జగన్ రాకపోతే నాకు సంబంధమేంటి ?

జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ మాట్లాడుతున్నారని అయ్యన్న విమర్శించారు. దేశంలో ఎక్కడా 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన గుర్తు చేశారు.;

Update: 2025-11-10 18:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా జగన్ గురించి వేసిన ప్రశ్నలకు అయ్యన్న తనదైన శైలిలో స్పందించారు. జగన్ విషయం మీద పూర్తి క్లారిటీతో మాట్లాడారు అసెంబ్లీ నిబంధనల ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఒక స్పీకర్ ఎలా వ్యవహరించాలో అలా తాను నడచుకుంటున్నట్లుగా అయ్యన్నపాత్రుడు చెప్పారు.

జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే :

జగన్ అసెంబ్లీకి రాకపోతే తనకు సంబంధం ఏమిటి అని స్పీకర్ అయ్యన్న మీడియాను ప్రశ్నించారు. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అని అన్నారు. ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పారు. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటూ చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని ఆయన అంటున్నారు. అయితే జగన్ రాకపోతే దానికి ఆయనే జవాబు చెప్పాల్సి ఉందని అన్నారు. ఇక స్పీకర్ గా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం తన బాధ్యతని తాను ఆ బాధ్యత ప్రకారమే జగన్మోహన్ రెడ్డికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. అయితే ఆయన సభకు వస్తేనే ఇదంతా జరిగేది అని చెప్పారు.

ఎక్కడా లేని విడ్డూరం :

జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ మాట్లాడుతున్నారని అయ్యన్న విమర్శించారు. దేశంలో ఎక్కడా 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన గుర్తు చేశారు. 11 సీట్లకే పరిమితమైన ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అయ్యన్న అన్నారు. అసలు ప్రతిపక్ష హోదా పొందే సీట్లు జగన్ కి లేవని స్పీకర్ గా అందుకే తాను ప్రతిపక్ష హోదా ఇవ్వలేనని అయ్యన్న స్పష్టంగా చెప్పారు. ఇలా తాను ఎంత చెప్పినా, కావాలని తాను ఆయనకు విపక్ష హోదా ఇవ్వడం లేదంటూ తనపై జగన్ నిందలు వేయడం తప్పు అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటున్నానని ఆయన అన్నారు.

శీతాకాలం అసెంబ్లీ సెషన్ :

ఈ మధ్యనే వర్షాకాల అసెంబ్లీ సెషన్ ముగిసింది. డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో జగన్ అసెంబ్లీకి రారా వస్తారా అన్న దాని మీద చర్చ మొదలైంది. ఇక స్పీకర్ అయ్యన్న కనిపిస్తే చాలు మీడియా ఇదే విషయం ఫోకస్ చేస్తూ వస్తోంది. ఆయన ఎందుకు రారు అని అడుగుతోంది. ప్రతిపక్ష హోదా విషయం కూడా ప్రస్తావిస్తోంది. అయితే ఇప్పటికే చాలా సార్లు దీని మీద క్లారిటీ ఇచ్చిన అయ్యన్న మరోసారి స్పీకర్ గా తన బాధ్యతలు గుర్తు చేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు మైక్ ఇస్తామని చెబుతున్నారు. అదే సమయంలో ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే అని అంటున్నారు. మరి జగన్ కి అందరిలాగానే నిముషాల వ్యవధి మాత్రమే ఇస్తారా లేక జగన్ కోరుతున్నట్లుగా ముఖ్యమంత్రితో సమానంగా మైక్ ఇస్తారా అన్నదే వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా జగన్ అసెంబ్లీకి వస్తారా లేక అలాగే కంటిన్యూ చేస్తారా అంటే బంతి జగన్ కోర్టులోనే ఉందని రాజ్యాంగం ప్రకారమే తాము నడచుకుంటున్నామని స్పీకర్ స్పష్టం ఇచ్చేశారు. దాంతో వైసీపీయే ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News