హిందూ మహిళపై గ్యాంగ్ రే*ప్.. బంగ్లాదేశ్ లో మరో అరాచకం
ముగ్గురు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.;
బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న అరాచకపర్వాలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మైనార్టీలకు రక్షణ కల్పించే అవకాశాలు పెరుగుతాయన్న ఆశ వ్యక్తమైంది. అయితే.. అందుకు భిన్నంగా హిందువులపై దాడులు.. అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. ఒక హిందూ మహిళను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గం వెలుగు చూసింది.బరిషాల్ జిల్లాలోని చందాపుర్ తాలూకాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది.
దివ్యాంగురాలైన బాధితురాలు రాత్రి తొమ్మిది గంటల వేళ.. భజన ముగించుకొని ఇంటికి తిరిగి వస్తోంది. ముగ్గురు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రోడ్డు పక్కన స్ప్రహ కోల్పోయి పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిన విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆమెకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమెకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది.
తనను రకీబ్.. సోహైల్.. రస్సెల్ అనే ముగ్గురు కిడ్నాప్ చేసి.. దారుణానికి ఒడిగట్టినట్లుగా బాధితురాలు పేర్కొన్నారు. ఆమెను చిత్రహింసలకు గురి చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె భోలా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదంతా ఒక దారుణమైతే.. ఇంత జరిగిన తర్వాత పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిందితులను అరెస్టు చేయాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు.. మానవ హక్కుల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఆందోళనలు చేస్తున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయటం.. వారి ఆస్తులను ధ్వంసం చేయటం.. హత్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజా ఉదంతంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.