నా వయసు అయిపోతోంది.. దేవుడిని ఒకటే కోరుకుంటున్నా: అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Update: 2026-06-01 08:07 GMT

కుటుంబ సభ్యుల రాజకీయ ప్రవేశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వయసు అయిపోతోందని చెప్పిన ఆయన తన తర్వాత కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం తిరుమల వెంకన్నను కుటుంబ సమేతంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసుడిని ఏం మొక్కుకున్నారనేది వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవ్వనున్నట్లు అయ్యన్నపాత్రుడు పరోక్షంగా సంకేతాలిచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు మనోగతాన్ని బయట పెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘25 సంవత్సరాల వయసు నుంచి తెలుగుదేశం పార్టీలో రామారావు గారి ఆశీస్సులతో పనిచేశాను. నాకు వయసు అవుతోంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించాలని ఆ స్వామి వారిని కోరుకోవడం జరిగింది.’’ అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మీడియాతో వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో 45 ఏళ్లుగా కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు వివిధ హోదాల్లో పనిచేశారు. ఏడు పదుల వయసు దాటడంతో రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని స్పీకర్ భావిస్తున్నారని అంటున్నారు. తన స్థానంలో కుమారుడు విజయ్ ని క్రియాశీల రాజకీయాల్లో కొనసాగించాలని అయ్యన్నపాత్రుడు చాలా కాలంగా కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి విజయ్ కి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ప్రస్తుతం ఐటీడీపీ అధ్యక్షుడిగా విజయ్ పార్టీకి సేవ చేస్తున్నారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కోరడం చూస్తే, ఆయన మనసులో ఇంకేదో ఉందని అనుమానిస్తున్నారు.

ఇక అయ్యన్నపాత్రుడు తాజా వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నెలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారా? అనే అంశంపైనే హాట్ డిబేట్ జరుగుతోంది. ఈ నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో టీడీపీ మూడు స్థానాలను తీసుకుంటుందని అంటున్నారు. ఈ మూడింట్లో ఒకటి తన కుమారుడు విజయ్ కి ఇప్పించాలనే ఆలోచనతోనే అయ్యన్నపాత్రుడు ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. బీసీ, యువత, ఉత్తరాంధ్ర కోటాలో విజయ్ పేరును పరిశీలించాలని ఆయన కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని బహిరంగంగా బయటపెట్టి పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చే ఆలోచనతోనే అయ్యన్నపాత్రుడు ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తన రిటైర్మెంట్ ప్రకటిస్తే గాకీ, కొడుకుకి అవకాశం ఇప్పించుకోలేనేమో అన్న భావనతోనే స్పీకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.



Tags:    

Similar News