మాజీ సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్.. వైఎస్ మరణంపై సంచలన ఆరోపణలు

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.;

Update: 2026-04-09 12:15 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెబుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘సైకోకు పదవీ వ్యామోహం వస్తే, పదవికోసం ఏమైనా చేస్తాడు. తండ్రి, చినతండ్రి, చెల్లి, తల్లి ఎవరినీ వదలడు.’’ అంటూ మంత్రి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ తొలిసారి సీఎంగా ఎన్నికైన నుంచి ఆయన మరణం వరకు జగన్మోహనరెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.

వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ గా మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డితో వేగలేక ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి తీవ్ర మానసిక క్షోభ అనువించేవారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సమస్యలకు కారణం అవుతున్నాడనే కారణంతో రాజశేఖరరెడ్డి తన కుమారుడుని బెంగళూరు పంపించారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, అప్పట్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రోశయ్య బహిరంగంగా చెప్పిన మాటలనే మరోసారి తాను గుర్తు చేస్తున్నానని చెప్పారు.

‘‘2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ ఎలా ఉండేవారు? ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 2004 తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాడని ఆరోపించారు. ఈ విషయాన్ని గూగుల్ లో అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. ‘‘తండ్రిని మానసిక క్షోభకు గురిచేశాడు. నిరంతరం ఏదో ఒక విధంగా గొడవ పడేవారు. ఆయన రాష్ట్రంలో ఉంటే ఎన్నో సమస్యలకు కారణం అవుతున్నాడు, తనకు క్షోభతోపాటు రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆ నాడే జగన్ రెడ్డిని వైఎస్ బెంగళూరు పంపారు.’’ అంటూ అచ్చెన్నాయుడు గతాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో వైఎస్ మరణంపైనా అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.

జగన్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనపై పరోక్ష విమర్శలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచనతోనే పనిచేశాడని తెలిపారు. ‘‘రాజశేఖరరెడ్డి ఉంటే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని మంత్రి అన్నారు. 2009లో రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ అదృశ్యం అయిందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారని, ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు టెన్షన్ పడితే జగన్ రెడ్డి మాత్రం సీఎం పదవి కోసం సంతకాలు సేకరించినట్లు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అప్పటికి రాజశేఖరరెడ్డి ఏమయ్యారో తెలియదు. ఆయన మరణంపై ఎవరూ నిర్ధారించలేదు. కానీ జగన్ రెడ్డి మాత్రం తనకు సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ‘‘రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు.. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏం వచ్చింది. రాజశేఖరరెడ్డి చనిపోయిన రోజే వందల కోట్ల రూపాయలకు పోలవరం టెండర్లు వేశారు. దీనికి సమాధానం చెప్పాలి.’’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇక రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదానికి రిలయన్స్ కారణమని చెప్పి వారి సంస్థలపై దాడులు చేయించారని, ఆ తర్వాత వారిని మంచి చేసుకుని రాజ్యసభ సీటు ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సీనియర్ నేత బొత్స సత్తిబాబు బహిరంగంగా వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని మాట్లాడారని, కానీ తాము ఆ రోజు బొత్స ఆరోపణలను సీరియస్ గా తీసుకోలేదని, సభ్య సమాజంలో ఇలాంటివి చేయరని అనుకున్నామని అన్నారు. అయితే ఇప్పుడు తమకు కొన్ని అనుమానాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘సైకోకు పదవీ వ్యామోహం వస్తే, పదవికోసం ఏమైనా చేస్తాడు. తండ్రి, చినతండ్రి, చెల్లి, తల్లి ఎవరినీ వదలడు.’’ అంటూ అచ్చెన్నాయుడు తీవ్రవ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News