బనకచర్ల.. ఏపీ కాళేశ్వరం? విజయవాడలో మేథావుల ఆగ్రహం
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ విజయవాడ వేదికగా మేధావులు పిలుపునిచ్చారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చే బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.;
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ విజయవాడ వేదికగా మేధావులు పిలుపునిచ్చారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చే బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టును తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతోపాటు దీనిపై ప్రజా ఉద్యమం చేపడతామని, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని బడా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ప్రయోజనాల కోసమే బనకచర్ల ప్రాజెక్టు అంటూ వారు ఆరోపించారు. ఆలోచనాపరుల వేదిక పేరుతో ఏర్పాటయిన ఈ సంస్థలో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఏబీవీ సీఎంకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించడం కూడా ఆసక్తిరేపుతోంది.
బనకచర్ల ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల కడుపునింపేందుకు తప్ప, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని గుదిబండ ప్రాజెక్టుగా విజయవాడలో సమావేశమైన మేథావులు ఆరోపించారు. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్, అగ్రికల్చర్ నిపుణులు కంభంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి.లక్ష్మీనారాయణతో ఏర్పాటైన ఆలోచనపరుల వేదిక బుధవారం సమావేశం నిర్వహించింది. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. మెగా ఇంజనీరింగ్ సంస్థ తన స్వప్రయోజనాల కోసం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తోందని వారు ఆరోపించారు. పాత-కొత్త ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న మెగా కృష్ణారెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబుతో సమావేశమై, బనకచర్లపై ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. ప్రధాన ప్రతిపక్షం కూడా కాంట్రాక్టు కంపెనీతో కుమ్మక్కయినందున, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలేదనని వారు పిలుపునిచ్చారు.
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆలోచన కాదని ఏబీవీ ఆరోపించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీ మాజీ సీఎం జగన్, మెగా కృష్ణారెడ్డి కలిసి ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని సంచలన ఆరోపణ చేశారు ఏబీవీ. బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ అవసరాలకు, ప్రయోజనాలకు, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా పరిరక్షణకు అనుగుణంగా ఉన్నదా? లేదా? అని ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని, కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్దికి మాత్రమే ఉపయోగపడుతుందని ఆరోపించారు.
ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నది నుంచి 200 టీఎంసీల నీటి హక్కును కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు కూడా కృష్ణా జలాల్లో ఉన్న హక్కులు కోల్పోతామని వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పుడున్న పట్టిసీమ కాల్వను పెద్దది చేసి అందులో 38,000 క్యూసెక్కుల నీరు పంపినా, లేక ఇంకో సమాంతర కాల్వను నిర్మించి 23,000 క్యూసెక్కులు పంపినా, ప్రకాశం బ్యారేజ్ నిండిపోతుందని, విజయవాడకు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. పోలవరం-బనకచర్ల పథకం వల్ల రాయలసీమలో కొత్తగా సాగయ్యే ఆయకట్టు ఏదీ లేదని చెప్పారు. ఇప్పుడు చెప్పే చిత్తు లెక్కల ప్రకారమే, నిర్వహణ వ్యయమే సంవత్సరానికి ఎకరాకు 50,000 రూపాయలు అవుతుందని, ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం, దానిమీద వడ్డీలు కలిపితే లక్షకోట్లు దాటిపోతుందని విశ్లేషించారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగినా ప్రధానంగా బనకచర్లపై లేవనెత్తిన అభ్యంతరాలే చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణలో వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా ఏపీలోనూ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు మారుతుందని మేథావులు విమర్శిస్తున్నారు.