సర్...వైసీపీ సరిపోవడం లేదా ?
ఏపీలో సర్ మొదలై ఇరవై రోజులు పూర్తి అవుతోంది. మరో పది రోజులలో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఏపీలో సర్ మొదలై ఇరవై రోజులు పూర్తి అవుతోంది. మరో పది రోజులలో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. జూన్ 15న మొదలైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్ జూలై 14తో కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత జూలై 21న తుది జాబితా విడుదల అవుతుంది. ఇక సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ సర్వే చేయడం, వివరాల సేకరణ పత్రాలను పంపిణీ చేసి సేకరించడం అలా వచ్చిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటి పనులు ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇలా ఈ మొత్తం ఈ ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుంది. తుది ఓటర్ల జాబితా 2026 సెప్టెంబర్ 22న ప్రచురించబడుతుంది. ఆ మీదట గల్లంతు అయిన పేర్లు చేర్చడం అంటే మాత్రం చాలా కష్టమే అని చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.
సగం కూడా పూర్తి కాలేదు :
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ సర్ సగానికి కంటే తక్కువగానే నమోదు అయింది అని అంటున్నారు. ఆంధ ప్రదేశ్ రాష్ట్రంలో 4.16 కోట్ల ఓటర్ల గణన పత్రాలు ఇప్పటి దాకా చాలా వరకూ పంపిణీ చేయబడ్డాయి. అయితే అక్కడ వివరాలను సేకరించిన ఈ పత్రాలను డేటాబేస్‌లోకి డిజిటలైజ్ చేసే ప్రక్రియ చూస్తే మాత్రం సుమారు 42 వదనే నిలిచిపోయింది దాంతో సర్ ప్రక్రియ సాగాలి అంటే మరింత కాలం అదనపు గడువు కావాల్సి ఉందని విపక్షాలు అంటున్నాయి.
కొత్తగా పేర్ల నమోదుకు :
ఇక ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. అలాగే మరణించిన వారి లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను తొలగించడానికి ఫారం-7ను ఉపయోగించవచ్చునని అంటున్నారు. చిరునామా, వయస్సు లేదా పేరు వంటి వివరాలలో సవరణల కోసం ఫారం-8ను వినియోగించవచ్చని చెబుతున్నారు. ఇక సర్ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని ఇప్పటికే వారి ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని అధికారులు అంటున్నారు. బూత్ స్థాయి ఏజెంట్లకు అవసరమైన సమాచారం అందేలా చర్యలు తీసుకున్నామని కూడా చెబుతున్నారు. రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన సూచనలు మరియు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఈ ప్రక్రియ ముందుకు సాగుతోందని వివరించారు.
గడువు పొడిగించాల్సిందే :
ఇక ఏపీలో సర్ ప్రక్రియ కింద నమోదు 36 సాతం కూడా దాటలేదని వైసీపీ అంటోంది. మొత్తం పూర్తి కావాలనీ అంటే మొరో నెల రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతోంది. చాలా చోట్ల బీఎల్వోలు గణన పత్రాలను జనాలకు అందించడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. అలా అందించిన చోట్ల వాటిని ఎలా నింపాలో కూడా ఓటర్లకు తెలియడం లేదని అంటున్నారు. వీటిని తీసుకుని డిజిటలైజేషన్ ద్వారా నమోదు చేయడం ఇదంతా ఒక పెద్ద ప్రక్రియ అని అంటున్నారు. దీని మీద వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సర్ గడువుని కనీసంగా నెల రోజుల పాటు అయినా పొడిగించాలని కోరారు. మరి సర్ ప్రక్రియ గడువు పొడిగిస్తారా లేదా అనేది చూడాలి. ఈ తక్కువ గడువులోగా అందరి వివరాలు నమోదు చేయడం జరుగుతుందా లేదా అంటే అంతా బాగానే అవుతోంది అని అధికారులు అంటున్నారు. వైసీపీ తదితర పక్షాలు మాత్రం గడువు పెంచమంటున్నాయి.