సింగర్ మరణం చుట్టూ తిరుగుతున్న అసోం అసెంబ్లీ ఎన్నికలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలకు భిన్నంగా అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్టార్ సింగర్ మరణం ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది.;
అసోం అన్నంతనే గుర్తుకు వచ్చే తేయాకు తోటలు.. బ్రహ్మపుత్ర నది మాత్రమే కాదు.. ఆ రాష్ట్ర ప్రజల మనసుల్ని దోచిన ఒక గాయకుడు ఉన్నాడు. అతనే జుబీన్ గార్గ్. గాయకుడిగా.. నటుడిగా.. సామాజిక కార్యకర్తగా అతను అసోం ఆస్తిత్వానికి ప్రతీగా చెబుతారు. 52 ఏళ్ల ఆయన గత ఏడాది సెప్టెంబరు 19న సింగపూర్ లోని ఒక హోటల్ ఈత కొలనులో మరణించారు. ఆయన మరణం ఒక వార్తగా కాకుండా.. అంతర్జాతీయ వివాదంగా.. అసోం రాష్ట్ర రాజకీయాల్ని శాసించే అంశంగా మారింది.
అస్సామీ.. బెంగాలీ.. హిందీతో కలిపి దాదాపు 40 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడిన రికార్డు అతని సొంతం. బాలీవుడ్ లో గ్యాంగస్టర్ మూవీలో ‘యా అలీ’ పాటతో ఆయన పేరు మారుమోగింది. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సింగర్ తన విదేశీ పర్యటనలో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన మరణం అసోం రాష్ట్ర ప్రజలకు భారీ షాక్ గా మారింది. వారంతా శోకసంద్రంలో మునిగారు.
ఆయన మరణం ఎప్పుడు.. ఎలా జరిగిందన్నవివరాల్లోకి వెళితే.. గత ఏడాది సెప్టెంబరులో సింగపూర్ లో నార్త్ ఈష్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. లాజరస్ ద్వీపం సమీపంలో స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగినట్లుగా చెబుతున్నారు. మొదట్లో అందరూ ఇదో దురదృష్టకర ప్రమాదంగానే భావించారు. సింగపూర్ కోర్టు నివేదిక ప్రకారం ఆయన రక్తంలో అధిక మొత్తంలో మద్యం ఉందని.. ఆయన ఫిట్స్ వ్యాధి ఉండటంతో అది కాస్తా ప్రాణాంతకంగా మారినట్లుగా చెబుతున్నారు. ఆయన మరణంపై సింగపూర్ నివేదికను అసోం ప్రభుత్వంతో పాటు.. జుబీన్ కుటుంబం సైతం తిరస్కరించాయి. ఆయన సతీమణి గరిమా సాకియా గార్గ్ పలు ప్రశ్నల్ని లేవనెత్తారు.
- ఆయనకు ఫిట్స్ సమస్య ఉందని తెలిసినా.. లైఫ్ జాకెట్ లేకుండా నీటిలో వెళుతుంటే మేనేజర్.. సిబ్బంది ఎందుకు ఆపలేదు?
- జుబీన్ సంపదను ఆయన మేనేజర్ సిద్ధార్థ శర్మ గడిచిన కొంతకాలంగా దారి మళ్లించినట్లుగా ఆధారాలు లభించాయి. ఆయన మరణానికి కొన్నిరోజుల ముందు పెద్ద మొత్తంలో నిధులు బదిలీ జరిగాయి. వాటి లెక్కేంటి? అవెక్కడికి వెళ్లాయి?
- ఆయన టీంలోని ఒక సభ్యుడు జుబిన్ నోటి నుంచి నురగ రావటం చూసినట్లుగా పేర్కొన్నారు. అది విష ప్రయోగమా? అన్నది ప్రశ్న.
- సింగపూర్ లో జుబీన్ ఆరోగ్యం క్షీణించినా.. ఆయన్ను ఒంటరిగా ఈతకు ఎలా అనుమతిస్తారు? ఆయన్ను ఈతకు పంపటంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఉంది
- నిందితు ఫోన్ల నుంచి డిలీట్ చేసిన కొన్ని సందేశాలను రికవర్ చేస్తే అందులో జుబీన్ ఆస్తుల గురించి చర్చలు జరిగినట్లుగా ఉన్నాయి.
ఈ కేసును విచారణలో కొన్ని అంశాలు వెలుగు చూవాయి. స్విమ్మింగ్ ఫూల్ లో దిగే సమయంలో జుబీన్ గార్గ్ మొదట లైఫ్ జాకెట్ ధరించారని.. అది సరిగ్గా లేకపోవటంతో దాన్ని తీసేసి మళ్లీ నీటిలోకి వెళ్లినట్లుగా సింగపూర్ అధికారుల విచారణలో వెల్లడైనట్లు ప్రకటించారు. ఆయనకు ఈత వచ్చు కాబట్టి.. మునిగిపోయే ప్రసక్తే లేదని ఆయన సన్నిహితులు వాదిస్తున్నారు. ఆయనకు ఫిట్స్ సమస్య ఉన్ననేపథ్యంలో ఆయన మేనేజర్ ఆయన్ను ఈతకు ఎలా అనుమతించారు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
ఆయన మరణంపై వెల్లువెత్తుతున్న సందేహాల నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) వేశారు. ఈ కేసుకు సంబంధించి బాబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ.. ఈవెంట్ నిర్వాహకుడు శ్యామ్ కాను మహంతతో పాటు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. దాదాపు 300 మంది సాక్ష్యుల వాంగ్మూలాలతో 3500 పేజీల భారీ ఛార్జిషీట్ ను సమర్పించారు. ఇందులో నిందితులపై హత్య కేసును నమోదు చేశారు. ప్రస్తుతం గౌహతిలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి.. ఈ కేసును రోజువారీగా విచారిస్తున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మిస్టరీ మరణం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది.
అసోం ముఖ్యమంత్రి బిశ్వంత శర్మ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. సింగపూర్ కోర్టు నివేదిక ఏదైనా కావొచ్చు. కానీ.. మనసిట్ సేకరించిన ఆధారాలు ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా చెబుతున్నాయి. జుబీన్ మరణానికి కారణమైన ఏ ఒక్కినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన సొంత సోదరుడు కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. గతంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ జుబీన్ గార్గ్ మరణం కేసులో తమ ప్రభుత్వం న్యాయం చేయలేకపోతే.. ప్రజలు బీజేపీకి ఎన్నికల్లో ఓటు వేయొద్దని ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల వేళ.. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా సంధిస్తున్నాయి.
ఇక.. విపక్ష కాంగ్రెస్ అయితే.. జస్టిస్ ఫర్ జుబీన్ పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 54 గ్యారెంటీల్లో తాముఅధికారంలోకి వస్తే 100 రోజుల్లో జుబీన్ మరణం వెనుక ఉన్న కుట్రను ఛేదించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం గమనార్హం. ఇక.. జుబీన్ కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయం కోసం వాడుకోకూడదని.. తమకు కేవలం న్యాయం కావాలని కోరినప్పటికి.. పార్టీలు మాత్రం ఆయన మరణాన్ని తమ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించటం గమనార్హం.
తాజాగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సైతం అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో (బిశ్వనాథ్ చరియాలీలో నిర్వహించారు) మాట్లాడుతూ.. ‘అసోంకు చెందిన దివంగత గాయకుడు జుబిన్ గర్గ్ రాష్ట్ర ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన జీవితాంతం క్రషి చేశారు. ఆయన ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదు. మా పార్టీ భావజాలం కూడా అలాంటిదే. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచటమే మా సిద్ధాంతం. మేం అధికారంలోకి వస్తే జుబిన్ మ్రతి కేసులో నిందితులను 100 రోజుల్లో శిక్షిస్తాం’’ అని ప్రస్తావించటం గమనార్హం.
తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో సింగర్ జుబిన్ మరణం ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జుబీన్ సతీమణి తరచూ తన భర్త మరణాన్ని ఓట్ల కోసం వాడుకోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు కావాల్సింది కేవలం న్యాయం మాత్రమేనని.. రాజకీయం కాదన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా నిజానిజాలు బయటకు రావాలని ఆమె కోరుతున్నారు.