టీడీపీతో నందమూరి బంధం ఎందాక ?
తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు. ఆయన కేవలం తొమ్మిది నెలలలో పార్టీని అధికారంలోకి తెచ్చారు.;
తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు. ఆయన కేవలం తొమ్మిది నెలలలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ దాకా తీసుకుని వెళ్ళి గ్రామ గ్రామాన జెండాను అజెండాను పరిచయం చేసింది కూడా ఆయనే. తెలుగుదేశం ఈ రోజున ఈ విధంగా పటిష్టంగా ఉంది అంటే దిట్టమైన పునాది వేసిన వారు ఎన్టీఆర్ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున టీడీపీ అన్న ఒక బ్రహ్మాండమైన భవనం ఉంది అంటే దాని పునాదులు చాలా బలంగా ఉన్నాయని అర్థం. ఈ భవనం మీద మరిన్ని ఫ్లోర్లు నిర్మించవచ్చు, కొత్త నగిషీలు చేయవచ్చు. కానీ ఏ భవనానికి అయినా ఉండాల్సిన పునాది బలం టీడీపీకి ఇచ్చింది అచ్చంగా ఎన్టీఆర్ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన తరువార :
ఎన్టీఆర్ 1994లో అద్భుతమైన మెజారిటీతో ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఆయన కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఆ విధంగా పాలించ గలిగారు. 1995 ఆగస్ట్ సంక్షోభంలో ఆయనను గద్దె నుంచి దించేశారు. ఆ తరువాత టీడీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. హరికృష్ణ టీడీపీలో కీలకం అవుతారు అని కొత్తల్లో అనుకున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకుండానే రవాణా మంత్రిగా చేశారు. కానీ ఆరు నెలలలోగా ఎమ్మెల్యే కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది తీరా ఎమ్మెల్యేగా నెగ్గాక మళ్ళీ ఆ మంత్రి పదవి దక్కలేదు. ఆ విధగా హరిక్రిష్ణ టీడీపీకి దూరం అయ్యారు. 2009 ఎన్నికల వేళ తిరిగి కలిసి రాజ్యసభ మెంబర్ గా అయినా కూడా ఆయన విభజన ఉద్యమంలో రాజీనామ చేశారు. ఇక ఆయన 2018లో మరణించే సమయానికి పార్టీలో కీలకంగా లేరనే చెప్పాలి.
బాలయ్య హవా మొదలు :
ఇక విభజన ఏపీలో 2014లో హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారిగా బాలయ్య గెలిచారు. అప్పట్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తప్పనిసరిగా ఆయన మంత్రి అవుతారు అనుకుంటే చాన్స్ దక్కలేదు. అయితే 2017లో మాత్రం నారా లోకేష్ ఎమ్మెల్సీగా నెగ్గి మంత్రి అయిపోయారు. దీంతో బాలయ్యకు మంత్రి యోగం లేనట్లే అనుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బాలయ్య జగన్ ప్రభంజనం తట్టుకుని మరీ గెలిచారు. ఇక 2024లో మూడవసారి గెలిచారు. మళ్ళీ మంత్రి పదవి ఆయనకు దక్కుతుందని అనుకున్నా అది జరగలేదు. మొత్తానికి బాలయ్య మనసులో ఏముందో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే అదే ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలుగా అయిన ఎంతో మంది మంత్రి పదవిని అందుకున్నారని చెబుతారు.
పునాది నుంచి వారు :
ఇక టీడీపీ పునాదుల నుంచి హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరూ ఎంతో కష్టపడి పనిచేసారు. హరికృష్ణ ఎన్టీఆర్ చైతన్య రధం సారధిగా తీవ్రంగా శ్రమించి ఉమ్మడి ఏపీ అంతటా తిరిగితే బాలయ్య ఎన్నికల ప్రచారం కోసం ప్రతీ సారీ డేట్స్ కేటాయించి మరీ జనంలోకి వచ్చేవారు. అలా 1987లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ సమక్షంలోనే బాలయ్య ఇచ్చిన స్పీచ్ కి ముగ్దుడైన పెద్దాయన బాలయ్యే తన రాజకీయ వారసుడి అని ప్రకటించారు కూడా. మరో వైపు టీడీపీలో బాలయ్య చురుకుగా ఉండడం తో ఆయన సినిమాల మీద కూడా దాని ప్రభావం పడింది. ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు టీడీపీ మీద వ్యతిరేకతతో ఆయన సినిమాలను చూసేవారు కాదు ఆ విధంగా నాడు పోటా పోటీగా ఉన్న అగ్ర హీరోల రేసులో బాలయ్య వెనుకబడటానికి కారణం పొలిటికల్ గా ఓపెన్ అయి టీడీపీ వెన్ను దన్నుగా నిలవడం ఒక ప్రధాన కారణం అని చెప్పాల్సి ఉంటుంది.
చిచ్చు పెడుతున్నారా :
ఇక బాలయ్య మంత్రి కాలేదు, ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. తాజా అసెంబ్లీలో ఆయన చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తప్పు. దానిని ఎవరూ సమర్ధించరు. కానీ అదే సమయంలో వాటికి దారి తీసిన పరిణామాల మీద కూడా చర్చించాలి కదా అని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ఒక ప్రముఖ చానల్ బాలయ్య మీద యాంటీగా విశ్లేషణాత్మక కధనం ప్రసారం చేయడం పట్ల ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. సోషల్ మీడియాలో సదర్ చానల్ అధినేత మీద విమర్శలు చేస్తున్నారు. బాలయ్య సినిమాల్లో ఉంటూ రాజకీయంగా పెద్దగా ఫోకస్ పెట్టలేదని ఆయనే కోరుకుంటే మంత్రి అయ్యేవారు కదా అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నందమూరి కుటుంబంలో ఆయన ఒక్కడే కదా పార్టీలో ఉన్నది అని ఎత్తి చూపిస్తున్నారు. ఈ రకమైన కధనాల ద్వారా చిచ్చు రేపి నందమూరి బంధాన్ని లేకుండా చేసే ప్రయత్నమా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే బాలయ్యతోనే నందమూరి ఫ్యామిలీ పాలిటిక్స్ టీడీపీలో సాగుతోంది. అసెంబ్లీ ఎపిసోడ్ చల్లారినా మళ్ళీ తట్టి లేపి టీడీపీ అనుకూల మీడియా బాలయ్య కు వ్యతిరేకంగా విశ్లేషణలు చేయడంతో ఇవి ఏ వైపు దారితీస్తాయన్న చర్చ అయితే సాగుతోంది.