వంగవీటి ఆశ..... వెనుక ఎవరున్నారు?!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా కుటుంబం నుంచి ఆయన కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ అరంగేట్రం చేశారు.;
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా కుటుంబం నుంచి ఆయన కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే.. ఇప్పటికిప్పుడు ఏ పార్టీ అనేది ఆమె చెప్పకపోయినా.. ప్రస్తుతానికి ప్రజాసేవకు పరిమితం అవుతానన్నారు. కానీ, భవిష్యత్తులో మాత్రం ఆమె రాజకీయంగా అడుగులు వేయడం ఖాయమని చెప్పారు. రాధా-రంగా మిత్ర మండలిలో చోటు చేసుకున్న గ్యాప్ కారణంగానే తాను వస్తున్నట్టు ప్రకటించారు.
అయితే.. సహజంగానే ఒక వ్యక్తి రాజకీయాల బాట పట్టారంటే.. ఆ వ్యక్తి వెనుక ఎవరు ఉన్నారు..? అనేది ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఈ కోణంలోనే ఇప్పుడు ఆశా కిరణ్ రాజకీయ అరంగేట్రం వెనుక.. ఎవరు ఉన్నారు? ఏ పార్టీ ఆమెను లీడ్ చేస్తోంది? అన్నది కూడా ఆసక్తిగా మారింది. దీనిపై రాజకీయ పరిశీలకు లు పలు వాదనలు చెబుతున్నారు. ప్రధానంగా వైసీపీ ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. కాపులను మచ్చిక చేసుకునేందుకు వైసీపీ గతంలోనూ అనేక ప్రయత్నాలు చేసింది.
ఈ క్రమంలోనే వంగవీటి కుమారుడు రాధాకృష్ణకు 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ ను ఇచ్చింది. కానీ, ఆయన పరాజయం పాలయ్యారు. 2019లో టికెట్ ఇవ్వలేదు. ఇక, 2024 నాటికి రాధా.. పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు. ఈ పరిణామాలతో వైసీపీకి వంగవీటి కుటుంబం దూరమైంది. ఈనేపథ్యానికి తోడు జనసేన పార్టీ కాపులకు దన్నుగా మారింది. దీంతో ఇప్పుడు కాపులను మచ్చిక చేసుకునేందుకు రాధా కుమార్తె ఆశా కిరణ్‌ను వైసీపీ రాజకీయాల్లోకి దింపుతోందన్న చర్చ తెరమీదికి వచ్చింది.
అయితే.. దీనిలో వాస్తవం ఎంత? అనేది చూడాలి. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీలో ఇప్పటికే రాధా ఉన్నారు. కాబట్టి.. ప్రత్యేకంగా ఆశా కిరణ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఆమె వస్తే కాదనరు. కానీ పనిగట్టుకుని ఆమెను ఎవరూ ప్రోత్సహించే పరిస్తితి టీడీపీలో లేదు. ఇక, జనసేన విషయానికి వస్తే.. కాపు సామాజిక వర్గానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఐకాన్ నాయకుడు. కాబట్టి.. వారికి కాపులను ఆకర్షించేందుకు ప్రత్యేక నాయకులు అవసరం లేదు. సో.. ఈ పరిణామాలను అంచనా వేస్తే.. ఆశా కిరణ్ రాక వెనుక వైసీపీ ఉందన్న చర్చకు బలం చేకూరుతోంది.