డ్వాక్రా మహిళకు రూ.1.25 కోట్ల రుణం.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అత్యధికం!

దేశంలోని అసంఘటిత రంగంలో ఉన్న చిన్న ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.;

Update: 2025-10-18 06:43 GMT

బ్యాంకుల నుంచి రూ.లక్ష, రెండు లక్షల రుణం కావాలంటేనే నానా తిప్పలు ఎదుర్కోవాల్సివుంటుంది. ఐదెంకల జీతం, మంచి సిబిల్ స్కోరు, ష్యూరిటీలు ఉన్న వారికి రూ.5 నుంచి రూ.10 లక్షలు రుణాలిస్తారు. అదే కోటి రూపాయలు రుణం తీసుకోవాలంటే సామాన్యులకు సాధ్యమా? అంటే అసాధ్యమనే చెప్పాలి. కానీ, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన "వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్" కార్యక్రమం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ‘‘ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్’’ (PMFME) అనే పథకం ద్వారా డ్వాక్రా మహిళకు అక్షరాలా ఒక కోటి పాతిక లక్షల రూపాయల రుణం మంజూరు అయ్యేలా చేసింది.

దేశంలోని అసంఘటిత రంగంలో ఉన్న చిన్న ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం PMFME పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు ఊతమివ్వడం, ఆర్థిక భరోసా కల్పించి ఆయా యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేలా చేయూత అందించాలని నిర్ణయించింది. అర్హులైన వ్యక్తులు లేదా సంస్థలకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం లేదా గరిష్టంగా రూ.పది లక్షల మేర సబ్సిడీ ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)కు మద్దతు ఇవ్వాలని భావించి ఒక్కో సభ్యురాలికి రూ.40 వేల మూల ధనం మంజూరు చేయనుంది. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి విధానం తీసుకువచ్చి వాల్యూ చైన్ అభివృద్ధి చేయాలని కేంద్రం భావించింది. అయితే ఈ స్కీమును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

రాష్ట్రంలో ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు "వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్" తీసుకువచ్చారు. ఈ పథకం కింద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించి మెప్మాకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం మహిళలకు రుణాలు ఇచ్చే విషయమై బ్యాంకర్లతో సంప్రదిస్తున్న అధికారులు మంగళగిరికి చెందిన ఓ మహిళకు రూ.కోటి 25 లక్షల రుణం అందేలా చర్యలు తీసుకున్నారు. యువనేత లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరికి చెందిన శ్రీ సాయి కృష్ణ స్వయం సహాయక సంఘం సభ్యురాలు వై.మాధురి తన నెయ్యి ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధికి PMFME కింద రూ.కోటి 25 లక్షల రుణానికి అర్హత సాధించారు.

డ్వాక్రా సంఘాల చరిత్రలోనే ఇదే వ్యక్తిగత రుణంగా రికార్డులు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ డ్వాక్రా మహిళ ఇంతవరకు ఈ స్థాయిలో భారీ మొత్తం రుణంగా తీసుకోలేదు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా ఉండవిల్లి బ్రాంచి అధికారులు, మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ కలిసి శుక్రవారం రుణ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. మంగళగిరికి చెందిన మాధురి నెయ్యి ఉత్పత్తి పరిశ్రమను నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె యూనిట్‌లో 10 మంది మహిళలు పనిచేస్తున్నారు. తన యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ఉన్న మాధవి మెప్మా ద్వారా ప్రయత్నించగా, రూ.కోటి 25 లక్షల రుణం మంజూరైంది.

Tags:    

Similar News