గంటా వర్సెస్ పల్లా...మధ్యలో రాజు గారు !
విశాఖ జిల్లాలో మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో సీరియస్ గా రేసులో ఉన్న వారిగా ఈ ముగ్గురు నేతల పేర్లను ప్రచారం చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో సీరియస్ గా రేసులో ఉన్న వారిగా ఈ ముగ్గురు నేతల పేర్లను ప్రచారం చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ ఈ శ్రావణ మాసం ఉండవచ్చు అని అంటున్నారు. దాంతో ఆగస్టు నెల అంటే దగ్గరలో ఉంది కాబట్టి మంత్రి పదవుల మీద ఆశపడుతున్న వారిలో వారి వర్గీయులలో చురుకుదనం పుడుతోంది అని అంటున్నారు. ఇక విశాఖ జిల్లాకు 2024లో మంత్రి పదవి దక్కలేదు అన్నది తెలిసిందే. ఆ మాటకు వస్తే వైసీపీ కూడా 2022 తరువాత జరిపిన విస్తరణలో విశాఖ జిల్లా భీమిలీకి చెందిన అవంతి శ్రీనివాస్ ని మంత్రి పదవి నుంచి తప్పించేసి అనకాపల్లికి చెందిన గుడివాడ అమర్నాధ్ కి ఇచ్చింది. అంతే కాదు మాడుగులకు చెందిన బూడి ముత్యాలనాయుడుకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అలా విశాఖ జిల్లాకు గడచిన నాలుగేళ్ళుగా మంత్రి పదవి అన్నది లేకుండా పోయింది అని అంటున్నారు.
ఈసారి గ్యారంటీగా :
మరో మూడేళ్ళలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఎన్నికల నాటికి విశాఖ జిల్లాను ముందంజలో నడిపించాల్సి ఉంది. అంతే కాదు అనేక కంపెనీల్ విశాఖ జిల్లాకు తరలి వస్తున్నాయి. వాటిని కో ఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంది. ఇక రాజకీయ పరంగా చూసినా కూడా విశాఖ జిల్లా కీలకంగా మారుతోంది. జీవీఎంసీ ఏపీలోనే అత్యధిక వార్డులతో పెద్దదిగా మారబోతోంది. దానికి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కూటమిని మళ్ళీ గెలిపించాలి అంటే విశాఖకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్నది కూడా పెద్దగా వినిపిస్తోంది. దీంతో ఈసారి విశాఖ నుంచి మంత్రిని చూడబోతున్నారు అని అంటున్నారు.
గంటాకు ఇస్తారా :
గత టీడీపీ ప్రభుత్వంలో విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు మంత్రిగా అయిదేళ్ల పాటు పనిచేశారు. జిల్లాలో పార్టీని అంతా కట్టుగా ఉంచారు, అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఆయన అనుభవం గట్టిగా చేసే రాజకీయం వ్యూహాత్మక వైఖరి అన్నీ చూసుకుంటే కూటమిలోని మూడు పార్టీల మధ్య కో ఆర్డినేషన్ తీసుకుని రావడమే కాకుండా జిల్లాలో అభివృద్ధికి కూడా కృషి చేస్తారు అని అంటున్నారు. ఆయన భీమిలీ నియోజకవర్గంలోనే ఎక్కువ కంపెనీలు వచ్చాయి. వాటి భూసేకరణ విషయంలో గంటా ఎక్కువగా చొరవ తీసుకుని భూసేకరణ సాఫీగా సాగేలా చూశారు. దాంతో ఆయన పేరు అయితే మంత్రి పదవి విషయంలో మారుమోగుతోంది అని అంటున్నారు. ఆయనకు ఇస్తేనే వైసీపీని కూడా గట్టిగా కట్టడి చేయగలరు అన్న అంచనాల మధ్య గంటా కాబోయే మంత్రి అని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.
పల్లా సైతం లైన్ లో :
ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న పల్లా శ్రీనివాసరావు సైతం లైన్ లో ఉన్నారని అంటున్నారు. ఆయన పట్ల టీడీపీ అధినాయకత్వం సుముఖంగా ఉందని చెబుతున్నారు. వివాదాలు లేని తీరు అందరినీ కలుపుకుని పోయే విధానం అన్నీ కూడా ఆయనకు మంత్రి పదవి కట్టబెడితే కలసి వస్తుందని అంటున్నారు. ఇక బలమైన యాదవ సామాజిక వర్గం విశాఖ సిటీలో ఎక్కువగా ఉన్నారు, వారికి ఇప్పటిదాకా మంత్రి పదవి ఈ ప్రాంతంలో దక్కలేదు, దాంతో పల్లాకు ఈ పదవిని ఇవ్వడం ద్వారా ఆ బలమైన వర్గం మద్దతుని నూరు శాతం అందుకోవాలన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు. ఇలా అనేక లెక్కలు అనుకూలంగా ఉండడంతో పల్లా కి మంత్రి పదవి ఇస్తారు అని అంటున్నారు. దీని మీద కూడా ఊహాగానాలు బాగా వ్యాపిస్తున్నాయి.
బీజేపీ రేసులో :
మరో విశేషం ఏంటి అంటే బీజేపీ కూడా అనూహ్యంగా రేసులోకి రావడం. బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇస్తారని ప్రచారంలో ఉంది. ఏపీలో బీజేపీ గెలిచింది ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు, రాయలసీమ నుంచి సత్యకుమార్ యాదవ్ కి బెర్త్ తొలి విడతలోనె ఇచ్చారు. ఇక విస్తరణలో కనుక రెండవ మంత్రి పదవి ఇస్తారు అని కచ్చితంగా వినిపిస్తున్న మాట. దాంతో. కోస్తాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ మంత్రులు అనేక మంది ఉన్నారు. పైగా సామాజిక ప్రాంతీయ సమీకరణలు అన్నీ చూసుకుంటే ఉత్తరాంధ్రకే ఎక్కువ చాన్స్ ఉందని అంటున్నారు. విశాఖ ఉత్తరం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఆ పార్టీ సభా పక్ష నాయకుడిగా ఉన్న విష్ణు కుమార్ రాజుకు మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మంత్రి వర్గంలో క్షత్రియులకు చోటు లేదు కాబట్టి ఆ కోణంలో నుంచి చూసినా రాజు గారికి చాన్స్ ఉండొచ్చు అన్నది ఒక అంచనా. మొత్తానికి మిగిలిన వారు ఎంతో మంది ఆశపడుతున్నా ఈ ముగ్గురు పేర్లు విశాఖ జిల్లా నుంచి వినిపిస్తున్నాయి.