చిన్నమ్మకు కీలక పదవి...ఓకేనా ?

రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ జాతీయ నాయకత్వం కీలక భూమిక అప్పగించాలని చూస్తోంది. తొందరలో ఆ పదవిలో చిన్నమ్మని కూర్చోబెట్టాలనుకుంటోంది.

Update: 2026-07-05 03:59 GMT

రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ జాతీయ నాయకత్వం కీలక భూమిక అప్పగించాలని చూస్తోంది. తొందరలో ఆ పదవిలో చిన్నమ్మని కూర్చోబెట్టాలనుకుంటోంది. ఇంతకీ ఏమా పదవి అంటే పార్టీలో జాతీయ స్థాయిలో ముఖ్యమైన హోదా అని అంటున్నారు. ఇప్పటిదాకా పురంధేశ్వరి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా జాతీయ మహిళా మోర్చా పదవిని చేపట్టి ఉన్నారు. ఆమె 2024లో లోక్ సభ ఎంపీ అయ్యారు. ఆమె కేంద్ర మంత్రి కావాలని కోరుకుంటున్నారు అన్నది తెలిసిందే. అయితే సామాజిక ప్రాంతీయ సమీకరణలే ఆమె పదవికి అడ్డంకిగా మారాయని అంటున్నారు.

నితిన్ నబీన్ బృందంలో :

ఈ క్రమంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఆ మధ్యన ప్రమాణం చేసిన నితిన్ నబీన్ తన జాతీయ కార్యవర్గాన్ని అయితే ఇప్పటిదాకా ప్రకటించలేదు. తాజాగా దీని మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో నితిన్ నబీన్ అలాగే బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సమావేశం జరిగింది. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన అనేక అంశాలను చర్చించారు అని అంటున్నారు. ఈసారి బీజేపీ జాతీయ కార్యవర్గంలో సీనియర్లతో పాటు కొత్త వారికి కూడా చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. 2029 లో మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ గెలిచేలా ఈ ఎంపికలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా దక్షిణాదికి ప్రాధాన్యత ఇస్తారు అని అంటున్నారు.

పురంధేశ్వరి పేరు :

ఈ క్రమంలో ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి మూడు సార్లు ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అని అంటున్నారు. ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం సాధ్యపడకపోవడంతో కీలకమైన పార్టీ పదవిని ఇచ్చి గౌరవించాలని తద్వారా ఆమె సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు. బీజేపీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు అత్యంత కీలకంగా ఉంటుంది. ఇందులో మెంబర్ గా ఉండేవారికి జాతీయ స్థాయిలో పట్టు దొరుకుతుంది. అలాగే పార్టీలో కేంద్ర ఎన్నికల కమిటీ ఉంటుంది. జాతీయ కౌన్సిల్ కూడా కీలకంగా పార్టీలో పనిచేస్తుంది. వీటితో పాటు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వంటి కీలక హోదాలతో పదవులు ఉంటాయి. దీంతో పురంధేశ్వరికి జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగిస్తారు అని అంటున్నారు.

ఇదే లాస్ట్ చాన్స్ గా :

నిజానికి ఆమెకు కేంద్ర మంత్రి పదవి కేబినెట్ ర్యాంక్ తో దక్కుతుందని అభిమానులు అంతా ఎదురుచూస్తున్నారు. యూపీయే ప్రభుత్వంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఇండిపెండెంట్ చార్జితో చేశారు. కీలక శాఖలను ఆమె చూశారు. దాంతో ఈసారి ఆమెకు బీజేపీ నుంచి కేబినెట్ హోదాతో పాటు కీలక మంత్రిత్వ శాఖలు దక్కుతాయని కూడా అనుకున్నారు. పురంధేశ్వరి అయితే 2004 కి ముందు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆమె రెండున్నర దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వస్తున్నారు. 2029 తరువాత రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆమె చూస్తున్నారని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టి రాజకీయ విరమణ ప్రకటిస్తారు అని అంటున్నారు. కానీ ఇపుడు బీజేపీ పెద్దలు అయితే పార్టీ పదవి అంటున్నారని ప్రచారంలో ఉంది. మరి ఈ పదవి చిన్నమ్మకు ఓకేనా అన్నదే చర్చగా ఉంది మరి. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News