చైనాకు షాక్.. ఇక ఇండియాలోనే ఐఫోన్ల తయారీ
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.., అమెరికా మార్కెట్‌లో విక్రయించే ఐఫోన్‌ల తయారీ మొత్తాన్ని భారత్‌కు తరలించాలని కంపెనీ యోచిస్తోంది.;
అమెరికా వర్సెస్ చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఒకరిపై ఒకరు భారీగా సుంకాలు విధించుకుంటుండటంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు గణనీయమైన మార్పులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల భారం నుండి తప్పించుకోవడానికి.. సరఫరా గొలుసులను విస్తరించడానికి టెక్ దిగ్గజం యాపిల్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.., అమెరికా మార్కెట్‌లో విక్రయించే ఐఫోన్‌ల తయారీ మొత్తాన్ని భారత్‌కు తరలించాలని కంపెనీ యోచిస్తోంది.
వివిధ ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.., యాపిల్ తన అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల ఉత్పత్తి ప్రక్రియను పూర్తిగా భారత్ కేంద్రంగానే జరిగేలా వ్యూహాలు రచిస్తోంది. 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.., అమెరికా వెలుపల తయారవుతున్న ఐఫోన్‌లలో దాదాపు 80 శాతం చైనాలో ఉత్పత్తి అవుతుండగా, భారత్ వాటా కేవలం 14 శాతం మాత్రమే ఉంది.
అయితే చైనా నుంచి అమెరికాకు ఐఫోన్లను దిగుమతి చేసుకుంటే దాదాపు 145 శాతం వరకు అధిక సుంకాలు చెల్లించవలసి వస్తోంది. ఈ అధిక వ్యయం యాపిల్‌పై ఆర్థిక భారాన్ని పెంచుతోంది. దీని కారణంగా అమెరికా మార్కెట్‌లో చైనా , భారత్‌లో తయారయ్యే ఐఫోన్‌ల ధరల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించి సుంకాల భారం తగ్గించుకోవడానికి యాపిల్ తన తయారీ కేంద్రాన్ని పూర్తిగా భారత్‌కు మార్చాలని యోచిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే భవిష్యత్తులో అమెరికా మార్కెట్‌లో 'మేక్ ఇన్ ఇండియా' ఐఫోన్‌లే దర్శనమిస్తాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి చైనాతో వాణిజ్యపరమైన విభేదాలు తీవ్రమయ్యాయి. దీని ఫలితంగా యాపిల్‌తో సహా అనేక బహుళజాతి సంస్థలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకొని, బలమైన ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ఇదే సమయంలో, 2020లో భారత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్‌లపై తయారీ ఆధారిత ప్రోత్సాహకాలను (పొడక్షన్ లింక్డ్ ఇన్ సెంటివ్ ) ప్రకటించింది. ఈ పథకం యాపిల్‌ను భారత్‌లో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను ప్రారంభించేలా బాగా ప్రోత్సహించింది.
గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను తయారు చేసింది. ఇందులో 18 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను సంస్థ ఇతర దేశాలకు ఎగుమతి చేయడం విశేషం. ఇది భారత్‌లో తయారీ కార్యకలాపాలు ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నాయో తెలియజేస్తుంది.
- భారత్‌పై ప్రభావం:
యాపిల్ ఈ నిర్ణయం భారతదేశ తయారీ రంగానికి ఒక పెద్ద ప్రోత్సాహాన్నిస్తుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. తయారీ కార్యకలాపాలు పెరగడం వల్ల దేశీయంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. అదే సమయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్న ఇతర అంతర్జాతీయ కంపెనీలకు కూడా యాపిల్ నిర్ణయం ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.
ఈ పరిణామాలు భారత్‌ను గ్లోబల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.