సంచలన తీర్పు.. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష
దేశంలో ఆందోళనలతో ప్రధానమంత్రి పదవిని వదిలేసి, దాదాపు 15 నెలలుగా ఢిల్లీలో ప్రవాసంలో ఉంటూ వస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.;
దేశంలో ఆందోళనలతో ప్రధానమంత్రి పదవిని వదిలేసి, దాదాపు 15 నెలలుగా ఢిల్లీలో ప్రవాసంలో ఉంటూ వస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తమ దేశంలో జరిగిన హింసాకాండకు ఆమెను బాధ్యురాలిని చేసింది. ఏకంగా 1,400 మంది మరణానికి కారణమయ్యారని నిర్ధారించింది. మానవత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగాలను పరిగణనలోకి తీసుకుని గరిష్ఠ శిక్ష విధించింది. హసీనాకు మరణ శిక్ష విధించింది. ఆమె కుమారుడు ఆందోళన చెందినట్లే శిక్ష పడింది. గత ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ లో వరుసగా మూడోసారి హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, జూన్, జూలై నెలల నాటికి పరిస్థితి మారిపోయింది. హసీనాపై తిరుగుబాటు మొదలైంది. ఆగస్టు 5న ఆమె దేశాన్ని వీడి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రావాల్సి వచ్చింది. మొదట హసీనా ఎక్కడ ఉన్నారన్నది తెలియకున్నా.. ఢిల్లీలో ఉన్నట్లు ఇటీవల బయటపడింది.
ఆ ఒక్క నిర్ణయంతో..
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నవారి వారసులకు ప్రత్యేక రిజర్వేషన్లు పొడిగింపు నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో నిరసనలకు కారణమైంది. హింసాత్మకంగా మారింది. ప్రజల ఆందోళనలకు హసీనా ప్రభుత్వం అవినీతి కూడా దీనికి తోడైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆందోళనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నిరసనకారులను చంపేయమని హసీనా ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆమెకు తాజాగా శిక్ష ఖరారు చేసిన బంగ్లాదేశ్ రాజధాని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. నిరుడు జూలై-ఆగస్టులో చెలరేగిన అల్లర్లలో 1,400 మంది చనిపోయారని పేర్కొన్నారు.
మానవత్వానికి వ్యతిరేకంగా...
హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా (ఎగైనెస్ట్ హ్యుమానిటీ) నేరాలకు పాల్పడ్డారని బంగ్లా కోర్టు తెలిపింది. ఇప్పటికే హసీనాపై వందకు మించి కేసులు నమోదయ్యాయి. హసీనాతో పాటు బంగ్లా మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కూ మరణశిక్ష పడింది. హసీనా దేశాన్ని వీడి వెళ్లిన గతేడాది ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులకు దిగిందని, హెలికాప్టర్లు, మారణాయుధాలు వాడి వారిని హతమార్చాలని ఆమె ఆదేశించారని తెలిపారు. క్షతగాత్రులకు వైద్యం కూడా అందకుండా చేశారని వివరించారు. ఇదంతా అధికారం కాపాడుకునేందుకు చేసిన బలప్రయోగంగా అభివర్ణించారు.
ఆందోళనలకు దిగితే కాల్చివేత..
హసీనాపై తీర్పు వెల్లడి ఉన్నందున.. బంగ్లా రాజధాని ఢాకాలో సోమవారం అత్యంత అప్రమత్తత (హై అలర్ట్) ప్రకటించారు. వాహన దహనాలు, బాంబు దాడులకు దిగితే కాల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలుసార్లు భారత దేశాన్ని కోరింది. కానీ, మన దేశం వాటిని పెడచెవిన పెట్టింది. భారత ద్వేషి అయిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి, నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ తన వ్యతిరేకతను ఇప్పటికే పలు వేదికల్లో వెళ్లగక్కారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగే వీలున్నట్లు ఇప్పటికే కథనాలు వచ్చాయి. మరి హసీనాపై తీర్పును భారత ప్రభుత్వం ఎంతవరకు తీసుకుంటుందో చూడాలి?