ఏపీ రాజకీయాల్లో కానరాని కామ్రేడ్లు!

అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగతున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో కామ్రేడ్ల జాడ కానరావడం లేదు. సరిగ్గా పోలింగ్ కు కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉంది.

Update: 2024-04-13 10:30 GMT

కమ్యూనిస్టు పార్టీలు అంటే గతంలో ప్రజలకు ఓ క్రేజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయంటే కామ్రేడ్లతో పొత్తుకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తహతహలాడేవి. కామ్రేడ్లతో జతకట్టిన వారే అధికారంలోకి రావడం ఖాయంగా ఉండేది. కాలక్రమంలో కమ్యూనిస్టు నేతలు మిగతా బూర్జువా పార్టీల మాదిరిగా మారిపోయి ప్రజాస్వామ్యంగా కాకుండా వ్యక్తిస్వామ్య పోకడల మూలంగా కమ్యూనిస్టు పార్టీల ప్రభ మెల్లగా మసకబారడం మొదలయింది.

1999 ఎన్నికలలో కొత్తగా చంద్రబాబు నాయుడు బీజేపీతో జతకట్టడంతో ఉమ్మడి రాష్ట్రంలో కొత్త పొత్తులకు తెరలేచింది. 2004 ఎన్నికలలో వైఎస్ కమ్యూనిస్టులతో జతకట్టి అధికారంలోకి వచ్చాడు. 2009 ఎన్నికల వరకు కమ్యూనిస్టు నేతలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుని వైఎస్ కమ్యూనిస్టుల బలాన్ని దెబ్బతీశాడు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే కమ్యూనిస్టు పార్టీలు నామమాత్రంగా మారాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సీపీఐ పార్టీ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచినా అది కాంగ్రెస్ పొత్తు, వ్యక్తిగత ప్రభావం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే గెలిచారు తప్పితే సీపీఐ బలం మీద కాదు. ఇక సీపీఎం పార్టీ పోటీ చేసినా ఎక్కడా తన సత్తా చాటలేకపోయింది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగతున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో కామ్రేడ్ల జాడ కానరావడం లేదు. సరిగ్గా పోలింగ్ కు కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ గురించి ఏ విషయం కూడా వెల్లడించడం లేదు. సీపీఎంతో పోల్చుకుంటే సీపీఎం ఈ విషయంలో ఒక అడుగు ముందుంది. అయితే సుధీర్ఘ అనుభవం కలిగిన కమ్యూనిస్టు నేతలు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచించడం, దానికి షర్మిల అనుమతి అవసరం పడడం నిజంగా కమ్యూనిస్టులకు అగౌరవమే.

Read more!

ఎన్నికలు దగ్గర పడడంతో తప్పనిసరి పరిస్థితులలో పోటీకి సిద్దపడి సీపీఎం పార్టీ ఎనిమిది శాసనసభ స్తానాలతో పాటు అరకు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడానికి నిర్ణయించారు. ఇక సీపీఐ పార్టీకి కేటాయించిన స్థానాల లెక్క ఇంతవరకు తేలలేదు. ఆ పార్టీకి కూడా అంతే స్థాయిలో సీట్లు కేటాయించే అవకాశం కనబడుతున్నది. ఒకప్పుడు శాసించే స్థాయి నుండి కమ్యూనిస్టులు ప్రస్తుతం యాచించే స్థానానికి వచ్చారు.

తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విభజనతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ సారి ఎన్నికలలో కూడా అది ఒక, అరా స్థానాలు గెలిచేది అనుమానమే. కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు దక్కినా ఆశ్చర్యమే. అలాంటి పార్టీతో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనుకోవడం కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదడమే అని చెప్పాలి. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీలు భవిష్యత్తులో మనుగడ సాగించడం అనుమానమే అని చెప్పాలి.

Tags:    

Similar News