నయా అసురుల ముందు నరకాసురుడు చిన్నబోతున్నాడు !

అసురుడు అంటే రాక్షసుడు. అసలు రాక్షసుడు అంటే ఎవరు. ఈ ప్రశ్నకు జవాబు సులభమే అయితే అదే సమయంలో కష్టమే.;

Update: 2025-10-19 12:24 GMT

అసురుడు అంటే రాక్షసుడు. అసలు రాక్షసుడు అంటే ఎవరు. ఈ ప్రశ్నకు జవాబు సులభమే అయితే అదే సమయంలో కష్టమే. రాక్షస ప్రవృత్తి ఉన్న వారు అని అనొచ్చేమో. ఆ ప్రవృత్తి ఎవరికి ఉంది ఎవరికీ లేదు అన్నది మరో చర్చ. నిజానికి వెలుగు నీడలు పగలు రాత్రులు అన్నట్లుగా ప్రతీ మనిషిలోనూ దైవిక గుణాలతో పాటు అసుర గుణాలూ ఉంటాయి. సందర్భం వచ్చినపుడు అవి బయటపడుతూ ఉంటాయి. ఒక్క మనిషిలోనే ఎన్నో షేడ్స్, ఎన్నో కోణాలు, మరెన్నో రూపాలు. ఒక మనిషి నిండు జీవితం తీసుకుంటే అన్నీ దైవిక లక్షణాలతోనే సాగేడా అంటే డౌటే. ఎందుకంటే ఇక్కడ సమస్య మనిషి కాదు పరిస్థితులు.

వారే బెటర్ :

అసురులు పాత కాలంలో చాలా భయంకరంగా ఉంటారని అంటారు. అయితే ఎవరూ చూడలేదు, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో అలా పాత్రలను తీర్చిదిద్దారు. వాటిని ప్రమాణంగానే రాక్షసుడు కడు భయంకరుడు. రూపం చూస్తేనే తెలిసిపోతాడు. మాట తీరుతో హావ భావ ప్రకటనలతో ఇంకా తెలిసిపోతాడు. అయితే ఈ తరహా రాక్షసులతో కొంత సుఖం ఉంది. ముందు జాగ్రత్త పడవచ్చు. రూపాలు కర్కశంగా కనిపిస్తాయి కాబట్టి వీలుంటే తప్పించుకోవచ్చు.

నయా అసురులు :

అసలు సమస్యల్లా ఈ నయా అసురులతోనే వస్తోంది. వీరు మేక వన్నె పులులు. పైకి నవ్వుతూ ఉంటారు. అందంగా కనిపిస్తారు. పూర్తిగా నమ్మ బుల్ గా ఉంటారు. అలాగని నమ్మేస్తే చాలు ప్రాణాలు తీస్తారు. తడి గుడ్డతో గొంతు కోస్తారు. వీరు మంచివారిగా కనిపిస్తూనే ముంచే వారుగా ఉంటారు. అయితే వీరి గుట్టు ఎలా తెలుస్తుంది అంటే దిగే దాకా లోతు తెలియదన్నట్లుగా వీరి బారిన పడి బలి అయిపోయేదాకా అసలు తెలియదు. ఆ మీదట తెలిసినా లాభం ఉండదు. అంటే భయపడాల్సింది ఈ నయా అసురుల గురించే అన్న మాట.

గజానికొకడు :

గజానికొకడు గాంధారీ పుత్రుడు అని కవి బాలగంగాధర్ తిలక్ కవిత రాశారు. గాంధారీ పుత్రుడు అంటే దుర్యోధనుడు అన్న మాట. నిజానికి దుర్యోధనునికి మరో పేరు సుయోధనుడు. అంటే మంచి వాడు కిందనే తన వారికి లెక్క. పగ వారికే ధుర్యోధనుడు అన్న మాట. మరి ఆ కాలంలో వీరు భయంకరమైన అసురులుగా కనిపించారు అవతల పక్షానికి కానీ తమ పక్షానికి మాత్రం మహా రాజులుగా రారాజులుగా కనిపించారు. అంటే వీరిని రెండవ కోణంలో చూసేవారికే ప్రమాదం అన్న మాట. కానీ గజానికి ఒక గాంధారి పుత్రుడు ఉన్న ఈ లోకంలో వీరి బారిన పడిన వారికి ఇంతే సంగతులు. ఎందుకంటే వీరు మభ్యపెట్టి మోసం చేసేవారు. వంచించి వధించేవారు. ఆధునిక కాలంలో అన్ని చోట్లా తిష్ట వేసుకుని కూర్చుకున్నారు. ముఖానికి పౌడర్ రాసుకున్నంత తేలికగా మంచితనాన్ని పూసుకుని నటిస్తున్నారు.

ఎక్కడో అనుకుంటే :

అసురులు అని వారు ఎక్కడో ఉన్నారని భావిస్తే పప్పులో కాలేసినట్లే. అసురుడు అని ముఖం మీద రాసి పెట్టి ఉండదు కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకూ అనుమానం చూపులతోనే ముందుకు సాగాల్సిందే. ఏది నుయ్యి ఏది గొయ్యి అని క్షణక్షణ పరీక్ష చేసుకుంటూ స్వీయ పరిశీలన చేసుకుంటూ సాగాలి. ఈ అసుర గణాన్ని కనిపెట్టి పని పట్టడం ఆ దేవ దేవుళ్లకూ సాధ్యపడదు కాబట్టే కలియుగంలో వారు కూడా అవతారాలు ఎత్తడం మానేసారు. కానీ రాక్షస గణాలు మాత్రం వేల రూపాలలో జనాల మధ్యనే తిరుగుతున్నాయి. కాటు వేసి వేటు వేసి తమ కసిని చాటుకుంటూనే ఉన్నాయి.




 


నరకాసురుడైతే :

దీపావళి పండుగ అంటే నరకాసుర వధ అని అంటారు. దసరా అయిటే మహిషాసురుని వధించి చేసుకునే పండుగ అని చెబుతారు. అయితే పాపం వీరంతా అనిపిస్తుంది. ఎందుకంటే వారి కంటే అరవీర భయంకరులు తిరుగుతున్న వర్తమానంలో వారినే ఇంకా విలన్లుగా చూస్తూ వారే ప్రమాదం అని భావిస్తూ అదే తీరున ఆత్మ వంచన చేసుకుంటూ సాగుతున్న లోకానికి కాలం ఇచ్చే సందేశం ఒక్కటే. ఇది కలికాలం సుమా అని. ఇక్కడ అడుగుకో అసురుడున్నాడు తస్మాత్ జాగ్రత్త అని. 

Tags:    

Similar News