బంగ్లాదేశ్ లో ప్రతి పౌరుడి మీద రూ.41వేల అప్పు
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రధాన సలహాదారుగా అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనుస్ దేశ ప్రజలకు కొత్త కలలు చూపించారు.;
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రధాన సలహాదారుగా అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనుస్ దేశ ప్రజలకు కొత్త కలలు చూపించారు. అయితే, ఆయన పాలన ఏడాది కూడా పూర్తికాకుండానే బంగ్లాదేశ్ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. శాంతిభద్రతల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు అన్నీ అస్తవ్యస్తంగా మారాయి. తాజాగా వెలువడిన ఒక నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్‌లో ప్రతి పౌరుడిపై సుమారు రూ.41 వేల రుణ భారం పడినట్లు వెల్లడైంది. ఈ వార్త దేశ ప్రజలలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.
బంగ్లాదేశ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రతి బంగ్లాదేశీ పౌరుడిపై 483 డాలర్ల (సుమారు రూ.41,000) బహిరంగ విదేశీ రుణం ఉంది. దేశం మొత్తం బకాయి విదేశీ రుణం 103.64 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత దేశ ప్రజల్లో తీవ్ర కలకలం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.
అప్పుల పెరుగుదలకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ భారీ రుణంలో ప్రభుత్వ వాటా ఒక్కటే 84.21 బిలియన్ డాలర్లుగా ఉంది. సుమారు 174 మిలియన్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో, ఈ రుణం ప్రతి వ్యక్తిపై పెద్ద భారాన్ని మోపుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 257 డాలర్లు ఉండగా, దాదాపు ఒక దశాబ్దంలోనే ఈ భారం రెట్టింపు అయింది. నిరంతరంగా ఈ రుణం పెరుగుతూనే ఉంది.టకా బలహీనత, ఆర్థిక అస్థిరత కూడా ఓ కారణమే.
బంగ్లాదేశ్ స్టాటిస్టిక్స్ బ్యూరో ప్రాథమిక అంచనాల ప్రకారం..2023-24 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2,738 డాలర్లకు పెరిగింది. అయితే, ఆదాయం పెరిగినప్పటికీ అప్పులు కూడా పెరిగాయి. అలాగు బంగ్లాదేశ్ టకా (Bangladesh Taka) విలువ నిరంతరం బలహీనపడుతోంది. దీనివల్ల విదేశీ రుణాల భారం మరింత పెరుగుతోంది.అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరగడం కూడా రుణ భారాన్ని పెంచుతోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులలో నెలకొన్న అనిశ్చితి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులు దేశంలో ద్రవ్య లోటును పెంచి, భవిష్యత్ అభివృద్ధి ఖర్చులను తగ్గించవచ్చు. స్థూల ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడిని పెంచవచ్చు.
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఆగస్టు 2024 నుంచి యూనుస్ దేశ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి గ్రహణం పట్టినట్లు అయ్యింది. ఆయన ప్రభుత్వం ఈ వైఫల్యం తర్వాత బంగ్లాదేశ్‌లో యూనుస్‌కు వ్యతిరేకంగా నిరసనల అలలు మొదలయ్యాయి. ఒకప్పుడు నోబెల్ బహుమతి గ్రహీతగా, సూక్ష్మ రుణ పితామహుడిగా గుర్తింపు పొందిన యూనుస్ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.