. ఇక్కడ సీనియర్ టీడీపీ నేత, మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుస విజయాలతో ఈ మండలాలపై టీడీపీ గట్టి పట్టు సాధించింది. నిజాంపట్నం వంటి తీరప్రాంత మండలాల్లో మత్స్యకారుల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. నగరం, చెరుకుపల్లి మండలాల్లో వ్యవసాయ అనుబంధ సమస్యలు, ఇటీవల వచ్చిన కొన్ని సీజనల్ వ్యాధుల నియంత్రణ వంటి అంశాలపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేస్తోంది. అయినా.. అనగాని రాజకీయాలకు తిరుగులేదని చెబుతున్నారు.
చీరాల నియోజకవర్గంలో చీరాల, వేటపాలెం మండలాలు ఉన్నాయి. చీరాలలో కమ్మ, యాదవ్, కాపు సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం కూటమి తరఫున ఇక్కడ గట్టి పట్టు ఉంది. చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే చీరాల, వేటపాలెం మండలాల్లో నూలు సబ్సిడీలు, జీవనోపాధి సమస్యలు ఎప్పుడూ ప్రధాన రాజకీయ అజెండాగా ఉంటాయి. ప్రస్తుతం చేనేతలకు ఉచిత విద్యుత్, పింఛన్లు వంటివి ప్రభావం చూపించే అవకాశం ఉంది.
వేమూరు నియోజకవర్గంలో వేమూరు, చుండూరు, భట్టిప్రోలు, కొల్లూరు, అమృతలూరు మండలాలు ఉన్నాయి. ఇక్కడి నుండి టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దళిత సామాజిక వర్గ ఓటర్లు ఇక్కడ అత్యధికంగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇస్తుంటుంది. లంక గ్రామాలు ఎక్కువగా ఉన్న కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో వరద ముంపు సమస్యలు, ఉపాధి హామీ పథకం అమలుపై రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీకి ఒకింత గ్రాఫ్ తగ్గిందన్న టాక్ వినిపిస్తోంది.
పర్చూరు నియోజకవర్గంలో పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, చినగంజాం, కారంచేడు, యద్దనపూడి.మండలాలు ఉన్నాయి. టీడీపీ బలమైన క్యాడర్‌ను కలిగి ఉంది. యడ్లపాటి శ్రీనివాసరావు వంటి సీనియర్ల కాలం నుంచి ఇది టీడీపీకి కంచుకోటలాంటిది. ప్రస్తుతం కూటమి ఇక్కడ పట్టు నిలుపుకుంది. మార్టూరులో గ్రానైట్ పరిశ్రమల సమస్యలు, కారంచేడు, ఇంకొల్లు మండలాల్లో సాగునీటి ఎద్దడి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.
అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి, జే.పంగులూరు, సంతమాగులూరు, బెల్లంకొండ, కొరిశపాడు మండలాలు ఉన్నాయి. టీడీపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రవి ఘన విజయం సాధించారు. ఈయన హవా జోరుగా సాగుతోంది. బాపట్ల జిల్లాలోని 25 మండలాలలో ప్రస్తుతం అధికార కూటమి పట్టు బలంగా ఉంది. అయితే, మాజీ మంత్రి మెరుగు నాగార్జున నేతృత్వంలో ప్రతిపక్ష వైసీపీ క్షేత్రస్థాయిలో తిరిగి పుంజుకునేందుకు మండలాల వారీగా సమీక్షలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తోంది.