హిందూపురంలో బాలయ్య శాశ్వత నివాసం.. 12 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం!!

సొంత నియోజకవర్గం హిందూపురంలో సొంత ఇల్లు కట్టుకోవాలని నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించుకున్నారు.;

Update: 2026-02-20 08:22 GMT

సొంత నియోజకవర్గం హిందూపురంలో సొంత ఇల్లు కట్టుకోవాలని నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. మూడు సార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండాలని బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో తొలిసారిగా ఇక్కడ నుంచి గెలిచిన బాలయ్య ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అద్దె ఇంట్లోనే బస చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీనిపై గత పదేళ్లు పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినా, బాలయ్య మూడోసారి గెలిచిన తర్వాత విపక్ష వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. బాలయ్య స్థానికేతరుడు అంటూ విమర్శించడమే కాకుండా, ఆయన హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించడాన్ని తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య తాను లోకల్ అంటూ సొంత ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారని అంటున్నారు.

హిందూపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోట. ఇంకా చెప్పాలంటే నందమూరి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న నియోజకవర్గం. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1985లో ఎన్టీఆర్ హిందూపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన మరణించే వరకు హిందూపురం శాసనసభ్యులుగానే కొనసాగారు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తర్వాత మూడు సార్లు ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయలేదు. కానీ, వరుసగా టీడీపీయే గెలుస్తూ వస్తోంది.

ఇక 2014లో రాజకీయాల్లోకి వచ్చిన బాలకృష్ణ తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత వరుసగా 2019, 2024 ఎన్నికల్లోనూ గెలిచారు. దాదాపు 4 దశాబ్దాలుగా హిందూపురంతో ఎన్టీఆర్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉన్నప్పటికీ సొంత ఇల్లు మాత్రం నిర్మించుకోలేకపోయారు. గత 12 ఏళ్లుగా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సైతం ఇప్పటివరకు ఆ ఆలోచన చేయలేదు. ఈ 12 ఏళ్లు తరచూ హిందూపురం వచ్చివెళుతున్న బాలకృష్ణ అద్దె ఇంట్లోనే గడిపారు. బాలయ్యతోపాటు ఆయన భార్య వసుందర సైతం హిందూపురం నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత ఇంటి కల తీర్చుకోవాలని బాలయ్య నిర్ణయించారని చెబుతున్నారు.

హిందూపురంలో సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పట్టణంలో 81 స్థలాన్ని కొనుగోలు చేశారు బాలయ్య. వనంకాలనీ సర్వే నెంబరు 445లో ఈ స్థలం ఉంది. ఇందులో మూడు అంతస్థుల భవనంతోపాటు స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన పార్క్ ఉండేలా ఇంటిని నిర్మించుకోవాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. శుక్రవారమే ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. సతీమణి వసుంధరతో కలిసి సంప్రదాయ బద్ధంగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు అంతా హాజరయ్యారు. ఎట్టకేలకు సొంత ఇల్లు కట్టుకుంటున్న బాలయ్య ఇక హిందూపురమే తన పర్మినెంట్ అడ్రస్ గా చెబుతున్నారు.

Tags:    

Similar News