క్రెడిట్ కార్డ్ ఎడాపెడా వాడేస్తున్నారా? ఐటీ నోటీసు రెడీ..
రెంట్ పేమెంట్స్ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డ్ డబ్బును బ్యాంకులోకి మళ్లించి.. తిరిగి అదే డబ్బుతో బిల్లులు కట్టడం కూడా ఐటీ కిందకు వస్తుంది.;
నేటి డిజిటల్ యుగంలో జేబులో నగదు కంటే క్రెడిట్ కార్డ్ ఉండటమే అందరికీ సౌకర్యంగా అనిపిస్తుంది. షాపింగ్, ట్రావెల్, ఆన్‌లైన్ పేమెంట్స్ మాత్రమే కాదు.. ఫ్రెండ్స్‌కు ఏదైనా వస్తువు కొనిపెట్టాలన్నా చేతిలో క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు. కానీ ఈ సౌకర్యమే ఇప్పుడు మీ కొంప ముంచే ప్రమాదం ఉంది. మీ వార్షిక ఆదాయానికి మీరు చేసే క్రెడిట్ కార్డ్ ఖర్చులకు పొంతన లేకపోతే.. ఐటీ శాఖ నుంచి నోటీసులు రావడం ఖాయం.
నిఘా నీడలో 'స్నేహపూర్వక' స్వైపింగ్!
చాలామంది తమ కార్డులపై రివార్డ్ పాయింట్లు వస్తాయనో లేదా స్నేహితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనో ఇతరుల కోసం షాపింగ్ చేస్తుంటారు. ఉదాహరణకు ఒక స్నేహితుడికి లక్ష రూపాయల విలువైన ఫోన్ మీ కార్డుతో కొనిపెట్టి ఆ డబ్బును తిరిగి నగదు రూపంలో తీసుకుంటే.. రికార్డుల్లో ఆ లక్ష రూపాయల ఖర్చు మీ ఖాతాలోనే కనిపిస్తుంది. మీ వార్షిక ఆదాయం తక్కువగా ఉండి, ఇలాంటి లావాదేవీలు ఎక్కువగా ఉంటే ఐటీ శాఖ దృష్టిలో మీరు 'రెడ్ ఫ్లాగ్' కిందకు వస్తారు.
ఐటీ నోటీసులకు కారణమయ్యే ప్రధాన అలవాట్లు
రెంట్ పేమెంట్స్ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డ్ డబ్బును బ్యాంకులోకి మళ్లించి.. తిరిగి అదే డబ్బుతో బిల్లులు కట్టడం కూడా ఐటీ కిందకు వస్తుంది. తరచూ భారీ మొత్తంలో డిజిటల్ వాలెట్లలోకి డబ్బును లోడ్ చేయడం కూడా రిస్క్ అవుతుంది. రివార్డ్ పాయింట్ల కోసం వస్తువులు కొని పాయింట్లు వచ్చాక ఆర్డర్ క్యాన్సిల్ చేయడం..ఒక ఏడాదిలో లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని క్రెడిట్ కార్డ్ బిల్లు రూపంలో 'నగదు'గా చెల్లించడం లాంటివి ఐటీ కిందపరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం కల్పిస్తుంది.
'ఏఐఎస్' ద్వారా అంతా పారదర్శకం..
గతంలో లావాదేవీలు దాచడం సాధ్యమయ్యేదేమో కానీ.. ఇప్పుడు యాన్యువల్ ఇన్ఫోర్మేషన్ స్టేట్ మెంట్ (ఏఐఎస్) ద్వారా మీ ప్రతి రూపాయి ఖర్చు ఐటీ శాఖకు తెలిసిపోతుంది. ఏడాదికి ₹10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు జరిగితే బ్యాంకులు ఆ సమాచారాన్ని తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఖర్చులు మీ ఆదాయ పరిమితిని దాటినప్పుడు, ఆ అదనపు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
నోటీసు వస్తే ఏం చేయాలి?
ఒకవేళ ఐటీ నోటీసు వస్తే కంగారు పడకుండా సంబంధిత లావాదేవీలకు ఆధారాలు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పెద్ద లావాదేవీకి సంబంధించిన బిల్లులను భద్రపరుచుకోవాలి. స్నేహితుల కోసం ఖర్చు చేసినప్పుడు వారు మీకు తిరిగి పంపిన ఆన్‌లైన్ పేమెంట్ స్క్రీన్ షాట్స్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్లను సాక్ష్యంగా ఉంచుకోవాలి. నోటీసులోని అంశాలను అర్థం చేసుకునేందుకు ట్యాక్స్ నిపుణుడిని సంప్రదించి గడువులోగా సమాధానం ఇవ్వాలి.
క్రెడిట్ కార్డ్ అనేది ఒక కత్తి లాంటిది.. జాగ్రత్తగా వాడితే సౌకర్యం, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు చేస్తూ ప్రతి పైసాకు లెక్క ఉంచుకుంటే ఐటీ నోటీసుల భయం ఉండదు. డిజిటల్ లావాదేవీల్లో పారదర్శకతే మీ ఆర్థిక భద్రతకు శ్రీరామరక్ష..