బోండా ఉమా...మనసులో కోరిక అదే సుమా !

తెలుగుదేశంలో సీనియర్ నాయకులలో బోండా ఉమా మహేశ్వరరావు ఒకరు. విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన రెండు సార్లు గెలిచారు.

Update: 2026-07-05 04:30 GMT

తెలుగుదేశంలో సీనియర్ నాయకులలో బోండా ఉమా మహేశ్వరరావు ఒకరు. విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన రెండు సార్లు గెలిచారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉమా నోరున్న పేరున్న నేతగానే పేరు పొందారు. దూకుడుగా రాజకీయం చేస్తారు అని కూడా గుర్తింపు ఉంది. 2014 నుంచి 2019 దాకా అసెంబ్లీ లోపలా బయటా ఆయన వాయిస్ ఎంతగా రీసౌండ్ చేసింది అన్నది అందరికీ తెలిసిందే. ఇక 2019 నుంచి 2024 మధ్యలో కూడా పోరాటాలు అనేకం చేశారు. 2024 ఎన్నికల్లో వంగవీటి రాధా ఆ సీటు ఆశించినా బోండా ఉమా మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, పైగా సొంత సీటు అని అధినాయకత్వం ఆయనకే టికెట్ ఇచ్చింది. ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన బోండాకు అన్ని విధాలుగా అనుకూలతలు ఉండడంతో మంత్రి పదవి గ్యారంటీ అని అంతా అనుకున్నారు.

అదే అసంతృప్తిగా :

అయితే 2024 లో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు అయిన కూటమి మంత్రివర్గంలో చాలా మంది కొత్తవారికి మంత్రి పదవులు దక్కాయి. అదే సమయంలో తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారు కూడా మినిస్టర్లు అనిపించుకున్నారు. కానీ బోండా ఉమాకు మాత్రం అవకాశం దక్కలేదు, దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు, ఆయన సామాజిక వర్గమే ఇపుడు మైనస్ అయింది అని అంటున్నారు. కాపులు ఏపీ కేబినెట్ లో ప్రస్తుతం అయిదారుగురు ఉన్నారు. అందులో జనసేన నుంచి ఇద్దరు ఉంటే టీడీపీ నుంచి మరో ముగ్గురు నలుగురు ఉన్నారు. దాంతో పాటు ప్రాంతీయ సమీకరణలు కూడా బోండాకు కలిసి రావడం లేదు అని అంటున్నారు. ఆయన క్రిష్ణా జిల్లా కిందకు వస్తారు. అక్కడ నుంచి కొల్లు రవీంద్ర బీసీల నుంచి మంత్రిగా ఉన్నారు. దాంతో కూడా ఆయనకు చాన్స్ మిస్ అయింది అని అంటున్నారు.

వలస నేతలకు పదవులా :

ఈ మాటలు బోండా తాజాగా రెండేళ్ళ కూటమి విజయోత్సవం సందర్భంగా అన్నారు. తాము చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవిస్తామని చెబుతూ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారి కంటే ఇతర నేతలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు అని బోండా ఉమా ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. ఆయన చెబుతున్న దాని ప్రకారం వలస నేతలు మంత్రూగా అయింది ఎవరు అని ఆరా తీస్తే ఆనం రామనారాయణరెడ్డి, అలాగే కొలుసు పార్ధసారధి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సవిత అని చెబుతున్నారు. వీరిలో తొంబై శాతం మంది వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారే. దాంతో వారికే పదవులు దక్కడం పట్ల టీడీపీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు అసంతృప్తి ఉందని అంటున్నారు, అది బోండా మాటల ద్వారా బయటపడింది అని అంటున్నారు.

కూర్పు వెనక వ్యూహాలు :

అయితే మంత్రి వర్గం కూర్పు అన్నది కత్తి మీద సాము. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక ప్రాంతీయ రాజకీయ సమీకరణలను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడానికి కూడా ఈ పదవులు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల దాని విషయంలో ఎవరికి వారుగా ఎలా విశ్లేషించుకున్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు అన్నీ ఆలోచించి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే జిల్లా నుంచి ఎక్కువ మంది సమర్ధులు ఉన్నపుడు ఒకరిద్దరితోనే సరిపెట్టాల్సి వస్తుంది. దాని వల్ల మిగిలిన వారిని తక్కువ చేసినట్లు కాదని అంటున్నారు. ఇక టీడీపీలో కాపులకు మంత్రి పదవులు పూర్తి శాతం రాకపోవడానికి మరో కారణం ఉంది అని అంటున్నారు. జనసేన కూడా ఈసారి ప్రభుత్వంలో వాటా పంచుకుంటోంది. ఆ పార్టీ నుంచి కూడా కొంత మంది ఉంటున్నారు. మొత్తానికి బోండా ఉమా అయితే మంత్రి పదవిని గట్టిగా కోరుకుంటున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఆయన కోరిక తీరుతుందా లేదా అన్నది అని అంటున్నారు.

Tags:    

Similar News